మోడీ ఆలోచనతోనే జాతీయ పతాకానికి స్వేచ్ఛ వచ్చింది

మోడీ ఆలోచనతోనే జాతీయ పతాకానికి స్వేచ్ఛ వచ్చింది

కలలు కనాలి... ఆ కలలను సాకారం చేసుకునే విధంగా శ్రమించాలని విద్యార్థులకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సూచించారు. జనగామ జిల్లా దేవరుప్పలలోని ఓ పాఠశాలలో జాతీయ జెండాను ఆవిష్కరించిన బండి సంజయ్... -పాఠశాలలో జెండా వందనం కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. విద్యార్థుల్లో దేశభక్తిని చూస్తే చాలా ఆనందం కలుగుతోందన్న ఆయన.. ఒక్క స్వాతంత్ర్య దినోత్సవం రోజు మాత్రమే కాదు... నిరంతరం దేశం కోసం తపించాలని పిలుపునిచ్చారు. గత పాలకుల హయాంలో జాతీయ జెండాకు కొన్ని నిబంధనలు పెట్టారు... ఫలానా టైం పీరియడ్ లో మాత్రమే జెండాను ఎగురవేయాలని...  ఖద్దరు బట్టలు కట్టుకున్న వారు మాత్రమే ఎగురవేయాలని... ఆ నిబంధనలను కేంద్రం  సడలించిందని చెప్పారు. జాతీయ పతాకం యొక్క గొప్పతనం ఇప్పుడు  ప్రపంచ దేశాలకు తెలిసిందని... అందరి ఇళ్లపైనా జాతీయ జెండాను చూస్తున్నామని చెప్పారు. భారతీయ, సంస్కృతి సంప్రదాయాలను ఇప్పుడు అందరూ చూస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు.

ఉక్రెయిన్ యుద్ధంలోనూ కాపాడింది మన జాతీయపతాకమేనని బండి సంజయ్ అన్నారు. దేశభక్తి అన్నది ఎల్లప్పుడూ ఉండాలి..  కానీ ఒక్క రోజుకే పరిమితం కాకూడదని చెప్పారు. మనమంతా దేశం పట్ల, సమాజం పట్ల బాధ్యతగా ఉండాలన్న బండి సంజయ్... జన్మనిచ్చిన తల్లిదండ్రులను, చదువు నేర్పిన ఉపాధ్యాయులను ఎప్పటికీ గౌరవిస్తూనే ఉండాలని తెలిపారు. కొడుకులు, కోడళ్ళు ఉన్నప్పటికీ ... తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో వేస్తున్న పరిస్థితులు ఉన్నాయని, ఈ పరిస్థితులు పోవాలన్నారు. దేశం కోసం త్యాగం చేసిన అమరవీరులను గుర్తుంచుకోవాలన్న ఆయన... మన సంస్కృతిని, సంప్రదాయాలను, సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలని సూచించారు. 

ఎవరికి అనుకూలంగా వారు దేశ చరిత్రను చెప్పే ప్రయత్నం చేశారని, నిజమైన దేశ చరిత్రను భవిష్యత్తు తరాలకు అందించాలని బండి సంజయ్ కోరారు. నిజమైన దేశ చరిత్రను అందించేందుకు మోడీ అనేక కార్యక్రమాలను చేపట్టారని గుర్తు చేశారు. మోడీ ఆలోచనతోనే జాతీయ పతాకానికి స్వేచ్ఛ వచ్చిందన్న ఆయన... భారతీయ గొప్పతనాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన ఘనత మోడీదేనని కొనియాడారు. మనకి మనం దేశం కోసం ఏం చేస్తున్నామో ఆలోచించుకోవాలని, మనం ఎందుకు సర్దార్ వల్లభాయ్ పటేల్, భగత్ సింగ్, మహాత్మాగాంధీ, అంబేద్కర్ లం కాకూడదని ఆలోచించాలన్నారు. ప్రతి ఒక్కరు ధర్మం కోసం పనిచేయాలని,
అందరూ నిజాయితీగా ఉండాలని కోరుకుంటున్నానని బండి సంజయ్ చెప్పారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' కార్యక్రమంలో భాగంగా "హర్ ఘర్ తిరంగా" కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు బండి సంజయ్ తెలంగాణ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.