
హైదరాబాద్, వెలుగు: వాస్తవిక బడ్జెట్అని భ్రమలు కల్పించారు.. కానీ, రాష్ట్ర బడ్జెట్అవాస్తవాలతో నిండి ఉన్నదని బీఆర్ఎస్ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. ‘బడ్జెట్లో రూ.11,389 కోట్ల ట్యాక్స్ రెవెన్యూ అధికం గా రాబోతున్నట్టు లెక్కలు వేశారు. రూ.10 వేల కోట్లు భూముల అమ్మకం ద్వారా వస్తాయని చెప్పా రు. రూ.14 వేల కోట్లు అడిషనల్ రిసోర్స్ మొబిలైజేషన్ అన్నారు. ఇదేం బ్రహ్మపదార్థం? అసెంబ్లీకి చెప్పనంత గోప్యత ఏంటి?’ అని ఆయన ప్రశ్నించారు.
‘‘మేం భూములను అమ్మితే అమ్మకూడదన్నారు. మీరేమో (కాంగ్రెస్) రూ.24వేల కోట్ల విలువైన భూములు అమ్మి నిధులు సమకూర్చుకుంటారా?” అని ప్రశ్నించారు. ‘మీ మాటపై మీకు గౌరవం ఉంటే భూములు అమ్ముకునే ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలి’ అని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో శనివారం రాష్ట్ర బడ్జెట్ పై చర్చ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడారు. బడ్జెట్లో ఒకవైపు ఆదాయం ఎక్కువ వస్తుందని చూపి.. మరోవైపు ఖర్చులు తక్కువ చేసి చూపించారని ఆయన విమర్శించారు.
అప్పుల విషయంలో మాపై బురదజల్లుతున్నారు
అప్పుల విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై సర్కారు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నదని హరీశ్ అన్నారు. కాంగ్రెస్ నేతలు పదేపదే కేసీఆర్ హయాంలో రూ.6,71,757 కోట్ల అప్పులు అయ్యాయని అవాస్తవాలు చెబుతున్నారని తెలిపారు. ‘‘ప్రభుత్వం శ్వేతపత్రంలో 4 రకాల అప్పులు చూపించింది. గవర్నమెంట్ కట్టాల్సిన అవసరం లేని అప్పులు రూ.1,54,878 కోట్లు పోగా మిగిలే అప్పు రూ.5,16,881 కోట్లు.
బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చేనాటికే వారసత్వంగా వచ్చిన రూ.72,658 కోట్ల అప్పులు తీసేస్తే మిగిలేది రూ.4,32,614 కోట్లు. శ్వేతపత్రంలో కలిపిన కాంగ్రెస్అప్పులు రూ.6,115 కోట్లు తీసేస్తే అప్పు రూ.4,26,499 కోట్లు మాత్రమే. కేంద్రం నిర్ణయాల వల్ల చేసిన అప్పులు తీసేస్తే నికరంగా బీఆర్ఎస్ పాల నలో చేసిన అప్పు కేవలం రూ.3,85,340 కోట్ల మాత్ర మే” అని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ చేసిన అప్పుల గురించి చెప్తున్న కాంగ్రెస్ నేతలు.. తాము కూడబెట్టిన ఆస్తుల గురించి కూడా మాట్లాడాలన్నారు.
రుణమాఫీకి నిధులు తగ్గించారు
కాంగ్రెస్ ఏకకాలంలో 31 వేల కోట్ల రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి.. దానిని రూ.25 వేల కోట్లకు తగ్గించిందని హరీశ్‌రావు ఆరోపించారు. ‘ఆలస్యమైందని రైతు నుంచి వసూలు వడ్డీ చేస్తున్నారు. 2023 డిసెంబర్ 9 తర్వాత 8 నెలల వడ్డీని రైతులే కట్టుకోవాలని చెప్పడం దుర్మార్గం. వైద్య శాఖకు నిధుల కేటాయింపు తగ్గించి.. ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచితే ఎలా సాధ్యం.
కేసీఆర్ పేరు నచ్చకుంటే పేరు మార్చి అయినా కేసీఆర్ కిట్లు ఇవ్వాలి. నిరుడు సెంట్రల్గ్రాంట్స్ రూ.9,729 కోట్లు వచ్చాయని, ఈ బడ్జెట్ అంచనాల్లో రూ. 21,636 కోట్ల గ్రాంట్స్ వస్తాయని పేర్కొన్నారు. ఇప్పుడు అదనంగా తెలంగాణకు రూ. 12 వేలకోట్లు ఎలా వస్తాయో చెప్పాలి’అని హరీశ్ డిమాండ్ చేశారు.