కాంగ్రెస్​తో టీఆర్ఎస్​ పొత్తు?

కాంగ్రెస్​తో టీఆర్ఎస్​ పొత్తు?

భారతదేశంలో రాజకీయ పదవి గొప్ప అధికారాన్ని ఇస్తుంది. బ్రిటన్ ప్రధాని తన పదవికి రాజీనామా చేసిన మరుక్షణం ఆయనకు ప్రభుత్వ సెక్యూరిటీ గార్డు కూడా ఉండడు. కానీ ఇండియాలో అలా కాదు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి రాజీనామా చేసిన తర్వాత కూడా ఆయనకు ఇంచుమించు అంతే స్థాయి గౌరవ మర్యాదలు, విలాసాలు ఉంటాయి. లైఫ్​స్టైల్​లో దాదాపు ఎలాంటి మార్పు ఉండదు. అందుకే ఇండియాలో పదవి కోల్పోవడానికి రాజకీయ నాయకులు ఇష్టపడరు. పదవిలో ఉన్న వ్యక్తిని ప్రజలు తమ కష్టాలు తీర్చే దేవుడిలా చూస్తారు. ప్రజాధనాన్ని ఆయన తన ఇష్టప్రకారం ఖర్చుచేయవచ్చు. పైగా సీఎం ద్వారా ప్రయోజనం పొందాలనుకున్న బడాబాబులు ఆయన వెంటే ఉంటూ ఏదో రకంగా మేలు చేస్తూనే ఉంటారు. హైదరాబాద్​ను ఏలిన నిజాంకు ముఖ్యమంత్రితో పోలిస్తే అధికారాలు తక్కువే ఉండేవి. శత్రువులు అతడిని ఓడిస్తే ప్రాణాల కోసం పారిపోవాల్సి ఉంటుంది కాబట్టి నిజాం ఎప్పుడూ చాలా జాగ్రత్తగా ఉండేవాడు. అయితే ముఖ్యమంత్రి ఓడిపోతే అలా ఉండదు. ఒడినప్పటికీ దాదాపు అన్నింటినీ ఆనందిస్తాడు. ప్రస్తుతం భారతదేశంలో గెలుపుపై విశ్వాసం లేని రాజకీయ నాయకులకు ప్రశాంత్​కిశోర్​ఆశాకిరణంలా మారారు. శత్రువులను అంతం చేసి ఎన్నికల్లో గెలుపించేందుకు తన వద్ద గాయత్రీ మంత్రం ఉన్నట్లు కిశోర్​భావిస్తున్నారు. కానీ ఆయన క్లయింట్లు మాత్రం ఇంకా మౌనంగానే ఉన్నారు. ఇంతకీ వారు ప్రశాంత్​కిశోర్​ను నియమించుకున్నారా? నియమించుకుంటే ఆ ఒప్పందం ఏమిటి? అనేది బయటకు రావడం లేదు. వీళ్ల తీరు చూస్తుంటే బయటి వారికి ఎవ్వరికీ తెలియకుండా జరిపే ‘పెళ్లి ప్రతిపాదన’ తంతులా కనిపిస్తోంది. ఎందుకంటే విషయం బయటకు తెలిస్తే బయటివారు వేడుకను చెడగొట్టొచ్చన్న భయం వారికి ఉండొచ్చు. ప్రశాంత్​కిశోర్​ విషయంలో కాంగ్రెస్ గాంధీలు, కేసీఆర్ మౌనంగా ఉన్నారు. ప్రశాంత్ కిశోర్ మ్యాజిక్ ద్వారా తమకు విజయం దక్కుతుందని వారు ఆశిస్తున్నారు. ఆయన కాంగ్రెస్ కు, కేసీఆర్‌‌‌‌కు ఎన్నికల వ్యూహకర్తగా పనిచేస్తున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. నిజంగా వీరిని ప్రశాంత్​కిశోర్ ఎన్నికల్లో గట్టెక్కించగలడా? ​

కాంగ్రెస్​తో టీఆర్ఎస్​పొత్తు?

