తిమ్మాపూర్(మానకొండూర్), వెలుగు: వరి కోస్తుండగా హార్వెస్టర్‌కు కరెంట్ వైర్లు తగిలి షార్ట్ సర్క్యూట్ అయి పొలం కాలిపోయిన ఘటన కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం రంగపేట, లలితాపూర్ గ్రామాల శివారులో గురువారం జరిగింది. గ్రామస్తుల వివరాల ప్రకారం... రంగపేట గ్రామానికి చెందిన రైతు మారం కనుకయ్య గురువారం వరికోత మిషన్‌తో పొలం కోయిస్తున్నాడు. పొలం మీదుగా ఉన్న కరెంట్ తీగలను గమనించని డ్రైవర్ వైర్ల కింది నుంచి వెళ్లగా అవి తెగిపడి మిషన్‌కు అంటుకున్నాయి.
వెంటనే డ్రైవర్ కిందికి దూకాడు. నిప్పురవ్వలు ఎగసిపడడంతో సుమారు ఎకరం వరి పైరు కాలిపోయింది. ఈ ప్రమాదంలో మిషన్ టైరు కూడా దగ్ధమైంది. అక్కడే ఉన్న రైతు కనుకయ్య చెట్ల కొమ్మలు విరిచి మంటలార్పే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో పొగను పీల్చుకొని అస్వస్థతకు గురయ్యాడు. స్థానికులు అతడిని ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లారు. కరెంట్ వైర్లు పొలంలో కిందికి ఉన్నాయనీ, సరిచేయాలని విద్యుత్ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదని రైతులు ఆరోపిస్తున్నారు.
