లక్ష లోపు లోన్లు తీరుస్తామని చెప్పి మూడేండ్లాయె

లక్ష లోపు లోన్లు తీరుస్తామని చెప్పి మూడేండ్లాయె
  • ఇప్పటి వరకు మాఫీ చేసింది 3శాతం మాత్రమే
  • రెన్యువల్ చేస్కోలేదని 16 లక్షల మందిని ఎగవేతదారులుగా చూస్తున్న బ్యాంకర్లు
  • కొత్త లోన్లు రాక అన్నదాతల తిప్పలు

హైదరాబాద్ ​/ నెట్​వర్క్​, వెలుగు: రాష్ట్ర సర్కారు మూడేండ్లుగా రుణమాఫీ అమలు చేయకపోవడంతో సుమారు 16 లక్షల మంది రైతులు డిఫాల్టర్లుగా మిగిలిపోయారు. ఈ విషయాన్ని బ్యాంకర్లు అఫీషియల్​గా ప్రకటించక పోయినప్పటికీ  క్రాప్​లోన్స్​ తిరిగి చెల్లించని వాళ్లను, కనీసం వడ్డీ కట్టి రెన్యువల్​ చేసుకోని వాళ్లను టెక్నికల్​గా ఎగవేతదారులుగానే పరిగణిస్తున్నారు. అందుకే క్రాప్​ లోన్లు కట్టని రైతులెవరికీ కొత్తగా ఎలాంటి లోన్లు ఇవ్వడం లేదని చెప్తున్నారు. గత ఖరీఫ్​లో ఎస్​ఎల్​బీసీ నిర్దేశించిన లోన్ల టార్గెట్​లో సగం కూడా చేరుకోని బ్యాంకులు.. ఈసారి యాసంగిలో ఇప్పటికి 10 శాతం లోన్లు కూడా ఇవ్వలేదు. ఇవి కూడా కేవలం వడ్డీ కట్టించుకొని రెన్యువల్​ చేసినవే తప్ప కొత్త లోన్లు కావని బ్యాంకర్లే అంటున్నారు. సర్కారు రుణ మాఫీ చేయకపోవడంతో బ్యాంకులు కొత్తలోన్లు ఇవ్వక రైతులు బయట వడ్డీ వ్యాపారుల వద్ద అధిక మిత్తికి అప్పులు తెచ్చుకొని నిండా మునుగుతున్నారు. 
97 శాతం లోన్ల మాఫీ ఎప్పుడు..?
2018 డిసెంబర్​ 11 నాటికి రూ. లక్ష వరకు ఉన్న క్రాప్ లోన్లను మాఫీ చేస్తామని 2018 ఎన్నికల టైంలో టీఆర్ఎస్​ హామీ ఇచ్చింది. కానీ రెండో సారి అధికారంలోకి వచ్చి మూడేండ్లు గడిచిపోయినా ఇప్పటివరకు కేవలం 3 శాతం లోన్లను, అది కూడా రూ. 25 వేల లోపు వాటిని మాత్రమే మాఫీ చేసింది. సర్కారు చెప్పిన తేదీ నాటికి బ్యాంకుల్లో 40.66 లక్షల మంది రైతులు రూ. 25,936 కోట్ల క్రాప్​ లోన్స్​ తీసుకోగా.. ఇప్పటివరకు 4 లక్షల మంది రైతులకు రూ.732.24 కోట్లు మాత్రమే ప్రభుత్వం మాఫీ చేసింది. ఇంకా 36.66 లక్షల మంది రైతులకు సంబంధించిన రూ. 25,203 కోట్లను మాఫీ చేయాల్సి ఉంది. అంటే రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికీ 97 శాతం క్రాప్​ లోన్లు మాఫీ కాలేదు. రూల్స్​ ప్రకారం ఈ లోన్లను ఏడాదికోసారి వడ్డీ కట్టి  రెన్యువల్ ​చేసుకోవాలని బ్యాంకర్లు చెప్తున్నారు. కానీ  సర్కారు మాఫీ చేస్తుందనే నమ్మకంతో రెండేండ్లుగా సుమారు 16 లక్షల మంది రైతులు రెన్యువల్​ చేసుకోవడం లేదు.
