27 ఏళ్ల తర్వాత ఒకే సినిమాలో షారుఖ్, సల్మాన్

27 ఏళ్ల తర్వాత ఒకే సినిమాలో షారుఖ్, సల్మాన్

​బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్, కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఒకే మూవీలో కలిసి మళ్లీ నటించనున్నారా..? వీరిద్దరి కలయికలో ఓ భారీ యాక్షన్ చిత్రం రూపొందనుందా..? దాదాపు 27 ఏళ్ల తర్వాత ఈ అగ్ర హీరోలిద్దరూ ఒకే సినిమాల్లో అభిమానులను సర్ ప్రైజ్ చేయనున్నారా..? అంటే అవుననే సమాధానం బాలీవుడ్ నుంచి వినిపిస్తోంది.

షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్.. ఇద్దరు హీరోల కలయికలో ఓ భారీ యాక్షన్‌ చిత్రం చేయాలనేది యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ అధినేత ఆదిత్యచోప్రా ఆలోచనగా తెలుస్తోంది. ఆ దిశగా ఆయన కథనీ కూడా సిద్ధం చేశారనేది బాలీవుడ్‌ వర్గాల సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే 1995లో వచ్చిన ‘కరణ్‌ అర్జున్‌’ మూవీ తర్వాత షారూక్‌, సల్మాన్‌ కలిసి నటిస్తున్న మల్టీస్టారర్‌ సినిమా ఇదే అవుతుంది. సల్మాన్, షారుఖ్ కాంబినేషన్ లో రాబోయే పవర్ ఫుల్ యాక్షన్ మూవీని 2023లో షూటింగ్ ప్రారంభించి 2024లో విడుదల చేయనున్నారని తెలుస్తోంది. ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ మూవీ ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కించనున్నారని బాలీవుడ్ టాక్. సల్మాన్, షారుఖ్ లు కలిసి నటిస్తారనే విషయంపై సీనియర్ ఫిల్మ్ విశ్లేషకులు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు.

ఇద్దరు హీరోల కాంబినేషన్ లో రాబోయే మూవీ భారతీయ సీని ఇండస్ట్రీలోనే అతిపెద్ద సినిమాగా నిలవనుందంటున్నారు విశ్లేషకులు. ప్రస్తుతం ఈ సినిమా వివరాలను చాలా గోప్యంగా ఉంచారు. ‘ఎవరైనా బడా నిర్మాతలు ముందుకొస్తే సల్మాన్, అమీర్, నేను కలిసి ఒకే సినిమాల్లో నటిస్తాం. కానీ, నిర్మాతలకు ఖర్చు తడిసి మోపెడు అవుతుంది. మా ముగ్గురి వర్కింగ్ స్టైల్స్ కూడా పూర్తిగా వేరు’ అని షారుఖ్ గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు . 

షారుఖ్, సల్మాన్ కాంబినేషన్ లో ‘కరణ్ అర్జున్’ (1995) మూవీ  వచ్చిన సంగతి తెలిసిందే.ఈ సినిమాను హృతిక్ రోశన్ తండ్రి రాకేశ్ రోషన్ డైరెక్షన్ లో వచ్చింది. అంతేకాదు.. ఇదే సినిమాకు రాకేష్ సోదరుడు రాజేష్ రోషన్ మ్యూజిక్ అందించడం విశేషం. షారుఖ్ హీరోగా నటించిన ‘కుచ్ కుచ్ హోతా హై’, ‘జీరో’ సినిమాల్లో సల్మాన్ గెస్ట్ రోల్ చేశాడు. సల్మాన్ హీరోగా నటించిన  హర్ దిల్ జో ప్యార్ కరేగా సినిమాలో షారుఖ్ చిన్న గెస్ట్ రోల్ చేశాడు. కరణ్ అర్జున్ ఫిల్మ్ తర్వాత ఈ ఇద్దరూ కలిసి నటించిన సినిమా ఆ తర్వాత రాలేదు. మొత్తానికి మళ్లీ 27 ఏళ్ల తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో ఫిల్మ్ వస్తుందని తెలియడంతో ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా సల్మాన్, షారుఖ్ అభిమానులు ఎప్పుడెప్పుడాని ఎదురుచూస్తున్నారు.