IND vs ENG: జైశ్వాల్‌కు అన్యాయం.. డబుల్ సెంచరీ చేసినా వరించని అవార్డు

 IND vs ENG: జైశ్వాల్‌కు అన్యాయం.. డబుల్ సెంచరీ చేసినా వరించని అవార్డు

రాజ్‌కోట్ టెస్టులో టీమిండియా విజయకేతనం ఎగరవేసింది. ఇంగ్లీష్ బజ్‌బాల్ వీరులను చిత్తుచేస్తూ ఏకంగా 434 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. భారత్ నిర్ధేశించిన 557 పరుగుల ఛేదనలో ఇంగ్లాండ్ 122 పరుగులకే పరిమితమైంది. ఈ గెలుపుతో టీమిండియా 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలో నిలిచింది. అయితే, ఇక్కడ ఓ సమస్య తెరమీదకు వస్తోంది. విజయం మాట బాగానే ఉన్నా.. ఆ విజయానికి కారణమైన యువ క్రికెటర్‌కు అన్యాయం జరిగిందనేది నెటిజనుల వాదన. ఏంటా ఆ అన్యాయం..? వారి ఆరోపణ నిజమేనా..? అనేది ఇప్పుడు చూద్దాం.. 

జడేజా vs జైశ్వాల్‌

మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన రవీంద్ర జడేజా(112).. రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ కు రాలేదు. అయితే, అతడు తన బౌలింగ్ అస్త్రంతో ఇంగ్లాండ్ బ్యాటర్లను వణికించాడు. ఐదు వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్ ఓటమిని శాసించాడు. ఈ ప్రదర్శనకుగానూ అతన్ని 'ప్లేయర్ అఫ్ ది మ్యాచ్' అవార్డు వరించింది. అయితే, ఈ అవార్డుకు యశస్వి జైశ్వాల్‌(214) అర్హుడన్నది నెటిజనుల వాదన. అతడు డబుల్ సెంచరీ చేయడంతోనే ఇంగ్లాండ్ ముందు భారీ లక్ష్యం నిర్ధేశించగలిగామని, అతన్ని ప్లేయర్ అఫ్ ది మ్యాచ్‌గా ప్రకటించి ఉంటే బాగుండేదని కామెంట్లు చేస్తున్నారు.

వైజాగ్ టెస్టులోనూ అదే అన్యాయం

విశాఖ సాగర తీరాన భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన రెండో టెస్టులోనూ జైస్వాల్ డబుల్ సెంచరీ సాధించాడు. ఒక ఎండ్‌లో సహచర బ్యాటర్లు వీడుతున్నా.. తాను ఇంగ్లీష్ బౌలర్లపై ఒంటరి పోరాటం చేశాడు. 290 బంతుల్లో 19 ఫోర్లు, 7 సిక్స్‌ల సాయంతో 209 పరుగులు చేశాడు. అయినప్పటికీ.. అతన్ని ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ అవార్డు వరించలేదు. రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్లతో సత్తా చాటిన బుమ్రాను ఆ అవార్డు వరించింది. దీంతో క్రికెట్ అభిమానులు మ్యాచ్ రిఫరీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యువ క్రికెటర్‌కు అన్యాయం చేశారని ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై మేనేజ్మెంట్ స్పందన ఎలా ఉంటదో వేచి చూడాలి.