ఏఈ పేపర్​ లీక్​తో కదులుతున్న డొంక

ఏఈ పేపర్​ లీక్​తో కదులుతున్న డొంక
  • నిందితుడు ప్రవీణ్​కు గ్రూప్​ 1 ప్రిలిమ్స్​లో 103 మార్కులు ఎట్లొచ్చె?
  • అనుమానాలు వ్యక్తం చేస్తున్న నిరుద్యోగులు
  • గురుకుల టీచర్, ప్రిన్సిపాల్ పోస్టుల భర్తీపైనా ఆరోపణలు
  • టౌన్ ప్లానింగ్ పేపర్​ లీకైనట్లు రిమాండ్ రిపోర్టులో పోలీసుల వెల్లడి
  • కమిషన్​, సర్కారు తీరుపై అభ్యర్థుల ఫైర్​.. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు
  • సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని డిమాండ్
  • సిట్​కు దర్యాప్తు అప్పగింత

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ పబ్లిక్​ సర్వీస్​ కమిషన్​లో పేపర్ల లీకేజీ వ్యవహారం రాష్ట్రంలో పెను దుమారం రేపుతున్నది. తమ జీవితాలతో ఆటలాడుతున్నారని రాష్ట్ర సర్కారుపై, కమిషన్​పై నిరుద్యోగులు భగ్గుమంటున్నారు. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించారు. అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ) పేపర్​ మాత్రమే లీకైందని అధికారులు చెప్తుండగా.. గ్రూప్ 1 ప్రిలిమ్స్​తో పాటు ఇప్పటి వరకూ జరిగిన అన్ని పేపర్లూ లీకయ్యాయనే ఆరోపణలు వస్తున్నాయి. ఏఈ క్వశ్చన్ పేపర్ లీకేజీ ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్న కమిషన్​ ఉద్యోగి ప్రవీణ్​కు గ్రూప్ 1 ప్రిలిమ్స్​లో ఏకంగా 103 మార్కులు రావడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తున్నది. ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ప్రతిపక్ష పార్టీలు, నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. 

ఒక్కోటి బయటపడుతున్నది

2022లో టీఎస్​పీఎస్సీ 26 నోటిఫికేషన్లు ఇచ్చింది. వీటి ద్వారా 17,134  పోస్టులు భర్తీ చేస్తామని ప్రకటించింది. కీలకమైన గ్రూప్ 1 నోటిఫికేషన్  నిరుడు ఏప్రిల్​లో,  గ్రూప్  2,  గ్రూప్ 3,  గ్రూప్ 4 నోటిఫికేషన్లు డిసెంబర్ లో విడుదలయ్యాయి. అయితే, ఇప్పటివరకు సీడీపీవో, గ్రూప్ 1 ప్రిలిమ్స్, ఏఈఈ,  ఏఈ,  డీఏవో, ఎక్స్​టెన్షన్ ఆఫీసర్ పరీక్షలు జరిగాయి. సిస్టమ్ హ్యాక్ అయిందంటూ ఈ నెల12న జరగాల్సిన టౌన్ ప్లానింగ్ బోర్డు ఆఫీసర్ టెస్ట్, 15, 16 తేదీల్లో జరగాల్సిన వెటర్నరీ అసిస్టెంట్ రిక్రూట్మెంట్ టెస్టులను టీఎస్​పీఎస్సీ వాయిదా వేసింది. దీనిపై విచారణ జరిపిన పోలీసులు.. అసిస్టెంట్​ ఇంజనీర్​ (ఏఈ) పేపర్ లీకైందని బయటపెట్టారు. ఈ పరీక్ష 5న జరుగగా.. 55 వేల మంది హాజరయ్యారు. పేపర్​ లీకైనట్లు తేలడంతో ఇంత మంది అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. టౌన్ ప్లానింగ్ ఎగ్జామ్ పేపర్ జిరాక్స్ కాపీలనూ నిందితుల దగ్గర స్వాధీనం చేసుకున్నట్టు రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. దీంతో టౌన్​ ప్లానింగ్​ ఎగ్జామ్​ పేపర్ లీకైనట్టు స్పష్టమవుతున్నది. 

