- విధ్వంసంతో వసూళ్లు చేయాలన్నదే బీఆర్ఎస్ ధ్యేయమని ఫైర్
కరీంనగర్ రూరల్/వరంగల్/చొప్పదండి, వెలుగు: సింగరేణి ఆఫీసులను ధ్వంసం చేయాలని, రైలు పట్టాల ని కోసేయాలని, జీఎం ఆఫీసు తగలబెట్టాలంటూ బీఆర్ఎస్ కార్యకర్తలను రెచ్చగొట్టేలా ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మాట్లాడడం దుర్మార్గమని కేంద్రమంత్రి బండి సంజయ్అన్నారు. సుమన్ వ్యాఖ్య లు బీఆర్ఎస్ తీరుకు అద్దం పడుతున్నాయన్నారు. ఆ పార్టీ కార్యక్రమాలకు ప్రజలే రావడం లేదని, దీంతో బీఆర్ఎస్కు ప్రజల మద్దతు లేదని తేలిపోయిందన్నారు.
కరీంనగర్ రూరల్ మండలంలోని ఇరుకుల్లలో సీసీ రోడ్డు పనులకు బుధవారం సంజయ్శంకుస్థాపన చేశారు. అనంతరం బొమ్మకల్ ఐకేపీ కేంద్రంలో తడిచిన ధాన్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. విధ్వంసాలతో ఆ పార్టీ డబ్బులు వసూలు చేయాలని భావిస్తోందని అన్నారు. ప్రజాస్వామ్యంలో దాడులు, విధ్వంసాలకు చోటు లేదని, రెచ్చగొట్టే మాటలు మాట్లాడిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో వడ్లు కొనుగోలు చేయడానికి అవసరమైన సొమ్మంతా కేంద్రమే ఇస్తుంటే రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్న ఇబ్బంది ఏమిటని ఆయన ప్రశ్నించారు.
- గ్రేటర్ వరంగల్‌లో స్మార్ట్ సిటీ ఫండ్స్ డైవర్ట్ అయినయ్
వరంగల్‌కు ఇచ్చిన స్మార్ట్‌సిటీ ఫండ్స్‌ను బీఆర్ఎస్, కాం గ్రెస్ ప్రభుత్వాలు డైవర్ట్ చేశాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. బుధవారం ఆయన గ్రేటర్ వరంగల్‌లో పర్యటించారు. పండిట్ దీన్‍దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాభియాన్ ముగింపు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. వరంగల్ బీజేపీ నాయకులు ప్రజాసమస్యలపై పోరాడడంలేదని, వరంగల్ అభివృద్ధికి కేంద్రం భారీగా నిధులిచ్చిన విషయాన్ని కూడా జనంలోకి తీసుకెళ్లలేదని పేర్కొన్నారు.
ఇకపై పార్టీ నేతలు సమస్యలపై కార్యాచరణ రూపొందించాలని సూచిం చారు. వచ్చే గ్రేటర్ ఎన్నికల్లో వరంగల్ బల్దియాపై కాషాయ జెండా ఎగురవేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అనంతరం మడికొండ టెక్స్టైల్ పార్క్‌ను సందర్శించి, క్లాత్ మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్‍ను పరిశీలించి యజమానులతో మాట్లాడారు.
- ఏడేండ్లలో 20 వేల కోట్లు తెచ్చిన
ఎంపీగా ఎన్నికయిన తర్వాత ఏడేండ్లలో కరీంనగర్ పార్లమెంట్‌నియోజకవర్గానికి కేంద్రం నుంచి రూ. 20 వేల కోట్లకు పైగా నిధులు తీసుకొచ్చానని బండి సంజయ్ తెలిపారు. రూ.50 కోట్ల సీఆర్ఐఎఫ్ ఫండ్స్‌తో చొప్పదండి మండలం ఆర్నకొండ నుంచి మల్యాల వరకు 35 కిలోమీటర్ల డబుల్ రోడ్డు విస్తరణ పనులకు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలిసి బుధవారం సంజయ్శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని దేశంలోనే మోడల్ గా తీర్చిదిద్దుతానని ధీమా వ్యక్తం చేశారు. కరీంనగర్-, జగిత్యాల నేషనల్ హైవే విస్తరణ పనుల్లో వివిధ కారణాలతో జాప్యం జరిగిందని, దాదాపు రూ.2 వేల కోట్లతో త్వరలోనే పనులను ప్రారంభిస్తామని సంజయ్ చెప్పారు. రాజకీయాలను పక్కనపెట్టి కలిసి పనిచేయడంవల్ల చొప్పదండికి పెద్ద ఎత్తున నిధులు వస్తున్నాయని తెలిపారు.
