కేసీఆర్ ఢిల్లీ టూర్ల వెనక మతలబేంది.?ఈ నెలలోనే రెండోసారి

కేసీఆర్ ఢిల్లీ టూర్ల వెనక మతలబేంది.?ఈ నెలలోనే రెండోసారి
  • మొన్న తొమ్మిది రోజులు.. ఇప్పుడు మూడు రోజులూ అక్కడే 
  • బీజేపీ పెద్దలతో పదే పదే భేటీలు
  • టీఆర్​ఎస్​, బీజేపీ ఒక్కటేనన్న తప్పుడు ప్రచారానికే: బీజేపీ
  • పర్యటనలో ఎలాంటి రాజకీయం లేదు: టీఆర్​ఎస్​

రెండు వారాల వ్యవధిలోనే సీఎం కేసీఆర్​ మళ్లీ ఢిల్లీకి వెళ్లారు. పలు కీలకమైన మీటింగ్​లకు పిలిచినా ఢిల్లీకి వెళ్లని ఆయన.. ఇప్పుడు వరుస పెట్టి టూర్లు వేయడం, పదే పదే బీజేపీ పెద్దలను కలవడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై పలువురు కేంద్ర మంత్రులను కలవటంతో పాటు కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో జరిగే మీటింగ్​లో పాల్గొనేందుకు ఆయన ఢిల్లీకి వెళ్లినట్లు సీఎంవో ప్రకటన జారీ చేసింది. కానీ, కేసీఆర్​ తన భవిష్యత్ రాజకీయ వ్యూహాలతోనే ఢిల్లీ బాట పడుతున్నారని ప్రచారం జరుగుతోంది. 

హైదరాబాద్​, వెలుగు: సీఎం కేసీఆర్​ ఢిల్లీ టూర్​ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్​ టాపిక్​గా మారింది. ఇటీవలే తొమ్మిదిరోజులు ఢిల్లీలో ఉండి వచ్చిన ఆయన ఇప్పుడు మరో మూడురోజుల పర్యటనకు వెళ్లారు. హుజూరాబాద్  ఉప ఎన్నిక టీఆర్​ఎస్  లీడర్లకు 4 నెలలుగా కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ఎన్ని చేసినా అక్కడ గెలిచే పరిస్థితి లేదని టీఆర్​ఎస్​ లీడర్లు ఆందోళన చెందుతున్నారు. ఈ  టైంలో ఓటర్లను గందరగోళ పరిచేందుకు కేసీఆర్ ఢిల్లీలో బీజేపీ అగ్ర నేతలతో భేటీలు జరుపుతున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వరుస ఢిల్లీ టూర్ల ద్వారా బీజేపీ పెద్దలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే తప్పుడు ప్రచారాన్ని జనంలోకి తీసుకెళ్లాలని చూస్తున్నారని రాష్ట్ర బీజేపీ నేతలు భగ్గుమంటున్నారు. టీఆర్​ఎస్​ నేతలు మాత్రం కేసీఆర్​ టూర్​లో ఎలాంటి రాజకీయం లేదంటున్నారు. 

రాబోయే ఎన్నికలకు ప్రిపరేషనా?

ఈ నెల 1న ఢిల్లీకి వెళ్లిన సీఎం కేసీఆర్​ తొమ్మిదిరోజులు అక్కడే ఉన్నారు. ప్రధాని మోడీతో పాటు అమిత్​షాను, పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. శుక్రవారం సీఎం మళ్లీ ఢిల్లీకి వెళ్లారు. ఈసారి కేంద్ర మంత్రులు గజేంద్రసింగ్ షెకావత్, పీయూష్​ గోయల్​ను కలుసుకోవటంతో పాటు అమిత్​షా ఆధ్వర్యంలో జరిగే మీటింగ్​లో పాల్గొననున్నారు.ఒకటికి రెండుసార్లు బీజేపీ అగ్ర నేతలను కలువటం ద్వారా.. తనకు పైస్థాయిలో దోస్తానా ఉందని, కేంద్రంతో స్నేహపూర్వక సంబంధాలున్నాయనే  ప్రచారాన్ని జనంలోకి వదలాలని చూస్తున్నారని రాష్ట్ర బీజేపీ నేతలు అంటున్నారు. మరోవైపు రాబోయే ఎన్నికలకు  ఇప్పటి నుంచే కేసీఆర్​ ప్రిపేరవుతున్నారని.. ఎప్పుడు అవకాశం దొరికినా కేటీఆర్​ను సీఎం చేసే ఆలోచనలో ఆయన ఉన్నట్లు టీఆర్​ఎస్​ శ్రేణులు బలంగా విశ్వసిస్తున్నాయి. కేటీఆర్​ కాబోయే సీఎం అనే వాదనను ఇప్పటికే పలుమార్లు కేసీఆర్ తోసిపుచ్చినప్పటికీ, తనకు ఢిల్లీలో ప్రాతినిధ్యం దొరికితే కేటీఆర్​కు రాష్ట్ర పగ్గాలు అప్పగిస్తారనే ప్రచారం జరుగుతూనే ఉంది.

