సెస్ లో ప్రతిపక్షాల ఓట్లను మాయం చేస్తున్నారనే ఆరోపణలు

సెస్ లో ప్రతిపక్షాల ఓట్లను మాయం చేస్తున్నారనే ఆరోపణలు

బిల్లులు బకాయి ఉన్నారనే సాకుతో సెస్​లో ప్రతిపక్షాల ఓట్లను మాయం చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. సెస్ ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల జాబితాను ఆఫీసర్లు ఇప్పటికే పంచాయతీల్లో పెట్టారు. మొత్తం 34,890 మంది విద్యుత్​బిల్లులు బకాయి ఉన్నారని, వారంతా ఈ నెల 16 వరకు బకాయిలు చెల్లించకుంటే జాబితా నుంచి తొలగిస్తామని చెబుతున్నారు. అయితే బిల్లుల బకాయిలు లేకున్నా ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగించారన్న విమర్శలొస్తున్నాయి. 

రాజన్న సిరిసిల్ల, వెలుగు : రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సహకార విద్యుత్​ సరఫరా సంఘం(సెస్)​లో విద్యుత్​ మీటర్లు ఉన్నవాళ్లంతా ఓటర్ల కిందికి వస్తారు. అయితే ఒక్క వినియోగదారుడికి ఒక ఓటు మాత్రమే ఉంటుంది. ప్రతి ఐదేండ్లకోసారి వీరంతా ఓట్లేసి పాలకవర్గాన్ని ఎన్నుకుంటారు. చివరిసారి 2016లో ఎన్నికలు జరుగగా దోర్నాల లక్ష్మారెడ్డి చైర్మన్ గా పాలకవర్గం కొలువుదీరింది. ఈ పాలకవర్గం ఐదేండ్ల కాలం ముగియడంతో 2021 నుంచి కొన్నాళ్లపాటు లక్ష్మారెడ్డినే పర్సన్ ఇన్​చార్జిగా పెట్టారు. తర్వాత 2022 వరకు కలెక్టర్ పర్సన్ ఇన్​చార్జిగా ఉన్నారు. 2022 ఏప్రిల్ లో గూడూరి ప్రవీణ్ చైర్మన్ గా14 మంది డైరెక్టర్లతో కేటీఆర్ పాలకవర్గాన్ని నియమించారు. అయితే సెస్ కు ఎన్నికలు నిర్వహించకుండా నామినేటేడ్ కమిటీ వేయడాన్ని సవాలు చేస్తూ బోయిన్​పల్లి మండలానికి చెందిన బీజేపీ లీడర్ కనకయ్య హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు సెస్ కు ఎన్నికలు నిర్వహించాలని తీర్పు ఇవ్వడంతో సెస్ ఎన్నికలకు సహకార ఎన్నికల ఆథారిటీ నవంబర్ 1న నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. డిసెంబర్ 5 నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది. డిసెంబర్ 13 నుంచి నామినేషన్ల స్వీకరణ,డిసెంబర్ 17న నామినేషన్ల ఉపసంహరణ, డిసెంబర్ 24న ఎన్నికలు,26 ఓట్ల లెక్కింపు,27న ఫలితాలు ప్రకటించనున్నారు. సెస్ ఎంప్లాయీస్, వారి బంధువులు కేవలం ఓటు హక్కు మాత్రమే వినియోగించుకోవచ్చు. పోటీలో పాల్గొనకూడదు. 