వడ్డీ కట్టి రెన్యువల్​ చేసుకుంటున్న రైతులకే కొత్త లోన్లు ఇచ్చినట్లు చూపుతున్న బ్యాంకర్లు.. రెన్యువల్​చేసుకోని రైతులను డిఫాల్టర్లుగా పరిగణిస్తున్నారు. పలు జిల్లాల్లో రైతుల బ్యాంక్​ అకౌంట్లలో వడ్ల పైసలు పడగానే ఫ్రీజింగ్​లో పెడ్తున్నారు. రైతుల ఆందోళనలతో సర్కారు.. కలెక్టర్ల ద్వారా బ్యాంకర్లతో మాట్లాడి వడ్ల పైసలు డ్రా చేసుకునే అవకాశం ఇస్తున్నప్పటికీ రైతులు కట్టాల్సిన క్రాప్​ లోన్​ వడ్డీ మాత్రం ఏటా పెరిగిపోతూనే ఉంది. 
వడ్డీ మీద వడ్డీ
తీసుకున్న క్రాప్​లోన్స్​ను ఏడాది లోపు చెల్లిస్తే  బ్యాంకులు రైతుల నుంచి 4 శాతం వడ్డీని మాత్రమే వసూలు చేస్తాయి. మరో 3 శాతం వడ్డీని ప్రభుత్వం నుంచి తీసుకుంటాయి. ఒక వేళ క్రాప్​లోన్​ రూ.1.60 లక్షలోపు ఉంటే ప్రభుత్వమే వడ్డీలేని రుణంగా పరిగణించి రైతు కట్టిన ఆ 4 శాతం వడ్డీని కూడా తిరిగి రైతుకు చెల్లిస్తుంది. కానీ ఏడాదిలోపు చెల్లించకపోతే పంట రుణాలకు అమలయ్యే  మొత్తం 7 శాతం వడ్డీ (రైతు నుంచి తీసుకునే 4 శాతంతోపాటు ప్రభుత్వం చెల్లించే 3 శాతం) కూడా రెట్టింపు అవుతుంది. సర్కారు రుణమాఫీ చెయ్యకపోవడం, రైతులు వడ్డీ కట్టి రెన్యువల్​చేసుకోకపోవడంతో ప్రతి ఆరు నెలలకు వడ్డీ, వడ్డీపై వడ్డీ అన్నట్లుగా పెరిగిపోతూనే ఉన్నది. ఉదాహరణకు ఒక రైతు  2018 డిసెంబరు 11నాటికి  రూ. 70 వేల రుణం తీసుకున్నాడనుకుందాం. సర్కారు మాఫీ చెయ్యనందున రైతు వడ్డీ కట్టి రెన్యువల్​చేసుకోకపోతే ఈ మూడేండ్లలో ఆ మొత్తం రూ. లక్ష అవుతుంది. ఒకవేళ ఇప్పటికిప్పుడు సర్కారు రుణమాఫీ చేసినా సదరు రైతు మొదట తీసుకున్న రూ. 70వేలు మాత్రమే మాఫీ అవుతాయి. మిగిలిన రూ. 30 వేల వడ్డీని రైతు తన సొంత జేబులోంచే కట్టుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ రైతు ఏటా 4 శాతం వడ్డీ చెల్లిస్తే, ప్రభుత్వం నుంచి రీయింబర్స్​అయ్యేది. ఈ విషయం తెలియక లోన్లు తీసుకున్నవాళ్లలో సగానికి పైగా రైతులు లాస్​అవుతున్నారు.  మరోవైపు రెన్యువల్​చేసుకోనివాళ్లను డిఫాల్టర్లుగా పరిగణిస్తున్న  బ్యాంకులు  కొత్తగా క్రాప్​ లోన్లు ఇవ్వకపోవడంతో ప్రైవేట్​వడ్డీ వ్యాపారుల నుంచి అధిక మిత్తికి అప్పులు తెచ్చుకొని రెండు విధాలా మునుగుతున్నారు. 
కొత్త లోన్ల టార్గెట్​ రీచ్​ కాని బ్యాంకులు
2021–22 ఇయర్​లో రూ.59,440.44 కోట్ల క్రాప్ ​లోన్లు ఇవ్వాలని స్టేట్​ లెవెల్​ బ్యాంకర్స్​ కమిటీ (ఎస్ఎల్​బీసీ) బ్యాంకర్లకు టార్గెట్​పెట్టింది. వానాకాలం సీజన్​కు రూ.35,665 కోట్ల లక్ష్యం కాగా, సీజన్ పూర్తయ్యే నాటికి   50% కూడా పూర్తి చేయలేదు. ఈ యాసంగి సీజన్​లో రూ.23,775.44 కోట్లు టార్గెట్ కాగా.. ఇప్పటి వరకు కనీసం 10% కూడా రీచ్​కాలేదు. ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందన్న ఆశతో రైతులు పాత లోన్లను రెన్యువల్​ చేసుకోకపోవడంతో వారికి బ్యాంకులు కొత్తగా లోన్లు ఇవ్వడం లేదు. ఇటు బ్యాంకులు కొత్త లోన్ల టార్గెట్​ను రీచ్​ కావడం లేదు. 
