పిల్లల్ని ఎత్తుకెళ్లే మాఫియాతో.. ఐవీఎఫ్ సెంటర్లకు లింక్

పిల్లల్ని ఎత్తుకెళ్లే మాఫియాతో.. ఐవీఎఫ్ సెంటర్లకు లింక్
  • హైదరాబాద్‌లో తీగలాగితే వివిధ రాష్ట్రాల్లో కదులుతున్న డొంక
  • డాక్టర్లు, నర్సులు,ఏజెంట్లు కలిసి నెట్​వర్క్​
  • కొనుగోలు చేసిన శిశువులను సరోగసీ పిల్లలుగా చూపి లక్షలు లూటీ చేస్తున్న సంతాన సాఫల్య కేంద్రాలు

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌‌లోని సృష్టి ఐవీఎఫ్ సెంటర్ వ్యవహారంతో దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న అంతరాష్ట్ర చైల్డ్ ట్రాఫికింగ్ మాఫియా, అక్రమ ఐవీఎఫ్ సెంటర్ల గుట్టు రట్టవుతున్నది. ఒక ఐవీఎఫ్ సెంటర్‌‌పై దర్యాప్తు మొదలుపెడితే.. దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని ముఠాల కార్యకలాపాలు వెలుగులోకి వస్తున్నాయి. పుట్టిన శిశువులను అపహరించి లేదా  కొనుగోలు చేసి.. వారిని సరోగసీ పిల్లలుగా చూపించి లక్షల రూపాయలు అక్రమంగా సంపాదిస్తున్న ముఠాలు పట్టుబడుతున్నాయి. ఈ అంతర్రాష్ట్ర దందాలో మాఫియా సభ్యులతోపాటు వివిధ రాష్ట్రాల్లోని ఐవీఎఫ్ సెంటర్లలో పనిచేస్తున్న కొంతమంది అక్రమ డాక్టర్లు, నర్సులు, ఏజెంట్లు కలిసి ఒక పటిష్టమైన నెట్‌‌వర్క్‌‌గా పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వీరంతా పరస్పర సహకారం.. నకిలీ ధ్రువీకరణ పత్రాలతో పిల్లలను రవాణా చేస్తూ,   చివరకు దంపతులకు అప్పగించే ప్రక్రియను పూర్తి చేస్తున్నట్లు తేల్చారు.


ఈ చైల్డ్ మాఫియా.. నిరుపేద, నిరక్షరాస్య కుటుంబాలను లక్ష్యంగా చేసుకుంటున్నది. సంతానం లేని దంపతులను ఐవీఎఫ్​ సెంటర్లు లక్ష్యంగా చేసుకొని, వారికి మోసపూరితంగా సరోగసీ ద్వారా పిల్లలు పుట్టినట్లు నమ్మబలుకుతున్నాయి.  ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల నుంచి పిల్లలను కొనుగోలు చేయడం, ఆసుపత్రుల నుంచి లేదా అనాథ శరణాలయాల నుంచి పిల్లలను అపహరించడం ద్వారా ఈ దందా కొనసాగిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో పిల్లలు కావాలనుకునే వారికి ఐవీఎఫ్ ప్రక్రియ అవసరం లేకపోయినా.. ఐవీఎఫ్, సరోగసీ జరిగినట్లుగా నమ్మబలుకుతూ అందినకాడికి దోచుకుంటున్నారు. 

మెయిన్​ అడ్డా ఐవీఎఫ్ సెంటర్లే

ఈ దారుణమైన నేరంలో ఐవీఎఫ్ సెంటర్ల పాత్ర కీలకంగా ఉన్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. సాధారణంగా ఐవీఎఫ్ సెంటర్లు సంతానం లేని దంపతులకు చికిత్స అందిస్తాయి. కానీ కొన్ని ఐవీఎఫ్ సెంటర్లు అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు తేలింది. చైల్డ్ మాఫియా కొనుగోలు చేసిన, అపహరించిన పిల్లలను ఈ సెంటర్లు ‘సరోగసీ ద్వారా పుట్టిన పిల్లలు’గా చూపి, నమ్మిన దంపతుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నాయి. ఈ ప్రక్రియలో అవసరమైన అన్ని నిబంధనలను ఉల్లంఘిస్తూ నకిలీ పత్రాలను సృష్టిస్తున్నారు. ఆసుపత్రుల్లోని సిబ్బందితో సంబంధాలు పెట్టుకొని, పుట్టిన వెంటనే శిశువులను అపహరించడం లేదా తల్లిదండ్రులకు తెలియకుండానే బేరం కుదుర్చుకుంటున్నారు. ముఖ్యంగా.. ఆరోగ్య సమస్యలతో పుట్టిన పిల్లలు లేదా ఆడపిల్లలపై ఆసక్తి లేని తల్లిదండ్రులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. కొన్ని అనాథ శరణాలయాల్లోని అవినీతిపరులైన సిబ్బందితో కలిసి  పిల్లలను అక్రమంగా విక్రయిస్తున్నట్లు కూడా తెలిసింది. ఈ ఐవీఎఫ్ సెంటర్లకు పని సులభంగా అవ్వడం, లక్షల్లో డబ్బులు వస్తుండటంతో అక్రమ పద్ధతులకే మొగ్గు చూపుతున్నారు.

