కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులరైజ్ చేయాలి: జేఏసీ నేతలు

కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులరైజ్ చేయాలి: జేఏసీ నేతలు
  • ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద
  • ఓయూ కాంట్రాక్ట్ టీచర్స్ జేఏసీ నిరసన 

ముషీరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని 12 యూనివర్సిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను వెంటనే రెగ్యులరైజ్ చేయాలని ఓయూ కాంట్రాక్ట్ టీచర్స్ జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం ట్యాంక్​బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు క్యాండిల్స్​తో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ పరశురాం, డాక్టర్ ధర్మతేజ, డాక్టర్ రామేశ్వర్, డాక్టర్ వినీత, డాక్టర్ ఉపేందర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ డిగ్రీ జూనియర్ పాలిటెక్నిక్ కాలేజీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్లను రెగ్యులర్ చేసి యూనివర్సిటీల్లో పనిచేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్లను పట్టించుకోకపోవడం చాలా బాధాకరమన్నారు.

రాష్ట్రంలోని వర్సిటీల్లో కాంటాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లతోనే  ఉన్నత విద్య సజావుగా అందుతుందని.. అలాంటివారిని రెగ్యులర్ చేయకపోవడం యూనివర్సిటీ విద్యను నిర్లక్ష్యం చేయడమేనన్నారు.  జీవో నం.16 యూజీసీ రూల్స్​లో పేర్కొన్న అన్ని నియమాల ప్రకారం విద్యార్హతలు ఉండి 30 ఏండ్లుగా తామంతా యూనివర్సిటీల్లో పనిచేస్తున్నామని తెలిపారు. కాంట్రాక్ట్ లెక్చరర్లను రెగ్యులర్ చేస్తామని  సీఎం కేసీఆర్ చాలాసార్లు హామీ ఇచ్చారని.. ఇప్పటికైనా తమను పర్మినెంట్ చేస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం రెగ్యులరైజేషన్ డిమాండ్​ను అంగీకరించేంతవరకు రాష్ట్రంలోని 12 యూనివర్సిటీల్లో కాంటాక్ట్ అధ్యాపకులు వివిధ రూపాలలో నిరసన కార్యక్రమాలు చేపడతారని వారు చెప్పారు.