మూడేండ్లుగా ఇదే పరిస్థితి
‘‘క్రాప్​ లోన్ ​తీసుకున్న ఏడాదిలోపు రైతులు వడ్డీతో పాటు బాకీ మొత్తం తీర్చి, అవసరమైతే కొత్త లోన్​ తీసుకోవాలి. కనీసం వడ్డీ అయినా చెల్లించి రెన్యువల్​ చేసుకోవాలి. కానీ సర్కారు రుణమాఫీ చేస్తదని నమ్మి చాలామంది రైతులు రెన్యువల్​ చేస్కుంటలేరు. మూడేండ్లుగా ఇదే పరిస్థితి ఉండడంతో రాష్ట్రవ్యాప్తంగా లక్షల మంది రైతులు డిఫాల్టర్లు అయ్యారు. అధికారికంగా వాళ్ల పేర్లు నోటీస్​ బోర్డుల్లో పెట్టకున్నా టెక్నికల్​గా చూసినప్పుడు వాళ్లకు కొత్త లోన్లు ఇవ్వడం సాధ్యం కావడం లేదు. దీనికి బ్యాంకర్లను నిందించడం కరెక్ట్​ కాదు..’’ - ఓ జిల్లాకు చెందిన లీడ్​బ్యాంక్​ మేనేజర్
రైతుబంధు పైసలు ఆపుకున్నరు
తుంగతుర్తి ఎస్​బీఐలో 2018లో రూ. లక్షా 30 వేల క్రాప్​లోన్ తీసుకున్న. సర్కారు మాఫీ చేస్తదంటే సంబురపడ్డం. మళ్లీ లోన్ ​కావాలని బ్యాంకుకు పోతే ‘పాత లోన్​ కట్టకుండా కొత్త లోన్​ ఎట్లిస్తం?’ అన్నరు. రైతుబంధు పైసలను బ్యాంకోళ్లు ఆపుకున్నరు. అడిగితే ‘వడ్డీ కింద పట్టుకున్నం’ అన్నరు. బ్యాంకుల అప్పు పుట్టక, బయట లోన్​ తెచ్చి ఎవుసం చేస్తున్న. వడ్డీలు పెరిగిపోతున్నయ్​. - పోతరాజు వీరస్వామి, తుంగతుర్తి, సూర్యాపేట జిల్లా
కొత్త లోన్​ ఇస్తలేరు
-మా అమ్మ మంగమ్మ పేరు మీద 2017లో రూ. 2 లక్షల క్రాప్ లోన్ తీసుకున్న. సర్కారు రుణ మాఫీ చేయకపోవడంతో బ్యాంకోళ్లు కొత్త లోన్లు ఇస్తలేరు. ఇటీవల బ్యాంకుకు పోతే వడ్డీ కింద రూ. 24 వేలు కడ్తే రెన్యువల్ చేస్తమన్నరు. ఆ డబ్బులు కట్టినంక చేతికి ఒక్క రూపాయి కూడా ఇయ్యలేదు. ఇప్పటికే రూ. 2 లక్షల లోన్​ ఉందని, ఉన్న భూమి ప్రకారం అంతకంటే ఎక్కువ లోన్ ఇవ్వలేమని     వెళ్లిపొమ్మన్నరు. చేసేది లేక యాసంగి సాగు కోసం ప్రైవేట్​వ్యాపారి వద్ద ఎక్కువ వడ్డీకి అప్పు తెచ్చిన. - ఆరెంపుల రామయ్య, చింతపల్లి, ఖమ్మం జిల్లా
వడ్డీ కిందికి వడ్ల పైసలు పట్టుకున్నరు
నాకు నాలుగెకరాల పొలం ఉంది. గతంలో లాగోడి కోసం రూ. లక్షన్నర క్రాప్​ లోన్​ తీసుకున్న. ఇప్పటికీ సర్కారు​ మాఫీ చేయకపోవడంతో వడ్లు అమ్మిన పైసలను వడ్డీ కిందికి బ్యాంకోళ్లు పట్టుకున్నరు. పాత లోన్​ కడ్తలేవని కొత్త లోన్​ ఇస్తలేరు. ఇప్పుడు యాసంగి లాగోడికి పైసలు లేక ఓ సేటు దగ్గర నాలుగు రూపాయల మిత్తికి రూ. 2 లక్షలు అప్పు తెచ్చిన.  - కేశ్య నాయక్, తాళ్లపల్లిగడ్డ, శివ్వంపేట మండలం, మెదక్ జిల్లా.