- అంబేద్కర్ లా కాలేజీలో పోక్సో యాక్ట్‌పై అవగాహన
- హాజరైన కరస్పాండెంట్ సరోజ వివేక్
ముషీరాబాద్, వెలుగు: చిన్నారులు, అమ్మాయిలపై లైంగిక వేధింపులను అరికట్టాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని అడిషనల్ డీజీపీ స్వాతి లక్ర ఐపీఎస్ అన్నారు. ఇందుకోసమే పోక్సో చట్టం వచ్చిందని గుర్తు చేశారు. అమ్మాయిలపై జరుగుతున్న అగత్యాలను అరికట్టేందుకే షీ టీమ్స్ ఏర్పడ్డాయని చెప్పారు. మహిళల సమస్యలు వినేందుకు ప్రత్యేకంగా భరోసా సెంటర్లు ఉన్నాయన్నారు.
మంగళవారం బాగ్‌లింగంపల్లిలోని అంబేద్కర్ లా కాలేజీలో స్నేహధర ఫోక్స్ లా సెంటర్, కంపాస్ లా అసోసియేషన్, తరణి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పోక్సో చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి అడిషనల్ డీజీపీతో పాటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ అల్లూరి రామ్ రెడ్డి, కంపాస్ లా అసోసియేషన్ సీఈవో ప్రియా అయ్యంగార్, తరుణి డైరెక్టర్ మమతా రఘువీర్, కరస్పాండెంట్ జి.సరోజ వివేక్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి స్వాతి లక్రా మాట్లాడారు. ఎక్కడైనా చిన్నారులపై లైంగిక దాడులు జరిగినట్లు తెలిస్తే వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం 900 పోక్సో కేసులకు ఒక కోర్టు ఉందని, కానీ 100 కేసులకు ఒక కోర్టు ఉంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. బాధితులకు అండగా భరోసా సెంటర్ లో లీగల్ అడ్వైజర్లు, డాక్టర్లు, ఎన్జీవోలు ఉంటారని చెప్పారు.
గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌పై అవగాహన కల్పించాలి: సరోజ వివేక్
నేటి సమాజంలో మన చుట్టూ ఎన్నో నేరాలు జరుగుతున్నాయని, వాటిని చూసీచూడనట్లు వదిలేయవద్దని అంబేద్కర్ కళాశాల కరస్పాండెంట్ జి.సరోజ వివేక్ అన్నారు. ఎక్కడైనా నేరం జరిగితే బాధ్యతగా ఫిర్యాదు చేయాలని సూచించారు. లైంగిక దాడుల విషయంలో అమ్మాయిలు వేసుకునే బట్టలపై మాట్లాడడం తగదన్నారు. వయసు తేడా లేకుండా అత్యాచార ఘటనలు చోటుచేసుకోవడం బాధేస్తోందన్నారు.
పిల్లలకు చిన్న వయసు నుంచే గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌పై తల్లిదండ్రులు అవగాహన కల్పించాలన్నారు. అంబేద్కర్ కాలేజీలో ర్యాగింగ్‌కు తావు లేదన్నారు. కాకా వెంకటస్వామి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ద్వారా ఎంతోమంది పేదలకు చదువు అందిస్తూ, 75 వేల మందిని ఉన్నతస్థాయిలో నిలిపినట్లు తెలిపారు. అనంతరం స్టిక్కర్, పోర్టల్, బ్రోచర్స్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో లా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సృజన, ఫ్యాకల్టీ, విద్యార్థులు పాల్గొన్నారు.
