పాట్నా: కుటుంబ సమస్యను అంతర్గతంగా పరిష్కరించుకుంటామని ఆర్జేడీ చీఫ్ లాలూప్రసాద్ యాదవ్ తెలిపారు. కొత్తగా ఎన్నికైన ఆర్జేడీ ఎమ్మెల్యేల మీటింగ్ సోమవారం పాట్నాలో జరిగింది. దీనికి లాలూ, ఆయన భార్య రబ్రీదేవి, పెద్ద బిడ్డ మీసా భారతి, కొడుకు తేజస్వీ యాదవ్ తదితరులు హాజరయ్యారు. ఇందులో తేజస్వీ యాదవ్‌ను ఆర్జేడీ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా తన కుటుంబంలో నెలకొన్న గొడవలపై లాలూ తొలిసారి స్పందించారు. ‘‘ఇది.. మా ఇంటి గొడవ. మేం అంతర్గతంగా పరిష్కరించుకుంటం. దాన్ని పరిష్కరించేందుకు నేను ఉన్నాను” అని తెలిపారు. బిహార్ ఎన్నికల్లో ఆర్జేడీ గెలుపు కోసం తేజస్వీ చాలా కష్టపడ్డాడని, అతడు పార్టీని ముందుకు తీసుకెళ్తాడని కొనియాడారు. తేజస్వీ యాదవ్, తన సోదరి రోహిణి ఆచార్య మధ్య విభేదాలు నెలకొనడం.. కుటుంబంతో ఆమె తెగదెంపులు చేసుకున్న నేపథ్యంలో లాలూ స్పందించారు. కాగా, ప్రతిపక్ష నేతగా ఉండేందుకు తేజస్వీ మొదట విముఖత వ్యక్తం చేశారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ‘‘అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమికి నాదే బాధ్యత. ఇకపై నేను ఎమ్మెల్యేగానే ఉంటాను. ప్రతిపక్ష నేత పదవి నాకొద్దు” అని తేజస్వీ చెప్పినట్టు తెలిపాయి. అయితే లాలూ ఆదేశాల మేరకు ప్రతిపక్ష నేతగా ఉండేందుకు ఒప్పుకున్నారని చెప్పాయి.
కిడ్నీలు దానం చేసే ధైర్యముందా?: రోహిణి
తాను తన తండ్రి లాలూకు ‘డర్టీ కిడ్నీ’ ఇచ్చానంటూ ఆరోపణలు చేసినోళ్లు.. దానిపై బహిరంగ చర్చకు సిద్ధమా? అంటూ రోహిణి ఆచార్య సవాలు విసిరారు. తనపై ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నోళ్లకు.. వాళ్ల కిడ్నీలను దానం చేసే ధైర్యముందా? అని ప్రశ్నించారు. ‘‘లాలూజీపై సానుభూతి చూపిస్తున్నట్టు నటించడం మానెయ్యండి. మీకు నిజంగా లాలూపై ప్రేమ ఉంటే, ఆయన పేరు మీద కిడ్నీలు దానం చేయండి. ఎంతోమంది పేషెంట్లు కిడ్నీల కోసం ఎదురుచూస్తున్నారు” అని మంగళవారం ‘ఎక్స్’లో పోస్టు పెట్టారు.
