ఇస్రో మరో మిషన్ కు రెడీ

ఇస్రో మరో మిషన్ కు రెడీ

బెంగళూరు: చంద్రయాన్, ఆదిత్య మిషన్ లు ఇచ్చిన ఉత్సాహంతో ఇస్రో మరో మిషన్ కు రెడీ అయింది. ఈసారి  ఖగోళశాస్త్రం (ఆస్ట్రానమీ)పై అధ్యయనం కోసం ఎక్స్ పోశాట్ (ఎక్స్–రే పోలరిమీటర్ శాటిలైట్) ప్రయోగానికి సన్నద్ధం అయింది. ఆస్ట్రానమికల్ ఎక్స్-–రేలపై పరిశోధనల కోసం ఇస్రో మిషన్ చేపట్టడం ఇదే తొలిసారి అని, ఎక్స్ పోశాట్ ఉపగ్రహం ప్రయోగానికి సిద్ధమైందని ఈ మేరకు ఇస్రో అధికారి ఒకరు శనివారం వెల్లడించారు. దిగువ భూకక్ష్యలోకి పంపే ఈ శాటిలైట్ విశ్వం నుంచి వచ్చే కాంతివంతమైన ఎక్స్–రేల తీరును అధ్యయనం చేయనుంది. 

ఇందుకోసం ఎక్స్ పోశాట్ లో రెండు పేలోడ్లను పంపనున్నారు. వీటిలో పోలిక్స్ (పోలరిమీటర్ ఇన్ స్ట్రుమెంట్ ఇన్ ఎక్స్–రేస్) ప్రధాన పరికరం. ఇది విశ్వంలో ఎక్స్–రేల పుట్టుక, శక్తి, పోలరైజేషన్ తీరును అధ్యయనం చేయనుంది. ఎక్స్ స్పెక్ట్(ఎక్స్–రే స్పెక్ట్రోస్కోపీ అండ్ టైమింగ్) అనే మరో పేలోడ్.. విశ్వంలో ఎక్స్–రేల గమనానికి సంబంధించిన స్పెక్ట్రోస్కోపిక్ సమాచారం ఇస్తుంది.