
- డ్యూటీల్లో చేరి12 రోజులవుతున్నా ఆలస్యం చేస్తున్న ప్రభుత్వం
మంచిర్యాల, వెలుగు: రెండున్నర సంవత్సరాలు డ్యూటీలకు దూరంగా ఉన్న ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్లను ఎట్టకేలకు ప్రభుత్వం విధుల్లోకి తీసుకోవడం తెలిసిందే. వాళ్లను రీ జాయినింగ్ చేసుకొని 12 రోజులవుతున్నా డ్యూటీల విషయంలో క్లారిటీ ఇస్తూ ఆర్డర్స్ రాకపోవడంతో అభద్రతా భావంతో ఉన్నారు. మరోవైపు, వివిధ కారణాలతో సస్పెండ్ అయిన ఫీల్డ్ అసిస్టెంట్లను, వాళ్ల స్థానంలో కొనసాగిన సీనియర్ మేట్లను తిరిగి జాయిన్ చేసుకోకపోవడంతో వారి భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది.
సమ్మె సాకుతో అందరిపై వేటు..
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 7,650 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు డిమాండ్ల సాధన కోసం 2020 మార్చి 12 నుంచి విధులు బహిష్కరించి సమ్మె చేశారు. దీంతో ప్రభుత్వం సమ్మె విరమించి విధుల్లో చేరాలని19న హుకుం జారీ చేసింది. కానీ ఫీల్డ్అసిస్టెంట్లు తమ డిమాండ్లు పరిష్కరించేదాకా విరమించేది లేదని స్పష్టం చేయడంతో 25వ తేదీన అందరినీ డ్యూటీల నుంచి తొలగించింది. దీంతో సర్కారు తీరుపై భగ్గుమన్న ఫీల్డ్అసిస్టెంట్లు వివిధ రూపాల్లో తమ నిరసన తెలిపారు. వీరి పోరాటానికి ప్రతిపక్ష పార్టీలు కూడా మద్దతు తెలిపాయి. ఈ నేపథ్యంలో ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకుంటామని సీఎం కేసీఆర్ గత అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటన చేశారు. ఈ నెల 10న పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్కుమార్సుల్తానియా, డైరెక్టర్ హనుమంతరావు హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, డీఆర్డీఓలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి ఫీల్డ్ అసిస్టెంట్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించారు.
7,300 మంది విధుల్లోకి...
ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 11 నుంచి రాష్ర్ట వ్యాప్తంగా 7,300 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు తిరిగి విధుల్లో చేరారు. వీరంతా ఆయా మండలాల్లోని ఎంపీడీఓ ఆఫీసుల్లో జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చారు. డ్యూటీల్లో చేరిన వారి వివరాలను డీఆర్డీఓలు ప్రభుత్వానికి పంపించారు. కానీ ఇంతవరకు రీ జాయినింగ్ ఆర్డర్స్ మాత్రం రాలేదు. కేవలం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్కుమార్సుల్తానియా ఇచ్చిన మౌఖిక ఆదేశాలతోనే వారు కొనసాగుతున్నారు. కాగా, మిగిలిన 350 మందిలో సుమారు 280 మంది వివిధ కారణాలతో సస్పెండ్ కాగా, 70 మంది దాకా చనిపోయారు. సమ్మె నాటికి ఉద్యోగంలో ఉన్న వాళ్లనే రీ జాయిన్ చేసుకోవాలని ప్రభుత్వం నుంచి జిల్లా అధికారులకు ఆదేశాలు రాగా అదే చేశారు. సస్పెండ్ అయిన ఫీల్డ్అసిస్టెంట్లు, వాళ్ల స్థానంలో కొనసాగిన సీనియర్ మేట్స్ గురించి ఎలాంటి ఆర్డర్స్ లేకపోవడంతో జాయిన్ చేసుకోలేదు.
పోతున్నరు... వస్తున్నరు...
ఫీల్డ్ అసిస్టెంట్లతో పాత పద్ధతిలోనే పని చేయించుకోవాలని ప్రభుత్వం ఆదేశించినప్పటికీ పూర్తి స్థాయిలో బాధ్యతలు అప్పగించలేదు. డ్యూటీలో జాయిన్ అయిన వాళ్లతో గ్రామ స్థాయిలో పంచాయతీ సెక్రెటరీ పని చేయించుకోవాలని అధికారులు సూచించారు. వాళ్లకు ఎలాంటి రికార్డులు అప్పగించరాదని, గతంలో మాదిరిగా మస్టర్లపై సంతకాలు తీసుకోరాదని మౌఖికంగా ఆదేశాలిచ్చారు. దీంతో ఫీల్డ్ అసిస్టెంట్లు రోజూ గ్రామపంచాయతీలకు వెళ్లి సెక్రెటరీలు చెప్పిన పనులు చేస్తున్నారు. అలాగే గతంలో నెలకు రూ.9,800 జీతం ఇవ్వగా, పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేసినప్పటికీ ప్రభుత్వం ఏమీ తేల్చలేదు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రూ.12 వేల నుంచి రూ.15 వేలు చెల్లిస్తామని హామీ ఇచ్చారని చెప్తున్నా ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిసింది. ఫీల్డ్అసిస్టెంట్లకు పూర్తి బాధ్యతలు అప్పగించకపోవడంతో తమకు పనిభారం ఏమాత్రం తగ్గలేదని సెక్రెటరీలు వాపోతున్నారు. రాష్ర్ట వ్యాప్తంగా 12,750 గ్రామపంచాయతీలు ఉండగా, ఫీల్డ్ అసిస్టెంట్లు 7,300 మందే ఉన్నారు. దీంతో ఒక్కొక్కరు రెండు మూడు గ్రామ పంచాయతీలకు ఇన్చార్జీలుగా కొనసాగుతున్నారు.