- వైద్యులపై ఐటీడీఏ పీవో ఆగ్రహం
- ఎంవీఐతో కమిటీ ఏర్పాటు చేసి విచారణకు ఆదేశం
భద్రాచలం, వెలుగు : ఆస్పత్రి ప్రాంగణంలో ప్రైవేటు అంబులెన్సులు ఉండటంపై ఐటీడీఏ పీవో బి.రాహుల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భద్రాచలం ఏరియా ఆస్పత్రిని మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రి ముందు ఎక్కువ సంఖ్యలో అంబులెన్సులు నిలిపి ఉంచడంపై వైద్యుల నుంచి వివరణ కోరారు. ఎంవీఐ వెంకటపులయ్య ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేసి దీనిపై విచారణకు ఆదేశించారు. ప్రైవేటు అంబులెన్సులు నడిపే డ్రైవర్ల ధ్రువీకరణ పత్రాలు పరిశీలించి అనుభవజ్ఞులు లేకపోతే వాటిని సీజ్ చేయాలని సూచించారు. ఆస్పత్రిలో ఇన్, అవుట్ పేషెంట్లతో ఆయన మాట్లాడారు.
నిరుపేద ఆదివాసీలు వస్తుంటారని, అన్ని రకాల పరీక్షలు ఆస్పత్రిలోనే చేయాలని, ప్రైవేటు ల్యాబ్‌లకు పంపితే శాఖాపరమైన కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. లేబరేటరీ, ఆపరేషన్ థియేటర్, కాన్పుల గది, ఆల్ట్రా స్కానింగ్ గది, డ్రగ్ స్టోర్, మందుల రికార్డులను ఆయన తనిఖీ చేశారు. గర్భిణుల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అడిషనల్ డీఎంహెచ్‌వో సైదులు, సూపరింటెండెంట్ డాక్టర్రామకృష్ణ, ఎంవీఐ పుల్లయ్య, వైద్యులు పీవో వెంట ఉన్నారు.
