చదువులు ఆగం కావొద్దని ఆ నలుగురి ప్రయత్నం

చదువులు ఆగం కావొద్దని ఆ నలుగురి ప్రయత్నం

చదువులు ఆగం కావొద్దని

అవసరంలో ఉన్నవాళ్లకి సాయం చేయాలని అందరికీ ఉంటుంది. అయితే, బిజీగా ఉండడం వల్ల  టైమ్​ దొరకడం లేదంటారు చాలామంది. కానీ, వీళ్లు మాత్రం ఒకపక్క తమ ఉద్యోగాలు, పనులు చేసుకుంటూనే, మరోపక్క ఊరి ప్రజలకు చేతనైన సాయం చేస్తున్నారు. అందుకోసం వీళ్లు సొంత డబ్బు ఖర్చుపెడుతున్నారు. వీళ్లలో ఒకరు టీచర్​గా మారిన సర్పంచ్. ​మరొకరు పిల్లల్ని బైక్​ మీద  స్కూల్​కి తీసుకొస్తున్న టీచర్. ఇంకొకరు పేదవాళ్లకు సాయం చేస్తున్న పంచాయతీ కార్యదర్శి. మరొకరేమో ఊర్లోని ఆడపిల్లల పెండ్లికి ఐదువేల రూపాయలు ఇస్తున్న సర్పంచ్. బెల్లంపల్లికి చెందిన ఈ నలుగురి సోషల్​ సర్వీస్​ గురించి...  

తనలా కష్టపడొద్దని
పేదరికం కారణంగా చదువు కోవడానికి ఎన్నో  కష్టాలు పడ్డాడు ఈయన.  తనలెక్క పేదపిల్లలు కష్టపడొద్దని వాళ్లకి చదువుకునేందుకు చేతనైన సాయం చేస్తున్నాడు. ఇతని పేరు  జనగామ అభిలాష్. కన్నెపల్లి పంచాయతీ సెక్రెటరీ  గా పనిచేస్తుతున్నాడు.  నలుగురు ఫ్రెండ్స్​తో కలిసి ‘సుప్రజ’ పీపుల్ ఫర్ ఫీపుల్ అనే సంస్థ మొదలుపెట్టాడు.  డ్యూటీ చేస్తూనే,  గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకు బుక్స్, నిరుద్యోగులకు స్టడీ మెటీరియల్ ఫ్రీగా ఇస్తున్నాడు. అంతేకాదు లాక్​డౌన్​ టైమ్​లో ఫ్రెండ్స్​తో కలిసి వృద్ధులు, అనాథల తిండీ తిప్పలు చూశాడు. అవసరంలో ఉన్నవాళ్లకు సాయం చేసేందుకు నెలనెలా అభిలాష్, అతని ఫ్రెండ్స్​ తమ జీతంలోంచి కొంత ఖర్చుచేస్తున్నారు.  మధ్యలోనే చదువు ఆపేయకూడదని, చదువుకోకుంటే చిన్నచిన్న పనులు చేయాల్సి వస్తుందని పిల్లలకు చెప్తాడు . అందుకోసం వాళ్లకి కావాల్సిన బుక్స్​, మెటీరియల్స్​ కొనిస్తున్నాడు.   స్వచ్ఛంద సంస్థ ద్వారా పదిమందికి తోచిన సాయం చేస్తున్నాడు .  డ్యూటీలో బిజీగా ఉన్నా కూడా పేదవాళ్లకు సాయం చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది అంటాడు అభిలాష్​.  

 పిల్లల్ని బైక్​ మీద తీసుకొస్తడు
ఈయన పేరు జలంపల్లి శ్రీనివాస్. మండలంలోని నార్వాయిపేట స్కూల్లో సైన్స్​ టీచర్. పిల్లలకు అర్థమయ్యేలా క్లాసులు చెప్తాడు. అదొక్కటే కాదు వాళ్లని స్కూల్​కి కూడా తీసుకొస్తాడు. స్కూల్​ దూరంగా ఉండడంతో నడిచి వచ్చే పిల్లలు కొన్ని క్లాస్​లు మిస్​ అయ్యేవాళ్లు. చదువులో వెనకబడేవాళ్లు. దాంతో, శ్రీనివాస్ ఆ పిల్లల ఇంటికి వెళ్లి, తన బైక్​ మీద ఎక్కించుకొని స్కూల్​కి తీసుకు రావడం మొదలుపెట్టాడు. సాయంత్రం బడి గంట మోగగానే వాళ్లను మళ్లీ ఇంటి దగ్గర దిగబెడతాడు కూడా. దీంతో ఆ పిల్లలు ఉత్సాహంగా బడికి వెళ్తున్నారు. ఇదేకాకుండా... కరోనా టైమ్​లో 250 మందితో కొవిడ్ వాలంటీర్స్​ టీమ్​ ఏర్పాటు చేసి పేదవాళ్లు, వృద్ధు లకు నిత్యావసరాలు, డబ్బు సాయం చేశాడు.   

