- టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ, కరెంట్ ఉత్పత్తిలో.. దక్షిణాదిలో నంబర్ వన్ ప్రాజెక్ట్‌గా రామగుండం
- ప్రస్తుతం ప్లాంట్‌లో థర్మల్, ఫ్లోటింగ్ సోలార్ విద్యుత్ ఉత్పత్తి
- నేడు 48వ వసంతంలోకి ప్రాజెక్ట్
జ్యోతినగర్, వెలుగు: రామగుండంలో ఏర్పాటు చేసిన ఎన్టీపీసీ విద్యుత్ ప్లాంట్ 47 ఏండ్లు పూర్తిచేసుకుంది. ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ కరెంట్ ఉత్పత్తిలో రామగుండం ఎన్టీపీసీ సౌతిండియాలో నంబర్ 1 ప్రాజెక్ట్‌గా నిలిచింది. తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాల విద్యుత్ అవసరాలను తీరుస్తూ శుక్రవారం నాటికి 48వ వసంతంలోకి అడుగు పెడుతున్నది. 1978 నవంబర్ 14న నాటి ప్రధాని మోరార్జీ దేశాయ్ రామగుండం ఎన్టీపీసీ ప్లాంట్‌కు శంకుస్థాపన చేశారు.
200 మెగావాట్లతో మొదలైన ప్లాంట్ నేడు 7 యూనిట్లతో 4,200 మెగావాట్ల థర్మల్ విద్యుత్‌ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది. దీంతోపాటు 100 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్, 10 మెగావాట్ల సోలార్ విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తూ దేశ ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలుస్తోంది. తెలంగాణ, ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, గోవా, తమిళనాడు రాష్ట్రాలకు విద్యుత్ సరఫరా చేస్తూ ముందుకు సాగుతున్నది.
టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ ముందుకు..
రామగుండం ప్లాంట్‌లో ఎన్టీపీసీతో పాటు తెలంగాణ యూనిట్‌ను ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్ట్‌ల్లో క్వాలిటీ కరెంట్ ఉత్పత్తితోపాటు ఇతర సమస్యలు రాకుండా ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీని అమల్లోకి తీసుకువచ్చారు. దీంతోపాటు టెక్నాలజీ సాయంతో పర్యావరణ పరిరక్షణకు మేనేజ్‌మెంట్ చర్యలు చేపట్టింది. ఫ్లూ గ్యాస్ డీసల్ఫరైజేషన్ (ఎఫ్జీడీ), నైట్రోజన్ ఆక్సైడ్ కంట్రోల్ సిస్టమ్, ఫ్లూయెంట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ అప్‌గ్రేడేషన్ వంటి టెక్నాలజీని వినియోగిస్తోంది.
దీంతోపాటు ఎన్టీపీసీ రామగుండం ప్రాజెక్ట్ పరిసర ప్రాంతాలో లక్షకు పైగా మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతున్నది. మియావాకీ విధానం (చిట్టడవి) ద్వారా ఒకే చోట 53 రకాల మొక్కలను నాటి పరిరక్షిస్తున్నారు. నీటిని రీ సైక్లింగ్ చేస్తూ హార్టికల్చర్‌కు ఉపయోగిస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తి కోసం బొగ్గును మండిండం ద్వారా వచ్చిన బూడిదను 100 శాతం వినియోగిస్తున్నారు. దీని సాయంతో జియో పాలిమర్రోడ్డును నిర్మించారు. సిమెంట్ఇటుకల తయారీలో బూడిదను వినియోగిస్తున్నారు. జాతీయ రహదారుల నిర్మాణానికి కూడా ఎన్టీపీసీ బూడిదను
వాడుతున్నారు.
సామాజిక సేవలో ముందంజ...
కరెంట్ ఉత్పత్తితోపాటు ప్రాజెక్ట్ ప్రాభావిత గ్రామాల్లోని ప్రజలకు, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన.. సీఎస్సార్ కింద పలు అభివృద్ధి పనులు మేనేజ్‌మెంట్ చేపడుతోంది. దీనిలో భాగంగా గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీ, శానిటేషన్, ఆరోగ్యం, విద్య, తాగునీటి కల్పనకు కృషి చేస్తోంది. మహిళలు ఆర్థికంగా నిలుదొక్కుకునేందుకు స్వయం ఉపాధి రంగాల్లో శిక్షణ ఇస్తోంది. రైతులకు కావలసిన విత్తనాలు, నిపుణులతో సలహాలు ఇప్పిస్తున్నది. స్కూళ్లలో టెన్త్ చదివే విద్యార్థులకు సైకిళ్లు, స్కాలర్ షిప్‌లు, స్టడీ
మెటీరియల్ అందిస్తుంది.
ఉద్యోగుల కృషితోనే విజయం
ఎన్టీపీసీ రామగుండం ప్రాజెక్ట్ విజయానికి మూలం ఉద్యోగుల నిబద్ధత, క్రమశిక్షణ. రాబోయే రోజుల్లో గ్రీన్ ఎనర్జీ, డిజిటల్ సిస్టమ్స్, స్మార్ట్ గ్రిడ్‌లపై మరిన్ని ప్రాజెక్టులు ప్రారంభించనున్నాం. దేశానికి స్థిరమైన విద్యుత్ సరఫరా, పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉన్నాం. చందన్‌కుమార్ సమంత, ఎన్టీపీసీ ఈడీ
