సబితను అక్కా అని పిలవడం తప్పా

సబితను అక్కా అని పిలవడం తప్పా
  • మహిళలంటే కాంగ్రెస్​కు ఎంతో గౌరవం: విప్ ఆది శ్రీనివాస్
  • సీఎం కామెంట్లను బీఆర్ఎస్ వక్రీకరించింది: మక్కాన్ సింగ్

హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ సమావేశాలను పక్కదారి పట్టించేందుకే మహిళల ఇష్యూను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తెరపైకి తెచ్చారని విప్ ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. మహిళలంటే కాంగ్రెస్ పార్టీకి ఎంతో గౌరవమని అన్నారు. బుధవారం అసెంబ్లీలోని సీఎల్పీలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘మహిళల పేరుతో బీఆర్ఎస్ డ్రామాలు చేస్తున్నది. 

సబితా ఇంద్రారెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి అక్కా అని సంబోధించడం తప్పా? ఆమెను రెండు సార్లు మంత్రిని చేసింది కాంగ్రెస్ పార్టీయే అని గుర్తుపెట్టుకోవాలి. మహిళా గవర్నర్ పట్ల బీఆర్ఎస్ లీడర్లు ఎలా వ్యవహరించారో అందరూ చూశారు. గతంలో సీతక్కను సెక్రటేరియెట్​లోకి రాకుండా అడ్డుకున్నది బీఆర్ఎస్ సర్కార్ కాదా? మంత్రి సీతక్కను కేటీఆర్ ఏక వచనంతో పిలుస్తూ కించపర్చాడు. సీఎంను కూడా ఇదే విధంగా అవమానపర్చాడు. సభా గౌరవాన్ని కించపరుస్తున్నది బీఆర్ఎస్ నేతలే’’అని అన్నారు. 

సబితా అంటే ఎంతో గౌరవం: మక్కాన్ సింగ్

సబితా ఇంద్రారెడ్డి అంటే తమకెంతో గౌరవమని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. ‘‘సబితా ఇంద్రారెడ్డిని రేవంత్ రెడ్డి అక్కా అని పిలుస్తరు. భట్టి విక్రమార్క కూడా ఆమె ఇంటికి వెళ్లి పార్టీ మారొద్దని కోరారు. అయినా ఆమె వినిపించుకోలేదు. కేసీఆర్ ఏనాడైనా.. మహిళలకు ప్రాధాన్యత ఇచ్చాడా? మహిళా గవర్నర్​ను అమానించారు. సీఎం రేవంత్ రెడ్డి కామెంట్లను బీఆర్ఎస్ నేతలు వక్రీకరించారు’’అని అన్నారు. 

దళితుడైన భట్టి విక్రమార్క.. సీఎల్పీ నేత కావడంతో ఓర్వలేకనే సబితా కాంగ్రెస్​ను వీడారని మానకొండూర్ ఎమ్మెల్యే సత్యనారాయణ అన్నారు. కాంగ్రెస్ ఎన్నో అవకాశాలు ఇచ్చినా.. ఆమె మాత్రం మంత్రి పదవి కోసం పార్టీ వీడి బీఆర్ఎస్​లో చేరారని విమర్శించారు.