డబ్ల్యూటీసీ ఫైనల్‌లో జడ్డూను ఆడించాల్సిందే

డబ్ల్యూటీసీ ఫైనల్‌లో జడ్డూను ఆడించాల్సిందే

ముంబై: డబ్ల్యూటీసీ ఫైనల్‌కు కొన్ని గంటల సమయమే మిగిలి ఉంది. ఈ మ్యాచ్‌పై క్రికెట్ ఫ్యాన్స్‌లో ఓ రేంజ్‌లో అంచనాలు నెలకొన్నాయి. రెండు పటిష్ట జట్లు ఆడుతున్నందున సంప్రదాయ టెస్ట్ క్రికెట్ మజాను ఎంజాయ్ చేసేందుకు అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ విషయాన్ని పక్కనబెడితే.. తుదిజట్టులో ఎవర్ని ఆడించాలనే దానిపై ఇరు జట్లు సందిగ్ధంలో ఉన్నాయి. ముఖ్యంగా టీమిండియా ఫైనల్ ఎలెవన్‌లో ఎవరు ఆడతారనే దానిపై విశ్లేషకులు, ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత జట్టులో ఆల్‌‌రౌండర్ రవీంద్ర జడేజాను ఎలాగైనా ఆడించాలని భారత మాజీ కోచ్, చీఫ్ సెలెక్టర్ గైక్వాడ్ సూచించాడు.

‘న్యూజిలాండ్‌లా భారత్‌కు కూడా మ్యాచ్ ప్రాక్టీస్ ఉంటే బాగుండేది. ఇంగ్లండ్‌తో రెండు టెస్టులు ఆడటం వల్ల ఇక్కడి వాతావరణపై కివీస్‌కు మంచి అవగాహన ఏర్పడింది. ఇది పక్కాగా వారికి లాభిస్తుంది. కానీ భారత ఆటగాళ్లకు కూడా ఇక్కడ ఆడిన అనుభవం ఉంది. వారికి ఇక్కడి పరిస్థితులపై మంచి అవగాహన ఉన్నందున టీమిండియా అవకాశాలను కొట్టిపారేయలేం. ఆస్ట్రేలియాతోపాటు సొంత గడ్డపై ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన భారత్‌‌ సూపర్బ్ కాన్ఫిడెన్స్‌తో ఉంది. అందుకే డబ్ల్యూటీసీ ఫైనల్ తొలి రెండ్రోజులు ఎలా ఉంటుందనేది చాలా కీలకం‘ అని గైక్వాడ్ పేర్కొన్నాడు. 

‘భారత జట్టు విషయానికొస్తే.. రోహిత్ ఓ క్లాస్ ప్లేయర్. అతడికి మంచి ఆరంభం లభిస్తే బౌలర్లను ఊచకోత కోస్తాడు. కోహ్లీ ఆటతీరును బట్టి మిడిలార్డర్ రాణింపు ఆధారపడి ఉంటుంది. పుజారా ఎంత ఓపికతో క్రీజులో నిలిస్తే భారత్‌కు అంత లాభిస్తుంది. జడేజాను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకూడదు. అతడ్ని తుదిజట్టులో ఆడించాల్సిందే. అతడో ట్రిపుల్ ప్లస్ ప్లేయర్. లెఫ్టార్మ్ స్పిన్‌తోపాటు బ్యాటింగ్, అద్భుతమైన ఫీల్డింగ్ చేయగలగడం జడేజా సొంతం. ఇంకేం కావాలి. అలాంటి ప్లేయర్‌ జట్టులో ఉంటే టీమ్ మనోబలం కూడా ఎంతో పెరుగుతుంది’ అని గైక్వాడ్ వివరించాడు.