ప్రైవేట్ ఆస్పత్రులపై ఐటీ దాడులు

ప్రైవేట్ ఆస్పత్రులపై ఐటీ దాడులు
  • ఖమ్మంలోని 3 ఆస్పత్రుల్లో తనిఖీలు 
  • కీలక ఫైళ్లను తప్పించిన బిలీఫ్ ఆస్పత్రి?  

ఖమ్మం/ ఖమ్మం కార్పొరేషన్, వెలుగు: ఖమ్మం నగరంలోని ప్రైవేట్ ఆస్పత్రులపై ఐటీ దాడులు జరిగాయి. బుధవారం ఉదయం నుంచి రాత్రిదాకా  సోదాలు కొనసాగాయి. వైరా రోడ్​లో ఉన్న రోహిత్ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్, బిలీఫ్​హాస్పిటల్, శ్రీరాం కిడ్నీ సెంటర్​లో విజయవాడ సర్కిల్​కు చెందిన ఐటీ అధికారులు 10 మంది ఏక కాలంలో తనిఖీలు సోదాలు చేశారు. సోదాల టైమ్ లో బిలీఫ్ ఆస్పత్రి సిబ్బంది బిల్డింగ్ వెనుక నుంచి కీలక ఫైళ్లను తరలించడం మీడియాకు చిక్కింది. ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఒక వ్యక్తి ఫైళ్లను కిందికి విసిరేయగా, అప్పటికే అక్కడ బైకులపై ఉన్న వ్యక్తులు వాటిని తీసుకొని వెళ్లడం కనిపించింది. రోజూ లక్షల్లో ఆదాయం వస్తున్నా చూపించకుండా ట్యాక్స్​ ఎగ్గొడుతున్నారనే కారణాలతోనే ఈ ఆస్పత్రుల్లో సోదాలు జరిగాయని భావిస్తుండగా, దీని వెనుక ఇతర కారణాలు కూడా ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది. 

రెండు ఆస్పత్రులు ఒకే కుటుంబానివి.. 

రోహిత్ టెస్ట్ ట్యూబ్​బేబీ సెంటర్, బిలీఫ్ హాస్పిటళ్లు రెండూ ఒకే కుటుంబానికి చెందినవి. ఏపీ నుంచి ఏళ్ల క్రిందే  వచ్చి ఖమ్మంలో స్థిరపడ్డ ఓ కుటుంబం.. మొదట రోహిత్ టెస్ట్ ట్యూబ్ బేబీ​సెంటర్ ప్రారంభించగా, కొన్నేళ్ల కిందే బిలీఫ్​ఆస్పత్రి ప్రారంభించింది. ఈ ఆస్పత్రుల్లో సిజేరియన్ కు రూ.లక్షన్నర వరకు ఫీజు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. నెహ్రూనగర్ లోని మరో 2ఆస్పత్రులపైనా ఐటీ చెల్లింపులపై ఫిర్యాదులు ఉన్నాయని సమాచారం. ఖమ్మంలో టీఆర్ఎస్​కు చెందిన ఒక కీలక నేతకు సంబంధించి ఆర్థిక వ్యవహారాల కేసు నడుస్తోంది. అందులో భాగంగానే రోహిత్, బిలీఫ్ ఆస్పత్రులపై ఐటీ దాడులు జరిగాయన్న ప్రచారం జరుగుతోంది. 

మీడియాను అడ్డుకున్న సిబ్బంది 

బిలీఫ్ ఆస్పత్రిలో అధికారులు సోదాలు చేస్తున్న టైమ్ లో మీడియా అక్కడికి వెళ్లగా హాస్పిటల్ సిబ్బంది అడ్డుకున్నారు. ఆస్పత్రి ఎంట్రెన్స్​ నుంచి లోపలి విజువల్స్ ను షూట్ చేస్తున్న కెమెరామెన్లను సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. ఓ ఆఫీసర్ బయటకు వచ్చి.. ముఖ్యమైన సెర్చ్ ఆపరేషన్ జరుగుతోందని, పని పూర్తయిన తర్వాత సమాచారం చెప్తామని తెలిపారు. దీంతో గొడవ సద్దుమణిగింది.