కాంగ్రెస్ సర్కార్​లో.. ఫస్ట్ జాబ్ రజనీకే

కాంగ్రెస్ సర్కార్​లో.. ఫస్ట్ జాబ్ రజనీకే
  • ఇచ్చిన హామీ నిలబెట్టుకోనున్న రేవంత్ రెడ్డి
  •     ప్రమాణ స్వీకారానికి దివ్యాంగురాలికి ఆహ్వానం

హైదరాబాద్, వెలుగు :  కాంగ్రెస్ సర్కార్​లో తొలి ఉద్యోగం దివ్యాంగురాలు రజనీకి ఇవ్వనున్నట్టు తెలుస్తున్నది. రేవంత్ ప్రమాణ స్వీకారానికి రావాలంటూ రజనీకి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఆహ్వానం పంపింది. సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. రజనీకి ఉద్యోగం ఇచ్చే ఫైల్​పైనే ఆయన తొలి సంతకం చేస్తారని సమాచారం.

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆరు గ్యారెంటీ కార్డుల పాంప్లెట్​ను కాంగ్రెస్ లీడర్లు ఇంటింటికీ పంచారు. ఇది చదివిన రజనీ.. అక్టోబర్ 17న తన బాధ చెప్పుకోవడానికి గాంధీభవన్​కు వచ్చింది. తాను పీజీ చేశానని, హైట్ తక్కువగా ఉండటంతో ఎవరూ ఉద్యోగం ఇవ్వడం లేదని రేవంత్ రెడ్డితో రజనీ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే గ్యారెంటీ కార్డుపై రజనీ వివరాలను తీసుకున్న రేవంత్.. ప్రమాణ స్వీకారం చేసే రోజే ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు.

కాగా, కొత్త ప్రభుత్వంలో తొలి ఉద్యోగం తనకే రావడం సంతోషంగా ఉందని ఆమె చెప్పింది. ఉద్యోగం కోసం కాంగ్రెస్​తో పాటు బీఆర్ఎస్, బీజేపీ లీడర్లనూ కలిశానని రజనీ గుర్తు చేసింది. గతంలో కాంట్రాక్ట్​, ఔట్​సోర్సింగ్ జాబ్ కోసం సెక్రటేరియెట్ చుట్టూ తిరిగినా స్పందన రాలేదన్నారు. డబుల్ బెడ్రూం ఇల్లు, ఉద్యోగం కోసం ఎంతో ట్రై చేశానని చెప్పింది. ప్రైవేట్​ ఉద్యోగం కోసం ప్రయత్నించినా దక్కలేదని తెలిపింది. తనకు ఏ ఉద్యోగం ఇచ్చినా చేస్తానని చెప్పింది. అమ్మాయిలను తక్కువ చేసి చూడొద్దని సూచించింది.