సర్పంచే టీచరమ్మ
సర్పంచ్​అంటే గ్రామపంచాయతీ పనులు చూడడం ఒక్కటే కాదు. ఊర్లోని బడి బాగోగులు, పిల్లల చదువుల్ని పట్టించుకోవడం కూడా అని నిరూపిస్తోంది ఇందూరి శశికళ. నెన్నెల మండలంలోని గొల్లపల్లి గ్రామ సర్పంచ్ ఈమె. ఎంఎస్సీ, బి.ఎడ్. కోర్సు చేసిన ఈమెను   సర్పంచ్​గా గెలిపించారు ఊరివాళ్లు. వీళ్ల ఊర్లోని ప్రైమరీ స్కూల్లో 90 మంది పిల్లలు ఉన్నారు. ఈమధ్యే ఇద్దరు టీచర్లు డిప్యుటేషన్​ మీద వెళ్లారు. వాళ్ల ప్లేస్​లో కొత్త టీచర్లు రాలేదు.  టీచర్లు సరిపోను లేకపోవడంతో అరకొరగా క్లాస్​లు జరిగేవి. దాంతో పిల్లల చదువులు ఆగం అవుతాయని అనిపించింది శశికళకు.  అలా జరగకుండా తనే పిల్లలకు పాఠాలు చెప్పాలని  అనుకుంది.  బి.ఎడ్​ చేసిన ఎక్స్​పీరియెన్స్​తో పిల్లలకు ఇంగ్లీష్​, మ్యాథ్స్​ క్లాసులు చెప్పడం మొదలుపెట్టింది. గ్రామసభ, ఇతర మీటింగ్స్​ లేని రోజుల్లో స్కూల్​కి వెళ్లి  క్లాసులు​ చెప్తోంది.   అంతేకాదు  పిల్లలకి మధ్యాహ్న భోజనం ఆమే దగ్గర ఉండి మరీ వడ్డిస్తుంది కూడా. ఆమె సేవాగుణాన్ని ఊరి ప్రజలే కాకుండా  జిల్లా కలెక్టర్ భారతిహోళికేరి సైతం మెచ్చుకున్నారు. శశికళకి ‘ఉత్తమ మహిళా సర్పంచ్’ అవార్డ్​ కూడా వచ్చింది.  

ఆడపిల్ల పెండ్లికి 5 వేలు
ఊర్లో ఎవరి ఇంట్లో పెండ్లి అయినా, శుభకార్యం అయినా సర్పంచ్​లని పిలుస్తారు. వాళ్లు గెస్ట్​గా వచ్చి అక్షింతలు వేసి వెళ్తారు. కానీ, కాసిపేట మండలంలోని పెద్దనపల్లి గ్రామ సర్పంచ్ వేముల కృష్ణ అలాకాదు. ఊర్లో ఏ ఇంట్లో పెండ్లి అయినా, ఏ శుభకార్యానికి పిలిచినా ఊరి పెద్దగా వెళ్లడమే కాకుండా తన వంతు సాయం కూడా చేస్తాడు. ఆడపిల్ల పెండ్లికి ఐదు వేల రూపాయలు ఇవ్వడంతో పాటు వాళ్ల ఇంటికి వెళ్లి చీర, సారెని ఇస్తాడు. కులం, మతం అనే తేడా లేకుండా అందరికి పెండ్లిండ్లకి సాయం చేస్తాడు. అంతేకాదు సొంత డబ్బుతో ఆడవాళ్లకి కుట్టుమెషిన్​ ట్రైనింగ్​ ఇప్పించడమే కాదు వాళ్లకు కుట్టు మెషిన్లు ఇస్తున్నాడు.    ఊర్లోవాళ్లు ఆయన్ను వాళ్ల ఇంట్లో మనిషిగా అనుకుంటారు. అందుకే ఊర్లో  ఏ ఇంట్ల ఆడపిల్ల పెండ్లి జరిగినా తోబుట్టువులా తన వంతు సాయం చేస్తుంటాడు. 2019లో సర్పంచ్​గా గెలిచినప్పటి నుంచి  ఊర్లోని వాళ్లకి  పెండ్లి  సాయం చేస్తున్నాడు.   ఊరి పెద్దగా పెండ్లికి సాయ పడటం చాలా సంతృప్తినిస్తోంది అంటాడు కృష్ణ.