
హైదరాబాద్, వెలుగు: ఉస్మానియా హాస్పిటల్లో కరోనాతో ఓ వ్యక్తి మరణించాడంటూ మంగళవారం వచ్చిన వార్తలపై ఆ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ స్పందించారు. కరోనామరణం అంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని, చనిపోయిన వ్యక్తి మృతికి కారణం గుండె సంబంధిత సమస్యలేనని క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుత జేఎన్–1 వేరియంట్ కు తేలికపాటి లక్షణాలు ఉంటాయని, భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు.
బండ్లగూడకు చెందిన మహమ్మద్ సుభాన్(60) ఈ నెల 14న గుండె, శ్వాస సంబంధిత సమస్యలతో ఉస్మానియా హాస్పిటల్లో చేరాడు. చికిత్స కొనసాగుతుండగానే పరిస్థితి విషమించి ఈ నెల 24న మృతి చెందాడు. అనంతరం డెడ్‌బాడీకి కరోనాటెస్టు చేయడంతో పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అయితే వరుస సెలవులు ఉండటంతో ఈ వార్త బయటకు రాలేదు. మంగళవారం సుభాన్ ది కరోనామరణం అంటూ వార్తలు గుప్పుమన్నాయి. దీంతో హాస్పిటల్ లోని రోగులు, ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.
అయితే, ఈ ప్రచారాన్ని నమ్మొద్దని హాస్పిటల్ సూపరింటెండెంట్ నాగేందర్ స్పష్టం చేశారు. ఉస్మానియాలో ఎలాంటి కరోనామరణం సంభవించలేదని తెలిపారు. ప్రస్తుతం ఆస్పత్రిలో ముగ్గురు కరోనాబాధితులు చికిత్స పొందుతున్నారని, వారి పరిస్థితి నిలకడగా ఉందని ఆయన వెల్లడించారు.