
- బీజేపీ విధానం ముందస్తు కాదు.. జమిలి ఎన్నికలే
- కేసీఆర్ తీరు వల్ల రాష్ట్రం పరువుపోతున్నది
- పంజాబ్ రైతులకు చెల్లని చెక్కులు ఇచ్చిండు
- బీఆర్‌ఎస్ పేరిట కొత్త నాటకానికి తెరలేపిండు
- మిగులు రాష్ట్రాన్ని జీతాలియ్యలేని స్థితికి తెచ్చిండు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో అసెంబ్లీని రద్దు చేయడం మాత్రమే సీఎం కేసీఆర్ చేతుల్లో ఉందని, ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనేది ఈసీ నిర్ణయిస్తుందని బీజేపీ నేత, ఎంపీ లక్ష్మణ్ అన్నారు. అసెంబ్లీని కేసీఆర్ రద్దు చేసి కర్నాటకతో పాటే ఎన్నికలకు వెళ్తారన్న ప్రచారంపై లక్ష్మణ్ స్పందించారు. ‘‘కేసీఆర్ చెప్పినప్పుడే ఎన్నికలు జరపడానికి ఈసీ ఆయన జేబు సంస్థ కాదు” అని పేర్కొన్నారు. ముందస్తు ఎన్నికలు తేవడం బీజేపీ విధానం కాదని, జమిలీ ఎన్నికలే తమ విధానం అని చెప్పారు. ఆదివారం బీజేపీ స్టేట్ ఆఫీసులో లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ తీరు వల్ల జాతీయస్థాయిలో రాష్ట్రం పరువు పోతున్నదని, పంజాబ్ రైతుల కుటుంబాలకు చెల్లని చెక్కులను ఇచ్చి తెలంగాణ విలువను తగ్గించారని మండిపడ్డారు. ‘‘అక్రమ సంపాదన నిలుపుకోవడానికే బీఆర్ఎస్ పార్టీ పెట్టారు. కేంద్రం ఇచ్చే నిధులకు లెక్కా పత్రం లేకుండా, యుటిలైజేషన్ సర్టిఫికెట్లు ఇవ్వకుండా కేసీఆర్ తొండి ఆటలు ఆడుతున్నారు. 100 శాతం రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే మెట్రో అనటం అవాస్తవం. మజ్లిస్ కోసమే 16 కిలోమీటర్ల మెట్రో లైన్‌ను, 32 కిలోమీటర్ల దూరం పెరిగేలా చేశారు” అని ఆయన దుయ్యబట్టారు.
రాష్ట్ర ప్రయోజనాలకు దెబ్బ
‘‘ప్రధాని మోడీని విమర్శించి, ఇప్పుడు ఆయనకు ముఖం చూపించలేక ముఖ్యమైన కార్యక్రమాలకు కూడా కేసీఆర్ హాజరైతలేరు. ఇతర రాష్ట్రాల ముఖ్య మంత్రులు ప్రధానిని విమర్శించినా, సందర్భం వచ్చినప్పుడు ప్రధానిని కలిసి వాళ్ల రాష్ట్రాలకు రావాల్సిన నిధులు, ఇతర అవసరాల గురించి అడుగుతున్నారు. కానీ, కేసీఆర్ తీరువల్ల రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయి” అని లక్ష్మణ్ అన్నారు. రాజకీయ విమర్శలు చేసుకున్నా, ఎవరికి ఇవ్వాల్సిన గౌరవం వాళ్లకు ఇవ్వాలని సూచించారు. గతంలో సారు.. కారు.. కేంద్రంలో సర్కార్.. అని ఊదరగొట్టారని, ఇప్పుడు బీఆర్‌ఎస్ పేరిట మరో నాటకానికి తెరలేపారని విమర్శించారు. ‘‘కేసీఆర్‌ది పరివార్ సర్కార్, బార్ సర్కార్, బక్వాష్ సర్కార్, షరాబ్ సర్కార్” అని లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్ పేరిట దేశం మొత్తం మద్యం అమ్మడమే లక్ష్యంగా పెట్టుకున్నారని విమర్శించారు.
పైసలు ఎటుపోతున్నయ్?
రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి అప్పు చేసి పప్పు కూడు అన్నట్టు తయారైందని లక్ష్మణ్ పేర్కొన్నారు. తెలంగాణలో రోజువారీ ఖర్చులకు కూడా కేంద్రం ఇచ్చిన నిధులనే వాడుకుంటున్నారని, తిరిగి కేంద్రాన్నే బద్నాం చేస్తున్నారని అన్నారు. మిగులు నిధులు ఉన్న రాష్ట్రాన్ని, ఉద్యోగుల జీతాలు ఇయ్యలేని స్థితికి కేసీఆర్ తీసుకొచ్చారని, చివరికి డబ్బుల కోసం కరెంట్ చార్జీల పేరిట ప్రజలపై రూ.20 వేల కోట్ల భారం మోపేందుకు సిద్ధమయ్యారని మండిపడ్డారు. అప్పులతో, భూములు అమ్మితే వచ్చిన డబ్బు, కేంద్రం ఇస్తున్న డబ్బు, ప్రజలు కడుతున్న ట్యాక్స్ డబ్బులన్నీ ఎటు పోతున్నాయో రాష్ట్ర సర్కారు చెప్పాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు.