ప్యాకెట్​లో ఒక్క బిస్కెట్​కు తగ్గినందుకు..ఐటీసీకి రూ.లక్ష పెనాల్టీ!

ప్యాకెట్​లో ఒక్క బిస్కెట్​కు తగ్గినందుకు..ఐటీసీకి రూ.లక్ష పెనాల్టీ!

చెన్నై: ఒక కన్జూమర్​కు రూ. లక్ష కాంపెన్సేషన్​ చెల్లించాల్సిందిగా ఐటీసీ లిమిటెడ్​ను కన్జూమర్​ కోర్టు ఆదేశించింది. చెన్నైకి చెందిన పి డిల్లీబాబు అనే కన్జూమర్​ ఐటీసీ లిమిటెడ్​పై ఈ కేసు వేశారు. కన్జూమర్లను రోజుకు రూ. 30 లక్షల చొప్పున కంపెనీ మోసం చేస్తోందని డిల్లీబాబు తన పిటిషన్​లో ఆరోపించారు. ఈ కేసు వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. కేసుకు సంబంధించిన సంఘటన 2021 డిసెంబర్​లో చోటు చేసుకుంది. మనాలి విజిట్​ చేస్తున్న డిల్లీబాబు అక్కడి ఒక రిటెయిల్​ స్టోర్​లో రెండు డజన్ల  సన్​ఫీస్ట్​ మేరీ లైట్​బిస్కట్లను కొన్నారు. ఆ ప్యాకెట్లపై ముద్రించినది 16 బిస్కట్లయితే,  ఓపెన్​ చేసి చూస్తే ప్యాకెట్లో ఉన్నవి మాత్రం ఒకటి తక్కువ. ముందుగా ఆయన ఆ రిటెయిల్​ స్టోర్​ను, ఆ తర్వాత ఐటీసీ కంపెనీని వివరణ కోసం ఆశ్రయించారు.

కానీ, ఎలాంటి ప్రయోజనం కలగలేదు. దీంతో కన్జూమర్​ కోర్టులో కేసు వేశారు. ఒక్కో బిస్కట్​ ఖరీదు 75 పైసలని, రోజుకి ఐటీసీ లిమిటెడ్​ 50 లక్షల బిస్కట్​ ప్యాకెట్లను తయారు చేస్తోందని తన పిటిషనల్​లో డిల్లీబాబు పేర్కొన్నారు. దీనిని బట్టి లెక్కిస్తే ఐటీసీ కంపెనీ తన కన్జూమర్లను  రోజుకి రూ. 29 లక్షల మేర మోసగిస్తోందని ఆరోపించారు. అయితే, ఈ కేసులో తన వాదన వినిపించిన ఐటీసీ, ఆ ప్యాకెట్లను బరువు ప్రాతిపదికనే విక్రయిస్తున్నామని, బిస్కెట్ల సంఖ్యను బట్టి కాదని తెలిపింది.

ఈ కేసులో ఉదహరించిన బిస్కట్​ ప్యాకెట్​ బరువు 76 గ్రాములని కంపెనీ పేర్కొంది.  కన్జూమర్​ కోర్టు  ఆ బిస్కెట్​ ప్యాకెట్ల బరువు 74 గ్రాములే ఉన్నట్లు కనుగొంది. రూల్స్​ ప్రకారం 4.5 గ్రాముల దాకా వ్యత్యాసం ఉన్నా పర్వాలేదని ప్రస్తావించింది. కానీ, ఈ వాదనను న్యాయమూర్తి అంగీకరించలేదు. ఆగస్టు 29 న ఈ కేసులో జడ్జి తన తీర్పు ఇచ్చారు. అమ్మకాలలో  ఇలాంటి తప్పుడు పద్ధతులను పాటించొద్దని  , కన్జూమర్​కు రూ. లక్ష పరిహారం చెల్లించాలని ఆదేశించారు.