దేశవ్యాప్తంగా విస్తరించిన మాఫియా

పోలీసుల దర్యాప్తులో హైదరాబాద్‌‌లోని కొన్ని ఐవీఎఫ్ సెంటర్లు, కొంతమంది డాక్టర్లు, మధ్యవర్తులు ఈ నేరంలో పాలుపంచుకున్నట్లు తేలింది. హైదరాబాద్‌‌లో కేసు నమోదయ్యాక దర్యాప్తు చేస్తున్నా కొద్దీ కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌‌లాంటి అనేక రాష్ట్రాల్లో ఈ ముఠాకు సంబంధాలున్నట్లు ప్రాథమికంగా ఆధారాలు లభ్యమయ్యాయి. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో ముఠా సభ్యుడు కీలక పాత్ర పోషిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వీరంతా చైన్​సిస్టమ్‌‌గా ఏర్పడి, వేర్వేరు రాష్ట్రాల్లో పిల్లలను సేకరించి, మరొక రాష్ట్రంలో విక్రయించడం ద్వారా  సులభంగా దొరక్కుండా తప్పించుకుంటున్నారు. ఒక రాష్ట్రంలో దర్యాప్తు జరిగితే, మరొక రాష్ట్రంలో  కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. పైగా, అటు పిల్లల తల్లిదండ్రుల నుంచి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నారు. కొన్ని రాష్ట్రాల్లో ఆర్థికంగా వెనుకబడిన, గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేద కుటుంబాలు ఎక్కువగా ఉన్నచోట చైల్డ్ ట్రాఫికింగ్ దందాలు చేస్తున్నారు. అక్కడ పిల్లలను కొనుగోలు చేసి.. పిల్లలు లేక ఇబ్బందులు పడుతూ ఐవీఎఫ్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ డిమాండ్ ఉన్న హైదరాబాద్​ లాంటి ప్రాంతాలకు పంపిస్తున్నారు. ఇదంతా పక్కా ప్రణాళికతో జరుగుతున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.

నకిలీ పత్రాలు.. రూ.లక్షల్లో వసూలు

పిల్లల్ని విక్రయించడం ద్వారా ఈ సెంటర్లు, మాఫియా సభ్యులు భారీగా లబ్ధి పొందుతున్నారు. చైల్డ్ ట్రాఫికింగ్, అక్రమ సరోగసీలో పిల్లల జననం, తల్లిదండ్రుల వివరాలు, సరోగసీ ఒప్పందాలు, వైద్య నివేదికలన్ని నకిలీ పత్రాలను సృష్టిస్తున్నారు. ఈ పత్రాలు చట్టబద్ధమైనవిగా కనిపించేలా జాగ్రత్తలు తీసుకుంటూ జంటలను నమ్మిస్తున్నారు. అన్ని పత్రాలు సిద్ధం అయ్యాక, పిల్లలను దంపతులకు అప్పగిస్తున్నారు. దీంతో దంపతులు తమ పిల్లలే అని నమ్ముతున్నారు. ఈ దశలో ఐవీఎఫ్ చికిత్స ఖర్చులు, సరోగసీ ఖర్చులు, లీగల్ చార్జీలు అంటూ లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. నిరుపేద కుటుంబాల నుంచి పిల్లలను కొనుగోలు చేసేందుకు రూ.50వేల లోపే ఖర్చు చేస్తున్నారు.  ఆసుపత్రుల సిబ్బందికి ఇచ్చే కమిషన్ కూడా ఇందులోనే ఉంటుంది. అయితే, పిల్లలు కావాలనుకునే దంపతుల వద్ద రూ.20 లక్షల నుంచి రూ. 40 లక్షల వరకు.. అంతకు మించి వసూలు చేస్తున్నారు. వసూలు చేసిన దాన్ని మాఫియా నాయకులు, ఐవీఎఫ్ సెంటర్ యజమానులు, డాక్టర్లు, మధ్యవర్తులు, పిల్లలను సేకరించిన వ్యక్తులు, నకిలీ పత్రాలు తయారు చేసేవారు పంచుకుంటున్నారు.