ఇండియాను కలిపి ఉంచేది సంస్కృతే

ఇండియాను కలిపి ఉంచేది సంస్కృతే

ఫిలాసఫర్, జర్నలిస్ట్ శ్రీ అరబిందో 150వ జయంతి ఉత్సవాల్లో అమిత్ షా

పుదుచ్చేరి: దేశంలోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన ప్రజలనందరినీ కలిపి ఉంచుతున్నది సంస్కృతేనని, భౌగోళికంగా వైవిధ్యమైన సంస్కృతి (జియో కల్చర్)ని మనం అర్థం చేసుకుంటే సమస్యలు వాటంతట అవే తొలగిపోతాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఫిలాసఫర్, జర్నలిస్ట్ శ్రీ అరబిందో 150వ జయంతి ఉత్సవాల్లో పాల్గొనడానికి ఆయన ఆదివారం పుదుచ్చేరి వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, ద్వారక నుంచి బెంగాల్ వరకు మనల్ని కలిపి ఉంచుతున్న ఏకైక  కారణం సంస్కృతి. అది మన దేశానికి ఒక ఆత్మవంటిది. శ్రీ అరబిందోను చదివితే దీన్ని చక్కగా అర్థం చేసుకోగలమని ఆయన వివరించారు. ప్రపంచంలోని మరే దేశానికి ఇలాంటి సంస్కృతి లేదని షా చెప్పారు. మన వేదాలు, ఉపనిషత్తులు, సాహిత్యంలో ఎక్కడా సాంస్కృతిక సరిహద్దులు లేవని ఆయన గుర్తుచేశారు. స్వాతంత్ర పోరాటంలో శ్రీ అరబిందో పాత్రను ఆయన గుర్తు చేసుకున్నారు. ప్రజలకు తెలియని స్వాతంత్ర సమరయోధులను గుర్తు చేసుకోవడానికే ప్రధాని మోడీ 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' కార్యక్రమాన్ని రూపొందించారన్నారు.