కష్టాలు వస్తే ఆడవాళ్లే ఏడ్వాలన్న భావన పోవాలి : ప్రియాంక చోప్రా

కష్టాలు వస్తే ఆడవాళ్లే  ఏడ్వాలన్న భావన పోవాలి : ప్రియాంక చోప్రా

2000లో మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకున్న ప్రముఖ నటి ప్రియాంక చోప్రా మరో సారి పే పార్శియాలిటీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ నుంచి హాలీవుడ్ కు వెళ్లడానికి గల కారణాన్ని ఇటీవలే వెల్లడించి సంచలనంగా మారిన ఆమె.. ఈ సారి పురుషులు, మహిళల మధ్య వేతన సమానత్వ సమస్యపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. తన జీవితంలో తన విజయానికి అడ్డుపడిన వాళ్లు, తోడ్పాడునందించిన వాళ్లూ ఉన్నారని ప్రియాంక చెప్పారు. సినిమా పరిశ్రమలో హీరోయిన్లకు సమానంగా రెమ్యునరేషన్ ఇస్తే కొందరు హీరోలు సహించలేరని తెలిపారు. ఇండస్ట్రీలో ఆడవాళ్లు ఎక్కువ సంపాదిస్తే..మగవాళ్లకు అభద్రతా భావం ఉంటుందన్న ఆమె..  వాళ్ల బలహీనతల గురించి మాట్లాడుతున్నందుకు క్షమించండి అని చెప్పుకొచ్చారు.

కానీ తన సక్సెస్ చూసి కుళ్లుకోని గొప్ప మగవాళ్లు కూడా తారసపడ్డారని, అదే సమయంలో తన సంపాదన చూసి అభద్రతాభావానికి గురైన హీరోలు, నటులను కూడా చూశానని ప్రియాంక చోప్రా చెప్పారు. ఫ్యామిలీలో పెద్దగా, సంపాదనపరులుగా ఉండటాన్ని మగవాళ్లు గర్వంగా ఫీలవుతారన్న ఆమె.. ఆడవాళ్లు విజయం సాధిస్తే మగవాళ్లు భరించలేరంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ మగవాడు ఇంటి వద్దే ఉండి.. మహిళలు బయటకు వెళ్లి సంపాదించిన వారికి కష్టమే. వాళ్లు ఆ విషయాన్ని కూడా వాళ్లు చాలా తప్పుగా భావిస్తారని చెప్పారు. ఆ తరహా ఫీలింగ్‌ను మార్చే శక్తి మహిళల్లోనే ఉందని, ఆడవాళ్ల సంపాదనను గౌరవించే జనరేషన్‌ రావడం ఆడవాళ్ల చేతిలోనే ఉందని ప్రియాంక చోప్రా చెప్పారు.

కష్టాలు వస్తే ఆడవాళ్లే  ఏడ్వాలి.. మగవాళ్లు ఏడవ కూడదనే విషయంపైనా అభిప్రాయాలను తొలగించాలని ప్రియాంక అన్నారు. అందు కోసం మన పిల్లలకు ఇప్పట్నుంచే లింగ వివక్ష విషయంలో ఎడ్యుకేట్ చేయాలన్నారు. బాధకలిగితే మగవాళ్లు కూడా ఏడవాలన్న ఆమె.. ఏడవడం అంటే సిగ్గుపడే విషయం కాదని మగవాడు తెలుసుకోవాలని బల్లగుద్దినట్టు చెప్పారు. చెల్లెలు, తల్లి, భార్య, ప్రియురాలు ఎవరైనా సరే వారికి సుముచిత గౌరవం ఇవ్వాలని తెలిపారు. తన ఇంట్లో నాన్న కంటే అమ్మ ఎక్కువగా సంపాదించేదని, అయినా నాన్నలో ఎలాంటి అభ్యంతరాలు లేవని ప్రియాంక చెప్పారు. అమ్మ సంపాదించేది ఇంటికే, పిల్లలకే ఉపయోగపడుతున్నదనే భావనలో నాన్న ఉండేవారన్నారు. ఆయనకు ఎలాంటి ఇగో లేకపోయేదని తెలిపారు. ప్రస్తుతం తన భర్త నిక్ జోనస్ కూడా అలానే ఉంటాడని, తాను రెడ్ కార్పెట్ మీద నడుస్తుంటే.. తన పక్కనే ఉండి ప్రోత్సాహించాడని గొప్పగా చెప్పుకున్నారు. తన భర్త తీరు నిజంగా తనను గర్వపడేలా చేస్తుందంటూ  ప్రియాంక చోప్రా స్పష్టం చేశారు.

సినీ పరిశ్రమలో 22 ఏళ్ల సుదీర్ఘమైన కెరీర్‌లో సిటాడెల్ సిరీస్‌కు ప్రత్యేకమైన స్థానం ఉంది. అయితే సిటాడెల్ తనకు మంచి అనుభూతులను పంచిందని, హాలీవుడ్ హీరోకు రిచర్డ్ మ్యాడెన్‌కు, తనకు సమానంగా రెమ్యునరేషన్ ఇచ్చారని తాజాగా ప్రియాంక ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అదే సమయంలో ఆడ, మగ వాళ్లకు సమానత్వంపై ఈ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

https://twitter.com/ANI/status/1648324425132146693