గురుకుల పోస్టులపై డౌట్స్​

ప్రస్తుతం ఏఈ క్వశ్చన్ పేపర్ లీకేజీలో కీలక నిందితురాలిగా ఉన్న రేణుక గురుకుల టీచర్​గా పనిచేస్తున్నది. నిందితుడు ప్రవీణ్ కుమార్ 2017లో టీఎస్​పీఎస్సీలో ఉద్యోగంలో చేరగా.. రేణుక టీఎస్​పీఎస్సీ నిర్వహించిన గురుకుల టీచర్ రిక్రూట్​మెంట్ ద్వారా 2018లో టీచర్ ఉద్యోగం పొందింది. వీరిద్దరికీ 2017 నుంచే పరిచయాలు ఉన్నట్లు తెలుస్తున్నది. దీంతో రేణుకకు గురుకుల టీచర్​ ఉద్యోగం ఇప్పించేందుకు ప్రవీణ్ ఏమైనా సహాయం చేశాడా? అనే అనుమానాలను నిరుద్యోగులు వ్యక్తం చేస్తున్నారు. గురుకుల ప్రశ్నాపత్రం కూడా అప్పట్లో లీక్​ అయి ఉండొచ్చని అంటున్నారు. కాగా, 2017లో జరిగిన ప్రిన్సిపల్​ పోస్టుల భర్తీలో సర్టిఫికెట్​ వెరిఫికేషన్​లోనూ అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు ఉన్నాయి. 

టీపీబీవో పేపర్ కూడా..

ఈ నెల 5న జరిగిన అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ) క్వశ్చన్ పేపర్ మాత్రమే లీక్ అయినట్టు పోలీసులు రెండ్రోజుల క్రితం ప్రెస్ మీట్​లో ప్రకటించారు. కానీ, రిమాండ్ రిపోర్టులో మాత్రం రెండు క్వశ్చన్ పేపర్లూ లీక్ అయినట్టు పేర్కొన్నారు. నిందితుల నుంచి 24 పేజీల  ఏఈ క్వశ్చన్‌‌ పేపర్‌‌ తో పాటు, 25 పేజీల టౌన్‌‌ ప్లానింగ్‌‌ బిల్డింగ్‌‌ ఓవర్‌‌‌‌సిస్‌‌ (టీపీబీవో) క్వశ్చన్ పేపర్ జిరాక్స్‌‌ కాపీలను స్వాధీనం చేసుకున్నట్టు కోర్టుకు పోలీసులు తెలిపారు. దీంతో టీఈబీవో పేపర్ కూడా లీక్ అయినట్లు స్పష్టమవుతున్నది. 

గ్రూప్ 1 ప్రిలిమ్స్ సంగతేంది..?

ఏఈ ప్రశ్నాపత్రం లీక్ అయిన నేపథ్యంలో, అందరి దృష్టి టీఎస్​పీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ పై పడింది. ప్రధాన నిందితుడు ప్రవీణ్ కు గ్రూప్​ 1 ప్రిలిమ్స్ లో 103 మార్కులు రావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం అతడి ఓఎంఆర్​ షీట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. ప్రవీణ్..  ప్రిలిమ్స్ ఓఎంఆర్ షీట్ పై బుక్ లెట్ నెంబర్ తప్పుగా బబ్లింగ్ చేయడంతో అతడ్ని డిస్ క్వాలిఫై చేశామని కమిషన్ అధికారులు చెప్తున్నారు. కమిషన్​లోనే పనిచేస్తూ ప్రవీణ్​ గ్రూప్​ 1 ఎగ్జామ్​ రాశాడు. అయితే, ఈసారి గ్రూప్ 1 ప్రిలిమ్స్  క్వశ్చన్ పేపర్ చాలా కఠినంగా వచ్చింది. ఎక్కువగా లాజికల్ క్వశ్చన్లు ఇచ్చారు. సివిల్స్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు మాత్రమే 80 మార్కులు దాటే అవకాశం ఉండగా.. ప్రవీణ్ కు ఏకంగా 103 మార్కులు ఎలా వచ్చాయనే దానిపై నిరుద్యోగులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అది కూడా అతడు ఎలాంటి కోచింగ్  లేకుండా, ఆఫీసుకు సెలవు పెట్టకుండా సాధ్యమా అనే దానిపై డౌట్స్​ వస్తున్నాయి. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే, పక్కాగా ప్రిలిమ్స్ పేపర్ కూడా లీక్ అయ్యి ఉంటుందని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. టీఎస్​పీఎస్సీలో కారుణ్య నియామకం ద్వారా జూనియర్ అసిస్టెంట్ గా జాయిన్ అయినా ప్రవీణ్ .. ప్రస్తుతం అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ హోదాలో కమిషన్ సెక్రటరీ పీఏగా విధులు నిర్వహిస్తున్నారు. ప్రవీణ్  గ్రూప్ 1 ఎగ్జామ్స్ రాస్తున్నారని తెలిసి కూడా.. అతడ్ని సెక్రటరీ పీఏగా ఎలా కొనసాగించారనే దానిపై అధికారుల నుంచి సరైన సమాధానం రావడం లేదు.