తెలంగాణలో కేసీఆర్, కాంగ్రెస్​ఒక కూటమిలా ఏర్పాటుకు ప్రశాంత్​కిశోర్ ​ప్రయత్నం చేస్తున్నట్లు కన్పిస్తోంది. తెలంగాణలో కేసీఆర్​ముందు కాంగ్రెస్​తల వంచాలని ఆయన చెప్పకనే చెబుతున్నారు. గాంధీల ఆదేశాలను ఎలాగూ తెలంగాణ కాంగ్రెస్ నేతలెవరూ వ్యతిరేకించలేరు. అయితే ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ నేతలు ప్రశాంత్ పై ప్రశంసలు కురిపిస్తుండటం గమనార్హం. గత వారం వరకు ఆయనను తిట్టిన వారు.. ఆ మాటలు ఇప్పుడు మర్చిపోయినట్లు కనిపిస్తోంది. 2024 పార్లమెంట్​ఎన్నికల కోసమే తాను కాంగ్రెస్​కు పనిచేయనున్నట్లు ప్రశాంత్​కిశోర్​చెప్పారు. వాస్తవమేమిటంటే కాంగ్రెస్​కు తెలంగాణ పెద్ద సవాలే. కేసీఆర్​తో కాంగ్రెస్ ​పొత్తు పెట్టుకుంటే యూపీ, బీహార్‌‌‌‌, బెంగాల్లో లాగా భవిష్యత్​లో తెలంగాణలో కాంగ్రెస్​ఉండదు. ప్రస్తుతం అధికార టీఆర్ఎస్​పార్టీకి 90 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక వేళ వారికి టిక్కెట్​రాదని తెలిస్తే వెంటనే వారు రెబెల్స్​గా మారే ప్రమాదం ఉంది. అందుకే ప్రశాంత్​ కిశోర్​ నియామకాన్ని గోప్యంగా ఉంచుతున్నారు. దీంతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కనుమరుగవుతుంది. కాంగ్రెస్, టీఆర్ఎస్​నాయకులతో బీజేపీ మరింత పుంజుకునే అవకాశం ఉంటుంది. టిక్కెట్లు రావని భావించిన నేతలంతా బీజేపీ వైపు వస్తుంటారు. 

బలవంతపు రిటైర్మెంట్లు తప్పవా?

ప్రశాంత్​ నేతృత్వంలో తెలంగాణలో కాంగ్రెస్, టీఆర్ఎస్​ పొత్తు కుదిరితే ఈ రెండు పార్టీల లీడర్లలో చాలా మందికి బలవంతపు రిటైర్మెంట్లు తప్పేలా లేవు. అయితే రిటైర్మెంట్​ లేదా పెన్షన్​ లేకుండానే స్వచ్ఛంద పదవీ విరమణ చేయాల్సిన పరిస్థితులు రావొచ్చు. గెలిచిన తర్వాత మంచి మంచి పదవులు ఇస్తామని చెప్పొచ్చు. కానీ ఎన్నికల తర్వాత వాగ్దానాలు మరిచిపోవడం అందరికీ తెలిసిందే. ఈ రెండు పార్టీల రహస్యం ఎదో ఒక రోజు బయటపడుతుంది. అది జరిగిన రోజు ప్రస్తుత 90 మంది టీఆర్ఎస్​ ఎమ్మెల్యేలు, 119 చోట్ల పోటీకి సిద్ధమవుతున్న కాంగ్రెస్​ ఎమ్మెల్యే అభ్యర్థుల ఆశలు గల్లంతవుతాయి. తెలంగాణలో అధికారాన్ని నిలుపుకోవాలని కేసీఆర్ భావిస్తుండగా.. రాజకీయాల్లో ఇంకా కొనసాగాలని గాంధీలు అనుకుంటున్నారు. ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేయడం ద్వారా ఏదైనా నష్టం జరిగితే ఇక రాజకీయాలకు గుడ్‌‌‌‌బై చెప్పే పరిస్థితి రావొచ్చు. ఇటీవల ఏపీలో రాజీనామా చేసిన మంత్రులతోపాటు మంత్రి పదవిపై ఆశలు పెట్టుకొని రాక తీవ్ర నిరాశ చెందిన చాలా మంది వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ​కేటాయింపుపై పార్టీ అధినేత దగ్గర మొరపెట్టుకున్నారు. వచ్చేసారి ఇవ్వాల్సిందేనని డిమాండ్​ చేశారు. తెలంగాణలోనూ టీఆర్ఎస్ ​ఎమ్మెల్యేలు ప్రశాంత్​ కిశోర్​ తీర్పు వరకు ఆగకుండా తమ టిక్కెట్​పై భరోసా అడిగే అవకాశం లేకపోలేదు. తెలంగాణలో ఆసక్తికర రాజకీయ పరిణామం జరగబోతోంది. అదే జరిగితే టీఆర్ఎస్​ ఎమ్మెల్యేలు ఏం చేస్తారు? కాంగ్రెస్​ నేతల దారెటు? బీజేపీ ఎలాంటి ప్రణాళికలు రచించుకుంటుందో చూడాలి మరి.

