
న్యూఢిల్లీ: ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో టీమిండియా పేసర్, హైదరాబాదీ మహ్మద్ సిరాజ్ ఆట గురించి ఎంత చెప్పినా.. పొగిడినా తక్కువే. ఇంగ్లండ్ గడ్డపై సంచలన బౌలింగ్ చేసిన సిరాజ్ మొత్తం 185.3 ఓవర్లు వేసి ఏకంగా 23 వికెట్లు తీశాడు. సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచి ఇండియా 2–2తో సిరీస్ డ్రా చేసుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. అహ్మదాబాద్‌లో వెస్టిండీస్‌తో తొలి టెస్టులోనూ సత్తా చాటిన సిరాజ్.. తన కెరీర్‌లో చిరస్మరణీయంగా నిలిచే ఇంగ్లండ్ సిరీస్‌ను గుర్తు చేసుకున్నాడు. ఆ టూర్‌లో తన ఆట, ముఖ్యంగా చివరి టెస్టు ఆఖరి రోజు చేసిన సంచలన బౌలింగ్ తన కోసం అంతా ‘ దేవుడు రాసిన స్క్రిప్ట్’ లా అనిపిస్తోందని అంటున్నాడు. ‘ఇంగ్లండ్ టూర్ అంతా నా కోసం రాసిపెట్టినట్టుంది.
లార్డ్స్ తొలి టెస్టులో బౌలింగ్ దక్కకపోవడం నుంచి ఓవల్ ఆఖరి టెస్టు వరకు, ప్రతీది ముందుగానే రాసి ఉంది. నేను హ్యారీ బ్రూక్ క్యాచ్ పట్టి బౌండరీ లైన్‌ను తాకడం కూడా ఇందులో భాగమే’ అని అన్నాడు. సిరీస్‌ను డ్రా చేసిన ఆఖరి రోజు ఉదయం ఏం జరిగిందో సిరాజ్ తెలిపాడు. ‘ఆఖరి రోజు ఉదయం నిద్ర లేవగానే ఈ మ్యాచ్ గంటలోపే ముగుస్తుంది, నేను గెలిపిస్తాను అని నాకు అనిపించింది. మ్యాచ్ 11 గంటలకు మొదలైతే, నేను ఉదయం 6 గంటలకే లేచాను. నా మనసులో అనుకున్నట్లే బంతులు వేయగలిగాను. ఇదంతా చూస్తుంటే దేవుడు నాతో.. వెళ్లు, హీరో అయిపో అన్నట్లు అనిపించింది’ అని సిరాజ్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.
ముందే టార్గెట్‌గా పెట్టుకున్నా
ఇంగ్లండ్‌లో అడుగుపెట్టే ముందే, అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలవాలని టార్గెట్‌గా పెట్టుకున్నట్లు సిరాజ్ చెప్పాడు. ‘నేను ఆ సిరీస్ మొత్తం మానసికంగా చాలా బలంగా ఉన్నాను. వంద శాతం ఫిట్‌గా ఉండాలని, ఐదు మ్యాచ్‌లూ ఆడాలని అనుకున్నాను’ అని తెలిపాడు. సీనియర్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా అన్ని మ్యాచ్‌లూ ఆడడని తెలిసినప్పుడు, రెండో సీనియర్ పేసర్‌గా తాను వంద శాతం ఇవ్వాలని అనుకున్నట్లు చెప్పాడు. సిరీస్‌లో పనిభారం ఎక్కువ కావడంతో చివరి టెస్టుకు విశ్రాంతి తీసుకోవాలని కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఇచ్చిన సలహాను సున్నితంగా తిరస్కరించినట్టు సిరాజ్ వెల్లడించాడు.
పోయి మీ నాన్నతో ఆటో నడుపుకో అంటారు
విమర్శలను పట్టించుకోకుండా తన ఆటపై మాత్రమే దృష్టి పెట్టడానికి కెరీర్ ఆరంభంలో లెజెండరీ కెప్టెన్ ధోనీ ఇచ్చిన సలహా తనకు ఎంతగానో ఉపయోగడుతోందని సిరాజ్ తెలిపాడు. ‘ఇండియాకు ఆడుతున్నప్పుడు బయట ఎవరి మాటలూ పట్టించుకోకు. నువ్వు బాగా ఆడినప్పుడు, ప్రపంచం మొత్తం నీతో ఉంటుంది. నువ్వు సరిగా ఆడనప్పుడు, అదే ప్రపంచం నిన్ను దూషిస్తుందని ధోనీ నాతో చెప్పాడు’ అని.. ఆ మాటలు నిజమయ్యాయని సిరాజ్ పేర్కొన్నాడు. తన తండ్రి ఆటో నడిపేవారని తెలియడంతో, బాగా ఆడనప్పుడు నెటిజన్లు తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు ‘నువ్వు బాగా ఆడినప్పుడు సిరాజ్ లాంటి బౌలర్ లేడు అంటారు. వెంటనే, ఒక్క మ్యాచ్‌లో విఫలమైతే, వెళ్లి నీ నాన్నతో పాటు ఆటో నడుపుకో అంటారు. ఒక మ్యాచ్‌లో హీరో, మరో మ్యాచ్‌లో జీరో. ప్రజలు ఇంత త్వరగా మారిపోతారా?. అందుకే, బయటి వ్యక్తుల అభిప్రాయాలు నాకు ముఖ్యం కాదని గట్టిగా నిర్ణయించుకున్నా’ అని సిరాజ్ స్పష్టం చేశాడు.