6500 కిలోల ఉపగ్రహాన్ని ప్రయోగించనున్న ఇస్రో

6500 కిలోల ఉపగ్రహాన్ని ప్రయోగించనున్న ఇస్రో

చెన్నై: అమెరికా అభివృద్ధి చేసిన 6500 కిలోల ఉపగ్రహాన్ని మరికొద్ది నెలల్లో లాంచ్ చేయనున్నామని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చైర్మన్ వి.నారాయణన్  తెలిపారు. ఆదివారం చెన్నైలోని కట్టన్ కులత్తూర్‎లో ఎస్ఆర్ఎం ఇన్ స్టిట్యూట్ ఆఫ్  సైన్స్ అండ్ టెక్నాలజీ 21వ స్నాతకోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇస్రో చైర్మన్ నారాయణన్‎కు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నెల 30న నాసా ఇస్రో సింథటిక్ అపర్చుర్ రాడార్ (నిసార్) ను ప్రయోగించామని గుర్తుచేశారు.

 ‘‘1963లో ఇస్రోను స్థాపించారు. అప్పుడు అభివృద్ధి చెందిన దేశాల కన్నా భారత్  67 ఏండ్లు వెనుకబడి ఉంది. అదే ఏడాది భారత్‎కు అమెరికా చిన్న రాకెట్‎ను డొనేట్ చేసి ఇండియన్ స్పేస్ ప్రోగ్రాంకు నాంది పలికింది. 1975లో అమెరికా ఇచ్చిన శాటిలైట్ డేటా ద్వారా దేశంలో 6 రాష్ట్రాల్లోని 2400 గ్రామాల్లో 2400 టీవీ సెట్లు ఏర్పాటు చేసి ‘మాస్  కమ్యూనికేషన్’ ను ఇస్రో ప్రదర్శించింది” అని నారాయణన్  చెప్పారు.