- సీఎం ఎన్ని నిధులు తీసుకెళ్తే.. నల్గొండకు అన్ని నిధులు తెస్తానని వెల్లడి
- నల్గొండలో రూ.8 కోట్లతో నిర్మించిన హైస్కూల్‌ను ప్రారంభించిన మంత్రి
నల్గొండ అర్బన్, వెలుగు: రాష్ట్రంలో కొన్ని కార్పొరేట్ విద్యాసంస్థలు అధిక ఫీజులతో పేదలను దోచుకుంటున్నాయని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తనకు విద్యా శాఖ మంత్రిగా చాన్స్ వస్తే ఆ విద్యాసంస్థలన్నింటినీ మూసేయిస్తానని అన్నారు. కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నల్గొండలో రూ.8 కోట్లతో నిర్మించిన బొట్టుగూడ హైస్కూల్‌ను ఆయన మంగళవారం (జనవరి 27) ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రెండు లక్షలున్న ఫీజును మూడు లక్షలకు పెంచి చెబుతారని, తాను రికమండ్ చేస్తే లక్ష తగ్గిస్తున్నట్టు చెప్పి అదే రెండు లక్షలు వసూలు చేస్తారని అన్నారు. ఆ స్కూళ్లలో నాణ్యమైన చదువు కూడా చెప్పరని, క్వాలిఫైడ్ టీచర్లు కూడా ఉండరన్నారు. నల్గొండలో అటువంటి కార్పొరేట్ దోపిడీ లేదని, ఫోన్ చేయగానే చాలా విద్యాసంస్థల యాజమాన్యాలు ఫీజులు తగ్గిస్తున్నారని చెప్పారు.
బొట్టుగూడ స్కూల్‌ను అద్భుతంగా నిర్మించామని, రాజకీయాల నుంచి తప్పుకుంటే బొట్టుగూడ స్కూల్ లోనే ఒక రూమ్ తీసుకొని పిల్లలను చదివిస్తూ జీవితం గడపాలని ఉందని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు తమ పిల్లలను ఇదే స్కూల్లో చేర్పించాలని సూచించారు. నల్గొండను రూ.2 వేల కోట్లతో మెగా స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతామని అన్నారు. ఎమ్మెల్సీ శంకర్ నాయక్, కలెక్టర్ బడుగు చంద్రశేఖర్, ఎస్పీ శరత్ చంద్ర పవార్, అడిషనల్ కలెక్టర్ జె. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
