జాబిల్లికి 163 కి.మీ.దూరంలో చంద్రయాన్​3

జాబిల్లికి 163 కి.మీ.దూరంలో చంద్రయాన్​3
  • కక్ష్య తగ్గింపు ప్రక్రియ పూర్తయ్యిందని ఇస్రో ప్రకటన
  • నేడు ప్రొపల్షన్ మాడ్యూల్​ నుంచి విడిపోనున్న ల్యాండర్ మాడ్యుల్

చంద్రయాన్-3 కీలక ఘట్టానికి చేరువైంది. బుధవారం చివరి కక్ష్య తగ్గింపును ఇస్రో పూర్తి చేసింది. దీంతో ప్రస్తుతం చంద్రయాన్-3 స్పేస్ క్రాఫ్ట్ జాబిల్లికి 163 కిలో మీటర్ల దూరంలోకి చేరింది.
బెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు చంద్రయాన్–3 కీలక ఘట్టానికి చేరువైంది. బుధవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో కక్ష్య తగ్గింపు ప్రక్రియను విజయవంతంగా నిర్వహించినట్లు ఇస్రో ప్రకటించింది. చంద్రుడి కక్ష్యలోకి చేరిన తర్వాత స్పేస్ క్రాఫ్ట్ కక్ష్యను ఐదుమార్లు తగ్గించామని, బుధవారం నిర్వహించినదే చివరిదని సైంటిస్టులు తెలిపారు. దీంతో ప్రస్తుతం చంద్రయాన్–3 స్పేస్ క్రాఫ్ట్ జాబిల్లికి 163 కిలోమీటర్ల దూరంలోని కక్ష్యలో తిరుగుతోందని వివరించారు. 

ఇప్పటి వరకు అంటిపెట్టుకుని ఉన్న ప్రొపల్షన్ మాడ్యుల్​ను ల్యాండర్ వదిలివేసే సమయం వచ్చిందని అన్నారు. గురువారం ఉదయం ఈ ప్రక్రియను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇకపై చంద్రుడి వైపు ల్యాండర్ మాడ్యుల్ ఒంటరి ప్రయాణం మొదలుపెట్టనుందని చెప్పారు. ఈ ప్రాసెస్ పూర్తయ్యాక ల్యాండర్ మాడ్యుల్ వేగాన్ని తగ్గించి (డిబూస్ట్) దానిని 30 కి.మీ. x 100 కి.మీ. కక్ష్యలోకి చేరుస్తామని పేర్కొన్నారు. ఈ నెల 23న ల్యాండర్ మాడ్యుల్ చంద్రుడి ఉపరితలంపై దిగడం మొదలుపెడుతుందని, అన్నీ సవ్యంగా జరిగితే సాయంత్రానికి జాబిల్లిపై అడుగుపెడుతుందని ఇస్రో సైంటిస్టులు వివరించారు.