మనిషిగా పుట్టే కంటే.. ప్రగతి భవన్ లో కుక్కగా పుట్టుడు మేలు

మనిషిగా పుట్టే కంటే.. ప్రగతి భవన్ లో కుక్కగా పుట్టుడు మేలు
  • ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలు పట్టని కేసీఆర్ ది నిరంకుశ ధోరణి
  • కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ధ్వజం

కరీంనగర్: ఆర్టీసీ కార్మికులు 17 రోజులుగా సమ్మె చేస్తుంటే వారి సమస్యలను పరిష్కరించకుండా సీఎం కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. ఆర్టీసీ కార్మికుల ఉద్యమం ఉదృతంగా జరుగుతున్నా.. కోర్టు తీర్పులను కూడా విస్మరిస్తున్నారని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారాయన. ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలను కూడా కేసీఆర్ పట్టించుకోకుండా నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని సంజయ్ అన్నారు. తెలంగాణలో ప్రజల్లా పుట్టే కంటే ప్రగతి భవన్ లో కుక్కలుగా పుట్టుడు మేలని ఎద్దేవా చేశారు. ‘అక్కడ కుక్క చనిపోతే పరామర్శిస్తాడు.. డాక్టర్ ని సస్పెండ్ చేస్తాడు.. కానీ ఆర్టీసీ కార్మికులు చనిపోతే కనీసం సంతాపం కూడా ప్రకటించని సీఎం కేసీఆర్’ అని అన్నారు. ఆర్టీసీ కార్మికుల న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించే వరకు బీజేపీ అండగా ఉంటుందని చెప్పారు బండి సంజయ్.

గ్రామ స్వరాజ్య స్థాపనే లక్ష్యం

కరీంనగర్ జిల్లా ఇళ్లందకుంట మండల కేంద్రంలో బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమార్ 150వ గాంధీ జయంత్యుత్సవాల్లో భాగంగా గాంధీ సంకల్ప యాత్రను ప్రారంభించారు. ప్రజల్లో మహాత్ముడి స్ఫూర్తి నింపడం కోసం కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని నేటి నుండి 15 రోజుల వరకు పాదయాత్ర చేస్తామని చెప్పారాయన. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గాంధీజి ఆశయాలను నెరవేర్చే దిశగా నరేంద్ర మోడీ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. గ్రామ స్వరాజ్య స్థాపనే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. నరేంద్ర మోడీ రైతులకు ఆసరాగా ఉండాలని ఫసల్ భీమా యోజన పథకాన్ని ప్రవేశపెడితే తెలంగాణ ప్రభుత్వం నిరంకుశ వైఖరితో ఆ పథకాన్ని అమలు చేయడం లేదని చెప్పారు.