ఐటీ విచారణకు హాజరుకానున్న మల్లారెడ్డి కొడుకు, అల్లుడు

ఐటీ విచారణకు హాజరుకానున్న మల్లారెడ్డి కొడుకు, అల్లుడు

మల్లారెడ్డి గ్రూప్ పన్ను ఎగవేత ఆరోపణల కేసుకు సంబంధించి ఐటీ అధికారులు మూడో రోజు విచారణ కొనసాగించనున్నారు. ఇవాళ మంత్రి మల్లారెడ్డి చిన్న కొడుకు భద్రారెడ్డితో పాటు అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డిని ప్రశ్నించనున్నారు. ఐటీ అధికారులు అడిగిన ఫార్మాట్లో వివరాలతో వారిరువురూ విచారణకు హాజరుకానున్నారు. రెండు రోజుల విచారణలో భాగంగా కాలేజీ సీట్ల కేటాయింపు నుంచి పేమెంట్ డీటెయిల్స్ వరకు వివరాలు సేకరించారు. ఈ రోజు సీట్ కేటాయింపునకు జరిగిన పేమెంట్లు, బ్యాంక్ ఖాతాలపై మల్లారెడ్డి మెడికల్ ఇన్స్టిట్యూట్ ఛైర్మన్గా ఉన్న భద్రారెడ్డితో పాటు మర్రి రాజశేఖర్ రెడ్డిని ఐటీ అధికారులు ప్రశ్నించనున్నారు.

నిన్న రెండో రోజు విచారణలో భాగంగా మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి, అల్లుడు రాజశేఖర్ రెడ్డి సహా మొత్తం 12 మందిని అధికారులు ప్రశ్నించారు. మల్లారెడ్డి మెడికల్, ఇంజనీరింగ్ కాలేజీల ఆడిటర్ సీతారమయ్యతో పాటు కాలేజీల ప్రిన్సిపాల్స్, అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్, అకౌంటెంట్లు విచారణకు హాజరయ్యారు. ఆడిటర్ సీతారామయ్య నుంచి ఐటీ అధికారులు కీలక సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది. ప్రధానంగా సీట్లు, ఫీజులు, ఆదాయం, పన్ను చెల్లింపులకు సంబంధించిన వివరాలు సేకరించినట్లు తెలుస్తోంది.