పుట్టింటికి డబ్బులు పంపిస్తుందని..సుపారీ ఇచ్చి భార్య హత్య..ఐడీఏ బొల్లారంలో హత్య కేసును ఛేదించిన పోలీసులు

పుట్టింటికి డబ్బులు పంపిస్తుందని..సుపారీ ఇచ్చి భార్య హత్య..ఐడీఏ బొల్లారంలో హత్య కేసును ఛేదించిన పోలీసులు
  • దుండగుల పనిగా చిత్రీకరించేందుకు యత్నం

గచ్చిబౌలి, వెలుగు: భార్య తన పుట్టింటికి డబ్బులు పంపిస్తోందనే కోపంతో భర్త సుపారీ గ్యాంగ్‌తో భార్యను హత్య చేయించాడు. సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో భర్తతో పాటు ఓ సుపారీ గ్యాంగ్ సభ్యుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు నిందితుల కోసం గాలింపు కొనసాగుతోంది. 

శేరిలింగంపల్లి డీసీపీ శ్రీనివాస్, ఎస్‌వోటీ డీసీపీ శోభన్‌బాబు తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్‌కు చెందిన అనిల్‌కుమార్‌, మీనాదేవి(35) దంపతులు ఐడీఏ బొల్లారంలోని వేంకటేశ్వర కాలనీలో నివాసం ఉంటున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు. అనిల్‌కుమార్‌ లేబర్‌ కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నాడు. మూడేళ్లుగా తన సంపాదనను భార్య పుట్టింటికి పంపిస్తోందని, తాను ప్రమాదంలో గాయపడిన సమయంలో పట్టించుకోలేదని భావించిన అనిల్‌ భార్యపై కక్ష పెంచుకున్నాడు. 

హత్య చేయాలని నిర్ణయించుకుని బిహార్‌కు చెందిన సుపారీ గ్యాంగ్ సభ్యుడు రింకుకుమార్‌తో రూ.2 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. రింకుకుమార్‌ తన సహచరులు రంజన్‌, నీరజ్‌లతో కలిసి మే 29న హైదరాబాద్‌కు వచ్చి హత్యకు పథకం రచించారు. మే 30న రాత్రి మీనాదేవిని మార్కెట్‌కు తీసుకెళ్లిన అనిల్‌, తిరుగు ప్రయాణంలో గండిగూడెం శివారులో బైక్‌ను ఆపాడు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న ముగ్గురు నిందితులు మీనాదేవిని పొదల్లోకి లాక్కెళ్లి గొంతు కోసి హత్య చేశారు.

 అనంతరం అనిల్‌పై కూడా దాడి చేసినట్లు నాటకం ఆడారు. గుర్తుతెలియని వ్యక్తులు భార్యను హత్య చేశారని అనిల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనిల్​ను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. సుపారీ గ్యాంగ్‌తో కలిసి మీనాదేవిని హత్య చేయించినట్లు ఒప్పుకున్నాడు. పోలీసులు బీహార్‌లోని పశ్చిమ చంపారన్‌ జిల్లా నుంచి సుపారీ సభ్యుడు రంజన్‌ను అరెస్ట్ చేసి హైదరాబాద్‌కు తీసుకొచ్చారు.