రాజకీయం లేదంటున్న టీఆర్​ఎస్​ 

కేసీఆర్​ ఢిల్లీ పర్యటన వెనుక రాజకీయమేమీ లేదని, కేంద్ర – రాష్ట్రాల మధ్య ఉండే అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకే ఢిల్లీకి వెళ్తున్నారని ఓ ​మంత్రి అన్నారు. తెలంగాణలోని కీలకమైన సాగునీటి ప్రాజెక్టులు కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిలోకి వెళ్లే గెజిట్​ అక్టోబర్​ నుంచి అమల్లోకి రానుంది. దీన్ని కొంతకాలం వాయిదా వేయాలని కోరటంతో పాటు ధాన్యం కొనుగోళ్లలో టార్గెట్​ సడలించి, రాష్ట్రానికి సహకరించాలని  కోరే అవకాశాలున్నాయని మంత్రి చెప్పారు. అయితే.. గతంలో నీళ్ల ఇష్యూతోపాటు పలు కీలక అంశాలపై కేంద్రం మీటింగులు ఏర్పాటుచేసి పిలిచినా వెళ్లని కేసీఆర్​.. ఇప్పుడు పిలవకున్నా వెళ్లడంలో మతలబేందన్న చర్చ నడుస్తోంది. 

కేసీఆర్‌ ప్రచారాన్ని నమ్మొద్దంటున్న బీజేపీ

రాష్ట్ర ప్రజలను, బీజేపీ కేడర్​ను కన్ఫ్యూజన్‌లో పడేయడానికి కేసీఆర్‌ తన ఢిల్లీ పర్యటనలను ఉపయోగించుకుంటున్నారని, ఆయన ప్రచారాన్ని నమ్మొద్దని రాష్ట్ర బీజేపీ నేతలు అంటున్నారు. హుజూరాబాద్​ ఎన్నికల్లో ఓటర్లను గందరగోళపర్చడానికి ఇలా వ్యవహరిస్తున్నారని, ఎన్ని ఎత్తులు వేసినా అక్కడ గెలిచేది తమ పార్టీనేనని చెబుతున్నారు. ‘‘కేసీఆర్‌ 15 రోజుల కింద ఢిల్లీకి వెళ్లి ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా సహా ఇతర కేంద్ర మంత్రులను కలిశారు. ఢిల్లీలో వంగివంగి దండాలు పెట్టి బయటకు వచ్చి బీజేపీతో టీఆర్‌ఎస్‌ కలిసి పోతుందనే సంకేతాలు ఇస్తున్నరు. దాన్ని నమ్మొద్దు” అని బీజేపీ స్టేట్​ చీఫ్​ బండి సంజయ్‌ అన్నారు. టీఆర్​ఎస్​తో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని, టీఆర్​ఎస్​తో తాము కలిసే ప్రసక్తేలేదని తేల్చిచెప్పారు. రాష్ట్రంలో 2023లో అధికారంలోకి రాబోయేది బీజేపీయేనని, ప్రధాన ప్రత్యర్థి టీఆర్‌ఎస్సే ఉంటుందన్నారు. టీఆర్‌ఎస్‌ చేస్తున్న తప్పుడు ప్రచారంతో బీజేపీ కేడర్​ అయోమయానికి గురికావొద్దని ఆయన సూచించారు.