నరేశ్‌ గోయల్‌కు IT నోటీసులు

నరేశ్‌ గోయల్‌కు IT నోటీసులు

తీవ్ర ఆర్థిక సంక్షోభంతో మూతపడిన జెట్‌ ఎయిర్‌వేస్‌ వ్యవస్థాపకుడు నరేశ్‌ గోయల్‌కు ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. ఆయన పన్ను ఎగవేత ఆరోపణలు ఎదుర్కోనడంతో నోటీసులు జారీ అయ్యాయని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఆయనకు ఐటిశాఖ సమన్లు జారీ చేయడం ఇదే మొదటిసారి. రూ. 650 కోట్ల పన్ను ఎగవేత కేసులో గోయల్‌ ను అధికారులు ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది.

ముంబైలోని జెట్ ఎయిర్ వేస్ ఆఫీసులో గతేడాది ఐటీ అధికారులు సోదాలు జరిపారు. పలు డాక్యుమెంట్లను అప్పట్లో స్వాధీనం చేసుకున్నారు. దుబాయిలోని ఒక ఎయిలైన్స్ కంపెనీతో జెట్ ఎయిర్ వేస్ కు అక్రమ లావాదేవీలు జరిగాయని దర్యాప్తులో తేలింది. దుబాయి లోని ఒక జనరల్ సేల్స్ ఏజెంట్ కు ప్రతి ఏటా భారీ మొత్తంలో కమిషన్లను ముట్టచెప్పినట్టు అధికారులు నిర్ధారించారు. ఆదాయపు చట్టం కింద ఉన్న పరిమితులను దాటి ఈ చెల్లింపులు జరిగినట్లు తేలింది. జెట్‌ ఎయిర్‌వేస్‌ పన్ను ఎగవేసేందుకు విదేశాలకు నిధులను మళ్లించాలనే ఉద్దేశ్యంతోనే ఈ చెల్లింపులు జరిగాయి. ఈ చెల్లింపులపై ప్రశ్నించేందుకు గోయల్‌కు సమన్లు జారీ చేసినట్లు IT అధికారులు తెలిపారు.