మరో నాలుగు రోజులపాటు వర్షాలు

మరో నాలుగు రోజులపాటు వర్షాలు
  • సిద్దిపేట జిల్లాలో 11.2 సెంటీమీటర్ల వర్షం

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రానున్న 4 రోజులపాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడొచ్చని హైదరాబాద్‌‌ వాతావరణ కేంద్రం తెలిపింది. రెండు మూడు రోజులుగా రాష్ట్రంలో వానలు దంచికొట్టాయి. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు హైదరాబాద్‌‌తోపాటు పలు జిల్లాలను అతలాకుతలం చేశాయి. సోమవారం అర్ధరాత్రి నుంచి బుధవారం వరకు ఒక్కసారిగా వానలు బీభత్సం సృష్టించాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లన్నీ చెరువులను తలపించాయి. పలు జిల్లాల్లో రోడ్లు ధ్వంసమయ్యాయి. చెట్లు నేలకొరిగాయి. కరెంట్‌‌ స్తంభాలు విరిగిపడ్డాయి. టీఎస్డీపీఎస్‌‌ డేటా ప్రకారం సిద్దిపేటలోని హబ్సీపూర్‌‌లో 11.2 సెంటీమీటర్లు, పోతారెడ్డిపేట్‌‌లో 7.2, నల్గొండలోని పజ్జూర్‌‌లో 9.8, కామారెడ్డిగూడెంలో 9.4, నెమ్మానిలో 8.8, హైదరాబాద్‌‌లోని సీతాఫల్‌‌మండిలో 8.7, యాదగిరిగుట్టలో 8.3, ఆసిఫాబాద్‌‌లోని బెజ్జూరు, ముషీరాబాద్‌‌లో 7.7, అల్వాల్‌‌లో 6.6, మంచిర్యాలలోని తాండూరులో 6.5, మెదక్‌‌లోని ఇస్లాంపూర్‌‌, జగిత్యాలలోని సారంగపూర్‌‌లో 6.4 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డయ్యింది. 

భారీగా తగ్గిన ఎండలు..

వానలతో రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. 4 డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి. ఆదిలాబాద్‌‌లోని భోరజ్‌‌లో 41.8, నిజామాబాద్‌‌లోని రంజల్‌‌లో 41.5, వనపర్తిలోని పెబ్బేరులో 41.2, మహబూబ్‌‌నగర్‌‌లోని వడ్డేమాన్‌‌లో 41, నాగర్‌‌కర్నూల్‌‌లోని కొల్లాపూర్‌‌లో 40.4, నారాయణపేటలోని మరికల్‌‌, కామారెడ్డిలోని కొల్లూరులో 40, నిర్మల్‌‌లోని వడ్యాల్‌‌లో 39.9, జోగులాంబ గద్వాలలోని అలంపూర్‌‌లో 39.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గురు, శుక్రవారాల్లో ఉష్ణోగ్రతలు పెరగొచ్చని హైదరాబాద్‌‌ వాతావరణ కేంద్రం తెలిపింది.