కొత్త పార్టీకి కోదండ మంత్రాంగం

కొత్త పార్టీకి కోదండ మంత్రాంగం

మొన్న ఖమ్మంలో పొంగులేటి సభకు
నిన్న సూర్యాపేట మీటింగ్ లో ఆసక్తికర వ్యాఖ్యలు
కేసీఆర్ వ్యతిరేకశక్తుల పునరేకీకరణ దిశగా అడుగులు
టీజేఎస్ ను కలిపేందుకూ వెనుకాడనని కామెంట్స్
కొత్త పార్టీ ఆవిర్భావానికి జోరుగా సంప్రదింపులు

హైదరాబాద్ : కేసీఆర్ కు వ్యతిరేకంగా రాష్ట్రంలో ఏర్పడబోయే కొత్త పార్టీ కోసం కీలక నేతలతో తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ వ్యతిరేక శక్తులను ఒక్క తాటిమీదకు తెచ్చే బాధ్యతను ఆయన తీసుకున్నట్టు సమాచారం. ఇందులో భాగంగానే ఇటీవల ఖమ్మంలో పొంగులేటి నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని, తెలంగాణ ఆకాంక్షలు నెరవేరలేదంటూ కామెంట్లు చేశారని తెలిసింది. నిన్న సూర్యాపేటలో జరిగిన టీజేఎస్ ప్లీనరీలోనూ ఇదే కామెంట్లు చేశారు.

కేసీఆర్ కు వ్యతిరేకంగా పనిచేసే పార్టీలతో పొత్తు పెట్టుకుంటామని, కొత్తగా ఏర్పడబోయే పార్టీలో టీజేఎస్ ను విలీనం చేస్తామని చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసి ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్న వారు.. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల్లోని అసంతృప్తులతో సంప్రదింపులు జరుపుతున్నారు. కేసీఆర్ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకు కొత్త పార్టీతో కలిసి వచ్చే రాజకీయ పక్షాలతో పొత్తుల కోసం కోదండరాం చర్చలు జరిపే అవకాశం ఉంది. తెలంగాణ ప్రజల గొంతుకగా ఏర్పాటయ్యే ఈ పార్టీ కోసం రహస్య భేటీలు కూడా జరుగుతున్నాయి. వివాద రహితుడిగా పేరున్న ప్రొఫెసర్ కోదండరాం సంప్రదింపుల కోసం రంగంలోకి దిగినట్టు సమాచారం.

ఆత్మీయ సమ్మేళనాలు, రౌండ్ టేబుల్ సమావేశాలకు ఆయన హాజరవుతున్నారు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను, ప్రస్తుతం బీఆర్ఎస్ ప్రభుత్వ తీరును వివరిస్తున్నారు. మార్పు అవసరమనే విషయాన్ని నొక్కి చెబుతున్నారు. ప్రత్యామ్నాయ వేదిక అవసరాన్ని వివరిస్తున్నారు. బలమైన నాయకత్వం అవసరమని, కొత్త పార్టీ తెలంగాణ ప్రజల గొంతుకగా నిలవాల్సిన ఆవశ్యకత ఉందని చెబుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా కార్యాచరణకు ప్రణాళికలు రెడీ చేస్తున్నట్టు తెలిసింది. 

నాయకత్వం వహించేదెవరు..?

కొత్త పార్టీకి నాయకత్వం ఎవరు వహించినా.. సరే కేసీఆర్ ప్రభుత్వం గద్దె దించే కార్యాచరణతో ముందుకు సాగనుంది. కొత్తగా ఏర్పాటయ్యే పార్టీకి ఎవరు సారథ్య బాధ్యతలు వహిస్తారన్నది చర్చనీయాంశంగా మారింది. నిన్న సూర్యాపేటలో జరిగిన టీజేఎస్ మూడో ప్లీనరీ సమావేశాల్లో కోదండరాం చేసిన వ్యాఖ్యలు ఇందుకు బలాన్ని చేకూర్చుతున్నాయి. బీఆర్ఎస్ నిరంకుశ పాలనను అంతమొందించేందుకు ప్రజాస్వామిక తెలంగాణ ఆకాంక్షమీద పార్టీలు ఏకం కావాలని పిలుపునిచ్చారు. దాని తర్వాతే ఎన్నికలైనా.. పదవులైనా అని పేర్కొన్నారు.

టీజేఎస్ ఏర్పాటు చేసిన కోదండరాం తెలంగాణ పాలిటిక్స్ లో ప్రభావం చూపలేకపోయారు. నామమాత్రపు పోటీ మాత్రమే ఇచ్చారు. విషయాన్ని గ్రహించిన ఆయన ఈసారి ముందస్తుగానే కలిసి వచ్చే శక్తులతో సంప్రదింపులు జరుపుతున్నారని సమాచారం. కొత్తగా ఏర్పడబోయే పార్టీకి ఎవరు నాయకత్వం వహిస్తారు.. చరిష్మాతోపాటు అంగబలం, అర్థబలం ఉన్న నాయకుడెవరు..? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.