కేసీఆర్ అవినీతిపై మీరు చర్యలు తీసుకోరన్నది నికార్సయిన నిజం

కేసీఆర్ అవినీతిపై మీరు చర్యలు తీసుకోరన్నది నికార్సయిన నిజం

షెకావత్ జీ, కాళేశ్వరం కేసీఆర్ కు ఏటీఎంలా మారింది… నిజమేనని టీపీసీసీ చీఫ్, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, అక్రమాలు, చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికే జాతీయ హోదా ఇవ్వాలని కేసీఆర్ డిమాండ్ చేస్తున్నారని కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ఇటీవల అన్న వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కమీషన్ల కోసమే కేసీఆర్ కాళేశ్వరం కట్టారు… అది కూడా నిజమేనన్న ఆయన... కాళేశ్వరం ప్రాజెక్టుకు టెక్నికల్ పర్మిషన్లు, పర్యావరణ పరిమితులు లేవన్న కేంద్ర మంత్రి వ్యాఖ్యలను రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. కాళేశ్వరం డిజైన్ లోపంతోనే మునిగింది…నిజమే! కానీ.. కేసీఆర్ దోపిడీ,- అవినీతిపై మీరు చర్యలు తీసుకోరు… ఇదైతే నికార్సయిన నిజం! అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తిమాటలు కట్టిపెట్టి … గట్టి చర్యలు తలపెట్టండి! అంటూ రేవంత్ రెడ్డి షెకావత్ కు గట్టి రిప్లై ఇచ్చారు.

ఇంతకంటే ముందు కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై విచారణ ఎందుకు జరపడం లేదని కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ను రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎందుకివ్వడం లేదన్నారు. కృష్ణ, గోదావరిలో తెలంగాణ నీటి వాటా ఎందుకు తేల్చడం లేదంటూ నిలదీశారు. వీటికి సమాధానం చెప్పేవరకు ప్రజలు బీజేపీని నమ్మరని రేవంత్ ట్వీట్ చేశారు.