
- కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌జోషి
హైదరాబాద్, వెలుగు: నీతి ఆయోగ్ సమావేశాన్ని సీఎం రేవంత్ రెడ్డి బహిష్కరించడం సరికాదని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి వ్యాఖ్యానించారు. ఏదైనా విభేదాలు ఉంటే ఈ సమావేశానికి హాజరై చెప్పి ఉండాల్సిందని అన్నారు. వికసిత్ భారత్ లక్ష్యంగా తమ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిందని చెప్పారు. పేదల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా, పలు స్కీమ్స్ తీసుకొచ్చామని ఆయన చెప్పారు.
శనివారం బీజేపీ స్టేట్ ఆఫీసులో మీడియాతో ఆయన మాట్లాడారు. దేశంలో ద్రవ్యోల్బణం తగ్గుతూ వస్తోందని.. రైతులు, మహిళలు, పేదల కోసం బడ్జెట్ లో ప్రత్యేక స్థానం కల్పించామన్నారు. రైతుల పంటకు కనీస మద్దతు ధర కల్పించేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. దేశంలో 4.1 కోట్ల ఉద్యోగాల కల్పనతో పాటు పేదలకు 3.4 కోట్ల గృహ నిర్మాణాలకు శ్రీకారం చుట్టామన్నారు. గత బీఆర్ఎస్ సర్కారు పీఎం ఆవాస్ యోజన స్కీమ్‌ను అమలు చేయలేదన్నారు.