హరీశ్ సారూ.. గాంధీ కష్టాలు సూడు!

హరీశ్ సారూ.. గాంధీ కష్టాలు సూడు!
  • హెల్త్​ మినిస్టర్​ హోదాలో ఫస్ట్​టైమ్​ విజిట్​
  • ఏండ్లుగా ఆస్పత్రిని వేధిస్తున్న సమస్యలు 
  • పేదోడి కార్పొరేట్​ దవాఖానకు కరువైన సంపూర్ణ వైద్యం
  • మంత్రి పర్యటన​పైనే గాంధీ పేషెంట్ల ఆశలు

పద్మారావునగర్, వెలుగు: పేదల కార్పొరేట్ ​ఆస్పత్రి గాంధీలో కనీస సౌకర్యాలు లేవు. ఖరీదైన వైద్య చికిత్సలు  అందడం లేదు.  నిపుణులు ఉన్నా చాలా డిపార్ట్​మెంట్లలో టెక్నికల్​పరికరాలు లేక వైద్య సేవలు నిలిచిపోయాయి. చికిత్స కోసం రాష్ర్టంలోని వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న జనాలు ఇక్కడ అవసరమైన మెడికల్ ట్రీట్​మెంట్​లేదని తెలుసుకొని ఊసురుమంటూ తిరిగి వెళ్తుండగా, మరికొందరు రూ.లక్షలు పోసి కార్పొరేట్​ఆస్పత్రులకు వెళ్తున్నారు. సొంతంగా ఆస్పత్రికి ఉన్న నిదులను సౌకర్యాలు మెరుగు పరుచుకునేందుకు హాస్పిటల్ ​డెవలప్​మెంట్​కమిటీ (హెచ్​డీసీ) చైర్మన్​ అయిన జిల్లా కలెక్టర్​కు అనుమతి ఇచ్చింది. తెలంగాణ స్టేట్ ​మెడికల్ సర్వీసెస్ అండ్​ఇన్​ఫ్రాస్టక్చర్ డెవలప్​మెంట్​ కమిటీ​(​టీఎస్​ఎంఐడీసీ) ద్వారానే పనులు నిర్వహించుకోవాలనే రూల్​ ఇబ్బందిగా మారింది. ప్రతి ఏడాది రాష్ర్ట మంత్రులు, వైద్య శాఖ ఉన్నతాధికారులు ఆస్పత్రికి రావడం నిధులు మంజూరు చేస్తామని చెప్పడం, హెచ్ డీసీ మీటింగ్​లో తీర్మానాలు చేయడానికే పరిమితమయ్యారు. ఇంతవరకు ఏ ఒక్క పని పూర్తి చేయకపోవడాన్ని గాంధీ ఆస్పత్రి దుస్థితిని తెలుపుతోంది. 

సీఎం కేసీఆర్​ సందర్శించినా..

కరోనా టైమ్​లో సీఎం కేసీఆర్ ఆస్పత్రిని సందర్శించినా కూడ అభివృద్ధి పనుల్లో కదలిక రాలేదు.  ఓపీకి రోజూ1,500  నుంచి 2 వేల మంది వరకు ఉంటారు.  ఇందులో చాలామంది ఇన్​పేషెంట్లుగా ఆస్పత్రి అడ్మిట్ అయి ట్రీట్​మెంట్​పొందుతుంటారు.  ఆస్పత్రి ఆవరణలోనే మెడికల్ కాలేజీ ఉండగా, సీనియర్, జూనియర్ ​డాక్టర్ల సిబ్బంది కొరత లేదు. నాన్​ మెడికల్ సిబ్బంది కొరత కొన్నేండ్లుగా ఉంది. శనివారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టి. హరీశ్​రావు మొదటి సారి ఆస్పత్రి సందర్శనకు వస్తుండగా స్టాఫ్​ ఎన్నో ఆశలు పెట్టుకుంది.  వరంగల్​లో కొత్తగా సూపర్​ స్పెషాలిటీ ఆస్పత్రికి మంత్రి హరీశ్ రావు  రూ.1100 కోట్ల నిధులను కేటాయిస్తూ పరిపాలన అనుమతులిచ్చిన నేపథ్యంలో గాంధీలో దీర్ఘకాలికంగా నెలకొన్న సమస్యల పరిష్కారానికి కూడా మోక్షం కలుగుతుందనే ఆశాభావాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు.