తగ్గనున్న ఓటర్లు

సెస్​పరిధిలో లక్ష మందికి పైగా ఓటర్లు ఉండగా 11 డైరెక్టర్​స్థానాలు ఉన్నాయి. ఇప్పటివరకు సెస్ ఆఫీసర్లు బోయిన్ పల్లిలో 5,794,వేములవాడ రూరల్లో 6,826, వేములవాడ టౌన్ లో 4,065, కోనరావుపేటలో 5,503, చందుర్తిలో 6,294, ఎల్లారెడ్డిపేటలో 6,718, ముస్తాబాద్ లో  5,493, గంభీరావుపేటలో 4,948, ఇల్లంతకుంటలో 5,972, తంగళ్లపల్లిలో 6,947, సిరిసిల్ల టౌన్ లో 9,731 ఓటర్లను గుర్తించారు. ఆధార్, ఫోన్ నంబర్, ఫోటోతో సేకరించిన ఓటర్లు మొత్తంగా 68,291 మంది ఉన్నారు. ఈ నెల 18 వరకు తుది ఓటర్ల లిస్ట్ ను అధికారికంగా విడుదల చేయనున్నారు. సహకారచట్టం 1964 సెక్షన్25(1-ఏ) (డి),18(డి) ప్రకారం కరెంట్ బకాయిలుంటే ఓటు వేసేందుకు, సహకార ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులు. ప్రస్తుతం 34,890 మంది కరెంటు బిల్లుల బకాయిలు కట్టాల్సి ఉంది. ఈ నెల 16 వరకు బకాయిలు చెల్లించని వారందరి ఓట్లు తొలగించనున్నారు. ఇప్పటికే గ్రామ పంచాయతీల్లో ఓటర్ల జాబితా అతికించారు. ఆ జాబితా ఆధారంగా బిల్లులు కట్టనివారుంటే కట్టేందుకు రెడీ అవుతున్నారు. 

ఓట్ల తొలగింపుపై ధర్నా

ముస్తాబాద్ మండలంలో సెస్ లో తమ ఓట్లు తొలగించారంటూ మంగళవారం ధర్నా చేశారు. మండలంలో మొత్తం 13,296 వినియోగదారులుండగా కేవలం 5,491 మందిని మాత్రమే అర్హులుగా ప్రకటించారంటూ వినియోగదారులు మండల కేంద్రంలోని  సెస్ ఆఫీసును ముట్టడించారు. కావాలనే ప్రతిపక్ష నాయకుల ఓట్లను తొలగిస్తున్నారని ఆరోపించారు. మండలంలో అన్ని అర్హతలున్నా 1,648 మంది వినియోగదారుల ఓట్లను కావాలనే తొలగించారని బీజేపీ నాయకుడు కస్తూరి కార్తీక్ రెడ్డి ఆరోపించారు. సెస్ అధికారులు మరణించిన వారిని మాత్రమే తొలిగించామని కుంటి సాకులు చెబుతున్నారన్నారు. బకాయిలు చెల్లించేందుకు కాస్త సమయం కూడా ఇవ్వకుండా ఓట్లను తొలగించడమేంటని మండిపడ్డారు. తుది జాబితాలో ప్రతి వినియోగదారునికి ఓటు హక్కు కల్పించాలని డిమాండ్ చేశారు.

బకాయి లేకున్నా ఓటు తొలగించారు

నా భార్య సరళ పేరు మీద మీటర్ ఉంది. ఆమె పేరు మీద ఉన్న మీటర్ పై ఎలాంటి బకాయిలు లేవు. అయినా నా భార్య పేరు ఓటర్ లిస్ట్ లో లేదు. బకాయిలున్న పేర్లు మాత్రమే తొలగించామని చెప్తున్న సెస్ ఆధికారులు దీనికి సమాధానం చెప్పాలి. అన్యాయంగా ఓటు తొలగించారు. వెంటనే మాకు ఓటు హక్కు కల్పించాలి. ఇలాంటివి ముస్తాబాద్ లో చాలా ఉన్నాయి. 
– జగన్ మోహన్ రావు,ముస్తాబాద్

చనిపోయానని ఓటు తీసేసిన్రు

గ్రామంలో రేషన్ డీలర్ గా పని చేస్తున్నా. నేను చనిపోయానని పేర్కొంటూ ఆఫీసర్లు సెస్ ఓటర్ లిస్ట్ లో నా పేరు తొలగించారు. ఐకేపీ సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిశీలించకుండానే మొక్కుబడిగా ఈ లిస్ట్​తయారు చేశారు. దీనిపై ఇప్పటికే ఆఫీసర్లకు కంప్లైంట్​చేశా. చాలామంది వివరాలు తప్పుగా ఎంటర్ చేశారు. ఓటర్ లిస్ట్ తప్పుల తడకగా ఉంది. సంబంధింత అధికారులు పూర్తిస్థాయిలో పరిశీలించి ఓటరు లిస్ట్ తయారు చేయాలి.
– ఓద్యారం దేవయ్య, ధర్మారం, కోనరావుపేట మండలం