జూపల్లి, ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి మాటల యుద్ధం

జూపల్లి, ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి మాటల యుద్ధం
  • నియోజకవర్గం అభివృద్ధిపై సవాళ్లు, ప్రతిసవాళ్లు

కొల్లాపూర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ లో మరోసారి రాజకీయం రచ్చకెక్కింది. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతో తాడోపేడో తేల్చుకునేందుకు కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. క్యాంప్ ఆఫీస్ లో సీఎం కేసీఆర్ తో భేటీ తర్వాతే.. ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నట్లు జోరుగా చర్చ జరుగుతోంది. సీఎం కేసీఆర్ తో మీటింగ్ తర్వాత నేరుగా కొల్లాపూర్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి  బయల్దేరారు. నియోజకవర్గం అభివృద్ధిపై జూపల్లి సవాల్ కు సై అన్నారు. నియోజకవర్గం అభివృద్ధిపై చర్చకు అంబేద్కర్ సెంటర్ కు కాదు జూపల్లి ఇంటికే వస్తామని హర్షవర్ధన్ రెడ్డి అనుచరులు అంటున్నారు. దీంతో కొల్లాపూర్ టీఆర్ఎస్ లో కుమ్ములాటలు ఎటు దారి తీస్తాయోనన్నది ఆసక్తికరంగా మారింది. 

కొల్లాపూర్ లో అభివృద్ధిపై చర్చకు రావాలని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డికి సవాల్ చేశారు. రేపు కొల్లాపూర్ అంబేద్కర్ సెంటర్ లో చర్చ కోసం ఇరు వర్గాలు పోలీసుల అనుమతి కోరాయి. అయితే.. పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు. అంబేద్కర్ సెంటర్ కు కాదు జూపల్లి ఇంటికే వస్తామని ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి అనుచరులు స్పష్టం చేస్తున్నారు. ఈ మధ్యే కొల్లాపూర్ పర్యటనలో మంత్రి కేటీఆర్ జూపల్లి ఇంటికి వెళ్లి కలిశారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య ఉన్న విబేధాలపై చర్చించి.. జూపల్లికి సర్దిచెప్పినట్లు కూడా తెలిసింది. అయినా కొల్లాపూర్ టీఆర్ఎస్ లో వర్గ విభేదాలు ఏమాత్రం తగ్గలేదు. నువ్వానేనా అన్నట్లుగా హర్షవర్ధన్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు సవాళ్లు, ప్రతి సవాళ్లతో పొలిటికల్ హీట్ మరింత పెంచుతున్నారు.

జూపల్లి కృష్ణారావు గత కొన్ని రోజులుగా టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.  సీఎం కేసీఆర్ వనపర్తి సభకు, మంత్రి కేటీఆర్ కొల్లాపూర్ సభకు దూరంగా ఉన్నారు.  మున్సిపల్ ఎన్నికల్లో తన అనుచరులకు టికెట్లు ఇవ్వకపోవడంతో టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా తన వర్గం వారిని అభ్యర్థులను నిలబెట్టి, మెజార్టీ స్థానాలను జూపల్లి గెలుచుకున్నారు. అప్పటి నుంచి ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి మధ్య వివాదం మరింత ముదిరింది.