ఆస్పత్రిలో ప్రధాన సమస్యలు  

2010లో గాంధీలో రూ.కోట్ల నిధులతో క్యాథ్ ల్యాబ్ ​ఏర్పాటు చేయగా ఏడాదిన్నరగా పని చేయడం లేదు. దీంతో హార్ట్ పేషెంట్లకు  యాంజియోగ్రామ్​ టెస్ట్​లు నిలిచిపోయాయి. క్యాథ్ ​ల్యాబ్ ​మెషీన్​ రిపేర్లు, నిర్వహణకు రూ .75 లక్షలు అవసరం అవుతాయి.  మూడేండ్ల కిందట రూ. 30  కోట్లను మంజూరు చేస్తూ  గాంధీ 8వ ఫ్లోర్లో అవయవ మార్పిడికి  మాడ్యులర్​ ఆపరేషన్​ థియేటర్​ను ఆధునిక హంగులతో నిర్మించేందుకు ప్రపోజల్స్​ రెడీ చేయగా.. అమలుకు నోచుకోవడం లేదు. 3 నెలల కిందట రూ .14  కోట్లతో ఎంఆర్​ఐ స్కానింగ్​ మెషీన్​ కొన్నారు. కానీ దానికి అవసరమైన విద్యుత్​ ట్రాన్స్​ఫార్మర్​ను​ ఏర్పాటు చేయకపోవడంతో వినియోగంలోకి రాక పేషెంట్లు ఇబ్బందులు పడుతున్నారు. కొందరు ప్రైవేట్​ ల్యాబ్​లకు వెళ్తుండగా,  మరికొందరిని ఉస్మానియా, ఎంఎన్​జే క్యాన్సర్ ​ఆస్పత్రులకు తరలించి స్కానింగ్ చేయిస్తున్నారు. 

ఆస్పత్రి సెల్లార్​ లోని డ్రైనేజీ వ్యవస్థ  అధ్వానంగా మారింది. డ్రైనేజీ నీరు బయటకు పోక, పరిసరాలు కంపు కొడుతున్నాయి. శిథిలమైన డ్రైనేజీ స్థానంలో కొత్తగా అండర్​ గ్రౌండ్​ డ్రేనేజీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఆస్పత్రి భవనాల్లో ఎక్కడ చూసినా వాటర్​ లీకేజీ​లే కనిపిస్తాయి. దీంతో రోజంతా వేల లీటర్ల విలువైన నీరు వృథాగా పోతోంది. తద్వారా పైపులు , గోడలు కరాబవుతున్నాయి.  ఆస్పత్రి విస్తీర్ణం మొత్తం 15 లక్షల ఎస్ఎఫ్​టీలు.   డైలీ 2 వేల మంది ఓపీ పేషెంట్లతో పాటు వేల మంది సందర్శకులు వస్తుంటారు. సెక్యూరిటీ సిబ్బంది తక్కువ ఉన్నారు. ఇటీవల జరిగిన షార్ట్​ సర్క్యూట్ కారణంగా పలు సీసీ కెమెరాలు పని చేయడం లేదు. 185 మంది ఔట్ ​సోర్సింగ్​, 200 మంది రెగ్యులర్ ​శానిటేషన్​ సిబ్బంది మాత్రమే ఉన్నారు. సెల్లార్​లో  సురక్షితమైన స్థితిలో లేని  డైట్ క్యాంటీన్​ను ఆరు బయట ప్రత్యేక వసతిని ఏర్పాటు చేసి, అందులోకి షిప్ట్​ చేయాలనే డిమాండ్​ చాలా కాలంగా ఉంది. వేలాది మంది ఆస్పత్రికి వస్తుండగా ఆవరణలో సువిశాలమైన పార్కింగ్​ స్థలం లేదు.