- ఐటీడీఏ పీవో బి.రాహుల్
భద్రాచలం, వెలుగు : గిరిజన ప్రాంతాల్లో గిరిజనుల సంక్షేమం, విద్యాభివృద్ధికి ఐటీడీఏ యాక్షన్‌ప్లాన్ అమలు చేస్తోందని పీవో బి.రాహుల్ పేర్కొన్నారు. ఇండియా హౌస్ టీం శనివారం భద్రాచలంలో పర్యటించి ట్రైబల్ మ్యూజియం, బాలికల ఆశ్రమ పాఠశాలను సందర్శించిన అనంతరం పీవోతో బేటీ అయ్యింది.
ఈ సందర్భంగా పీవో వారికి ఐటీడీఏ చేపడుతున్న సంక్షేమ పథకాలు వివరించారు. విద్య,వైద్యం , గిరిజన గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, కొండరెడ్ల సంక్షేమం, గిరిజన యువతీ, యువకుల్లో స్కిల్స్ పెంచడం, ఉద్యోగ,ఉపాధి అవకాశాలు కల్పించడం లాంటి కార్యక్రమాలతో డెవలప్ చేస్తున్నట్లు వివరించారు.
ప్రధానంగా వారి సంస్కృతి, సంప్రదాయాలను కాపాడటంలో అనేక సంస్కరణలు చేపట్టినట్లుగా తెలిపారు. గిరిజన మహిళలు తయారు చేసిన మిల్లెట్ బిస్కెట్లు లండన్ వరకు వెళ్లడం, ప్రధాని మోదీని మెప్పించడం లాంటి అంశాలు వారి జీవనోపాధికి చేపట్టిన చర్యల్లో భాగమేనన్నారు.
ఈ సందర్భంగా ఇండియా హౌస్ ప్రతినిధులు జాహ్నవి, సోనాలి గాడ్గే, డిప్యూటీ కలెక్టర్ మురళీ మాట్లాడుతూ ట్రైబల్ మ్యూజియం ఎంతో బాగుందని ప్రశంసించారు. విద్యాలయాల్లో ఏర్పాటు చేసిన వసతులు మెరుగ్గా ఉన్నాయని, విద్యావిధానం కూడా చక్కగా ఉందని పేర్కొన్నారు.
