IND vs PAK: పాకిస్థాన్‌తో టెస్ట్ సిరీస్.. ఆడటానికి సిద్ధమన్న రోహిత్ శర్మ

IND vs PAK: పాకిస్థాన్‌తో టెస్ట్ సిరీస్.. ఆడటానికి సిద్ధమన్న రోహిత్ శర్మ

2008 ముంబై ఉగ్రదాడుల అనంతరం భారత్- పాకిస్తాన్ మ‌ధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదు. కేవ‌లం ఐసీసీ ఈవెంట్లలో మాత్రమే ఈ ఇరు జ‌ట్లు తలపడుతున్నాయి. పాక్ ప్రభుత్వం ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలిస్తూనే క్రికెటైనా, మరొకటైనా అని భారత ప్రభుత్వం చెప్తుండగా.. దాయాది దేశం ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. ఈ నేపథ్యంలో ఇరు దేశాల ద్వైపాక్షిక క్రికెట్ ఉనికిపై భారత కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. 

పాకిస్థాన్‌తో తటస్థ వేదికపై టెస్ట్​ క్రికెట్ ఆడటానికి తనకు ఎటువంటి అభ్యంతరం లేదని రోహిత్ శర్మ తెలిపాడు.  పాకిస్తాన్ క్రికెట్ జట్టు  బలమైనదని అంగీకరించిన హిట్‌మ్యాన్.. పాక్ బౌలింగ్ లైన‌ప్ అద్భుతమని కొనియాడాడు. వారితో టెస్టు క్రికెట్ ఆడితే చాలా ఇంట్రెస్టింగ్​గా ఉంటుంద‌ని వెల్లడించాడు. 'క్లబ్ ప్రైరీ ఫైర్'  అనే పోడ్‌కాస్ట్‌లో రోహిత్ ఈ వ్యాఖ్యలు చేశాడు.

"భారత్- పాక్ మధ్య అప్పడప్పుడు టెస్ట్ క్రికెట్ ఆడుతుంటే బాగుంటుందని మీరు అనుకోవడం లేదా?" అని మైఖేల్ వాన్ రోహిత్‌ని ప్రశ్నించాడు. అందుకు హిట్‌మ్యాన్.. "నేను పూర్తిగా నమ్ముతున్నా! వారిది మంచి టీమ్‌.. అద్భుతమైన బౌలింగ్ లైనప్‌. ఓవర్సీస్ కండిషన్‌లో ఆడితే మంచి పోటీ ఉంటుందని అనుకుంటున్నా. భారత్-పాకిస్తాన్ మధ్య 2006 లేదా 2007లో చివరి టెస్ట్ జరిగొండోచ్చు. కోల్‌కతాలో వసీం జాఫర్ డబుల్ సెంచరీ సాధించాడని అనుకుంటున్నా.."

చివరిసారిగా 2007లో బెంగళూరులో భారత్‌-పాకిస్థాన్‌లు టెస్టు మ్యాచ్‌ ఆడాయి. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 1-0తో కైవసం చేసుకుంది. ఇది రెండు పక్షాల మధ్య మంచి పోటీ ఉంటుందని నేను భావిస్తున్నా. ఐసీసీ టోర్నీల్లో మేం ఎలాగైనా వారితో ఆడతాం. కాబట్టి, అది పట్టింపు లేదు. స్వచ్ఛమైన క్రికెట్‌లో బ్యాట్, బాల్ మధ్య యుద్ధం. ఇది గొప్ప పోటీ కాబట్టి ఎందుకు కాదు.." అని రోహిత్ జవాబిచ్చాడు.

జూన్ 9న ఇండియా- పాక్ మ్యాచ్

టీ20 ప్రపంచ కప్‌ 2024లో భాగంగా జూన్ 9న న్యూయార్క్‌ వేదికగా భారత్ vs పాకిస్థాన్ మ్యాచ్ జరగనుంది.