హిందీయేతర రాష్ట్రాల్లోనే ఎందుకు?

ప్రశాంత్ కిషోర్‌‌‌‌ను వ్యూహకర్తగా ఎంచుకున్న రాజకీయ నేతలందరూ హిందీయేతర రాష్ట్రాల వారే. తమిళనాడు స్టాలిన్, బెంగాలీ మమతా బెనర్జీ, తెలుగు కేసీఆర్, తెలుగు జగన్ మోహన్ రెడ్డి, బహుశా మరాఠీ ఠాక్రే, శరద్ పవార్. ఇక్కడ ఒక్క హిందీ రాష్ట్రాల నేత లేడు. ప్రశాంత్‌‌‌‌ను కేవలం హిందీయేతర నాయకులు మాత్రమే ఎందుకు తీసుకుంటున్నారనేది ప్రశ్న. బలహీనమైన పార్టీలు కాకుండా ఆయన ఎప్పుడూ బలమైన, ధనిక పార్టీలను ఎంచుకుంటాడు. గత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో ఆయన నేతృత్వంలో విజయం సాధించినా.. ఆ రెండు ప్రభుత్వాలపై తీవ్ర వ్యతిరేకత కూడా ఉంది. కాబట్టి వారు ఎలాగూ ఓడిపోయారు. ఇక బెంగాల్‌‌‌‌ విషయానికొస్తే.. 2021 ఎన్నికల్లో బీజేపీ 3 స్థానాల నుంచి77 సీట్లు సాధించుకోగలిగింది. ప్రశాంత్​కిశోర్​వ్యూహంతో ఎన్నికల్లో మమతా బెనర్జీ గెలిచిన మాట వాస్తవమే. కానీ ఇక్కడ బీజేపీ ఓడిపోలేదు. ఆయనెప్పుడూ పెద్ద సంఖ్యలో సిట్టింగ్​ఎమ్మెల్యేలను వదులుకోవాలని సలహా ఇస్తుంటారు. తద్వారా పాత పొలిటికల్​ సిస్టమ్​ అంతా పోతుందని ఆయన భావన. ఇప్పుడున్న సిట్టింగ్​ లీడర్ల నుంచి షాక్​ఎదుర్కోవాల్సి వస్తుందనే ఇప్పటి వరకు అటు కాంగ్రెస్, ఇటు కేసీఆర్​ ఇంకా ప్రశాంత్​ కిశోర్​ రోల్​ను నిర్ధారించనట్లు కన్పిస్తోంది. 

ఇప్పటికే హిందీయేతర రాష్ట్రాలకు ఎన్నికల వ్యూహకర్తగా ఉన్న ప్రశాంత్​కిశోర్ ఇటు టీఆర్ఎస్​తోపాటు కాంగ్రెస్​కు పనిచేస్తున్నట్లు వార్తలు వచ్చాయి.  గాంధీల ఆదేశాలను ఎలాగూ తెలంగాణ కాంగ్రెస్ నేతలెవరూ వ్యతిరేకించలేరు. కాబట్టి తెలంగాణలో టీఆర్ఎస్, కాంగ్రెస్​కూటమిగా ఏర్పడి ఎన్నికలకు వెళ్తే కొత్త రాజకీయ పరిణామాలు ఉంటాయి. యూపీ, బీహార్‌‌‌‌, బెంగాల్లో లాగా భవిష్యత్​లో తెలంగాణలో కాంగ్రెస్​ పరిస్థితి ప్రశ్నార్థకంగా మారుతుంది. ప్రస్తుత 90 మంది టీఆర్ఎస్​ ఎమ్మెల్యేల ఆశలు గల్లంతవుతాయి. 119 స్థానాల్లో పోటీ చేయాలనుకుంటున్న కాంగ్రెస్​లీడర్లకు నష్టం జరగొచ్చు. ప్రశాంత్​కిశోర్​ నేతృత్వంలో రాష్ట్రంలో ఏం జరగబోతుందో వేచి చూడాల్సిందే!
- పెంటపాటి పుల్లారావు, పొలిటికల్​ ఎనలిస్ట్