అక్క‌డ‌ కులం, మతంతో సంబంధం లేదు.. అందిరిదీ ఒకే డ్రెస్

అక్క‌డ‌ కులం, మతంతో సంబంధం లేదు.. అందిరిదీ ఒకే డ్రెస్

పేద, ధనిక బేధం లేదు. కులం, మతంతో సంబంధం లేదు. అందిరిదీ ఒకే వేషం.. అందరికీ అదే రెస్పెక్ట్‌‌. అక్కడ అందరూ ఎనిమిది పదుల వయసులోనూ తెల్ల బట్టలు, తలపై టోపీ, పంచెకట్టు, భుజాన కండువా లేనిదే బయటకు వెళ్లరు. పొలం పనులకు వెళ్లినా వైట్‌ అండ్ వైట్‌ ఉండాల్సిందే. ఊళ్లో ఎవరు ఎదురు పడినా ‘పటేల్’ అంటూ గౌరవంగా పలకరించుకుంటారు.
ఇది అక్కడ ప్రజల లైఫ్‌స్టైల్‌‌.

కాగజ్‌నగర్, వెలుగు: కాగజ్ న‌గర్ డివిజన్లోని తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు పల్లెల్లో కనిపించే ఈ సంప్రదాయం చాలా సంవత్సరాల నుంచి వస్తోంది. అయితే.. ఇప్పటితరం మాత్రం ఈసంప్రదాయానికి కాస్త దూరంగా ఉంటున్నారు. అందరిలోడిఫరెంట్ గా ఉండడం ఇష్టం లేక రంగురంగుల చొక్కాలు, ప్యాంట్లు వేసుకుంటున్నారు. అందుకే ఈ సంప్రదాయం ఈ తరంతోనే అంతం అయిపోతుందేమోనని బాధపడుతున్నారు. చాలామంది. ఒకప్పుడు ఊరంతా ఈ బట్టలే వేసుకునేవాళ్లు. కానీ.. వయసుపైబడిన వాళ్లు తప్ప ఎవరూ ఈ బట్టలు వేసుకోవడానికి ఇష్టపడడంలేదు.

తెల్ల బట్టలే..

పల్లెల్లో జనాలు సంస్కృతి, సంప్రదాయాలను చాలా గౌరవిస్తారు. ముఖ్యంగా కట్టు, బొట్టు విషయంలో ఒక్కో చోట ఒక్కో రకమైన కల్చర్ ఉంటుంది. ఈ ఊళ్లో ఏ కులం అయినా.. ఏ మతం అయినా అందరూ సమానమే అని చెప్పేందుకే అందరూ ఒకే రకమైన బట్టలు వేసుకుంటారు. చాలా ఊళ్ల‌లో డబ్బున్న వాళ్లు ఒకరకమైన బట్టలు, లేనివాళ్లు ఒకరకమైన బట్టలు వేసుకుంటారు. అయితే..ఆతేడా ఉండకూడదని, మనుషులందరూ సమానం అనే ఉద్దేశంతో ఆ ఊళ్లో ఈ సంప్రదాయాన్ని  పెట్టుకున్నారు. కానీ..ఈ సంప్రదాయం ఇంకొన్ని రోజుల్లో పూర్తిగా మాయమయ్యే ప్రమాదం లేకపోలేదు.

రూపాయి కూలీ నుంచి 
నేను రూపాయి కూలీ ఉన్నప్పటి నుంచి టోపీలు కుడుతున్న. ఆ జమానాలో రోజూ చేతినిండా పని ఉండేది. ఒక రూపాయి కూలీ అయినా రోజుకు పది టోపీలు కుట్టేది. ఇప్పుడు గిరాకీ చాలా తగ్గింది. పెద్ద మనుషులు తప్ప ఎవరూ టోపీలు పెట్టరాయె. ఇప్పుడు అడపాదడపా నాకు పరిచయం ఉన్నవాళ్ళు పండుగలప్పుడు వచ్చి కుట్టించుకుంటున్నరు. ఒక టోపీకి పావు మీటర్ బట్ట పడ్తది. యాభై రూపాయలకు టోపీ అమ్ముతా.

– సాంబయ్య, దర్జీ, కౌటల

ఎటైనా తెల్ల బట్టలతోనే..
ధోతీ, పంచె, కండువా, టోపీ లేకుంటే నేను బయట కాలు కూడా పెట్ట. నేను ఎటు పోవాలన్నా ఇవి ఉండాలె. పొలానికి పోయి అరక పెట్టినా, జంబు కొట్టినా, పెండ్లికి పోయినా తెల్ల బట్టలే ఏసుకుంట. నా తోటి వాళ్ళు చాలా మంది కాలం చేసిన్రు. టోపీలు కుట్టించుకునే వాళ్లు తక్కువయ్యిన్రు. అందుకే మా ఊళ్లో కుడుతలేరు. పదిహేను కిలోమీటర్లు పోయి కుట్టించుకుంటున్న. మేం కట్టే ధోతీ డబల్ పన్నాలో ఉంటది.

– వడులే, మోగడ్ ధగద్ గ్రామం