చంద్రుడిపై మళ్లీ ఎండ వస్తుంది.. మన విక్రమ్, ప్రజ్ణాన్ నిద్ర లేస్తాయా..?

చంద్రుడిపై మళ్లీ ఎండ వస్తుంది.. మన విక్రమ్, ప్రజ్ణాన్ నిద్ర లేస్తాయా..?

చంద్రుని దక్షిణ ధృవంపై సుదీర్ఘమైన చంద్రుని రాత్రి ముగియనుంది.  2023 ఆగస్టు 23న చంద్రయాన్ 3 మిషన్ లో భాగంగా చంద్రునిపై విక్రమ్ ల్యాండర్ ప్రగ్యాన్ రోవర్ దిగిన విషయం తెలిసిందే.  గత 14 రోజులుగా చంద్రుని దక్షిణ ధృవంపై  విక్రమ్ ల్యాండర్, ప్రగ్యాన్ రోవర్ స్లీపింగ్ మోడ్ లో ఉన్నాయి. అయితే సెప్టెంబర్ 22న చంద్రుపై రాత్రి సీజన్ ముగియనుంది. దీంతో నిద్రావస్థలో ఉన్న విక్రమ్ ల్యాండర్, ప్రగ్యాన్ రోవర్ లను మేల్కొంటాయని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) భావిస్తోంది. 

ఆగస్టు 23న చంద్రునిపై కాలుపెట్టిన విక్రమ్ ల్యాండర్, రోవర్లు..14రోజులపాటు చంద్రుని ఉపరితలంపై పరిశోధనలు జరిపి కీలక సమాచారం ఇస్రోకు చేరవేశాయి. ఆ తర్వాత ల్యాండర్, రోవర్లు దిగిన శివశక్తి ప్రాంతంలో సూర్యుడు అస్తమించడంతో ఇస్రో వ్యూహాత్మకంగా స్లీపింగ్ మోడ్ లోకి పంపించింది. ఇస్రో విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్‌ రోవర్లను నిద్ర నుండి మేల్కొల్పగలిగితే అది ఒక అద్భుతమైన ఇంజనీరింగ్ ఫీట్ అవుతుంది. చంద్రుని ఉపరితలంపై ప్రయోగాలు చేయడానికి అంతరిక్షసంస్థకు మరిన్ని అవకాశాలను అందిస్తుంది.

సెప్టెంబర్ 22న విక్రమ్ ల్యాండర్ మళ్లీ మేల్కొంటుందా?

చంద్రునిపై సూర్యాస్తమయంతో సెప్టెంబర్ 4న ప్రజ్ఞాన్ రోవర్ స్లీప్ మోడ్‌లో ఉంచబడింది.  చంద్రయాన్-3 బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ చేయబడింది.. సెప్టెంబర్ 22న చంద్రునిపై తదుపరి సూర్యోదయం సమయంలో సోలార్ ప్యానెల్ కాంతిని అందుకుంటుందని ఇస్రో తెలిపింది. విక్రమ్,  ప్రజ్ఞాన్ ఒక చాంద్రమాన రోజు జీవితకాలం (అంటే 14 భూమి రోజులు) ఉండేలా రూపొందించబడ్డాయి.. సెప్టెంబర్ 22 న తిరిగి విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్  మేల్కొనే అవకాశం ఉంది. మేల్కొనకపోతే వారు "భారత చంద్ర రాయబారిగా ఎప్పటికీ అక్కడే ఉంటాయి’ అని గతంలోనే ఇస్రో ఎక్స్‌లో రాసింది.