హైదరాబాద్ లో ప్రముఖ బిర్యానీ హోటళ్లలో ఐటీ సోదాలు

హైదరాబాద్ లో ప్రముఖ బిర్యానీ హోటళ్లలో ఐటీ సోదాలు
  • బిల్లుల్లో గోల్‌‌మాల్‌‌, ఐటీ చెల్లింపుల్లో వత్యాసాలు
  • హార్డ్‌‌ డిస్క్​లు, బ్యాంక్ అకౌంట్లు స్వాధీనం

హైదరాబాద్‌‌, వెలుగు: హైదరాబాద్ లోని ప్రముఖ బిర్యానీ హోటళ్లలో ఇన్‌‌కమ్  ట్యాక్స్‌‌  డిపార్ట్​మెంట్  సోదాలు చేసింది. నగరంలోని పిస్తా హౌస్‌‌, షా గౌస్‌‌, మెహిఫిల్‌‌  సహా పలు హోటళ్లలో మంగళవారం తెల్లవారుజాము నుంచి రాత్రి వరకూ ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. షేక్‌‌పేట్‌‌, అత్తాపూర్, టోలిచౌకీ, లక్డీకపూల్‌‌లోని హోటళ్లతో పాటు ఆ సంస్థల చైర్మన్లు,  డైరెక్టర్లు, అనుబంధ సంస్థలు సహా మొత్తం 18 ప్రాంతాల్లో తనిఖీలు చేసింది.

 రాజేంద్రనగర్‌‌‌‌ గోల్డెన్  హైట్స్‌‌  కాలనీలోఉన్న పిస్తా హౌస్  ఓనర్  మహమ్మద్  మాజీద్, మహమ్మద్  ముస్తాన్  ఇండ్లలో కూడా అధికారులు సోదాలు చేశారు. ఐదు రోజుల సర్చ్ వారంట్‌‌తో 50 మంది అధికారుల బృందం ఈ ఆపరేషన్‌‌లో పాల్గొన్నది. సీఆర్‌‌‌‌పీఎఫ్‌‌  సెక్యూరిటీ మధ్య సోదాలు చేశారు. హోటళ్ల  బిల్‌‌ కౌంటర్‌‌‌‌లోని కంప్యూటర్  హార్డ్​ డిస్కులు, సంబంధిత యజమానుల బ్యాంక్ అకౌంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

రెండేండ్ల ఐటీ చెల్లింపుల్లో వ్యత్యాసం

ఐటీ చెల్లింపుల్లో భారీగా వ్యత్యాసం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. రెండేండ్ల రికార్డుల ప్రకారం సమాచారం సేకరించారు. బిల్స్  లేకుండా కౌంటర్  సేల్స్‌‌ జరుగుతున్నట్లు కనుగొన్నారు. ఇలా వచ్చిన సొమ్మును దారి మళ్లిస్తున్నట్లు ఆధారాలు సేకరించారు. ఐటీ చెల్లింపుల తేదీలవారీగా వచ్చిన ఆదాయంపై వివరాలు సేకరిస్తున్నారు.