యాదాద్రి థర్మల్‌‌ ప్లాంట్‌‌పై కేంద్రం కుట్ర: జగదీశ్ రెడ్డి

యాదాద్రి థర్మల్‌‌ ప్లాంట్‌‌పై కేంద్రం కుట్ర:  జగదీశ్ రెడ్డి
  • అనుమతులు ఇవ్వడంలో కావాలనే జాప్యం 
  • కరెంట్‌‌ గురించి కాంగ్రెస్‌‌ లీడర్లు మాట్లాడడం హాస్యాస్పదం

సూర్యాపేట, వెలుగు: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యాదాద్రి థర్మల్ అల్ట్రా మెగా పవర్ ప్లాంట్‌‌కు అనుమతులు ఇవ్వడంలో కేంద్రం జాప్యం చేస్తోందని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ఆరోపించారు. శనివారం సూర్యాపేటలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని మోడీ రాష్ట్రానికి ఎప్పుడు వచ్చినా మొండి చెయ్యి చూపుతున్నారని, ఈ పర్యటనలోనైనా యాదాద్రి విద్యుత్ ప్లాంట్‌‌కు అనుమతులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.  తొమ్మిది నెలల్లో టర్మ్ ఆఫ్ రిఫరెన్స్ ఇవ్వాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలను కేంద్రం బేఖాతర్ చేస్తోందని మండిపడ్డారు. 

యాదాద్రి ప్లాంట్ రాష్ట్ర రైతాంగానికి గుండెకాయలా మారుతుందనే ప్రధాని మోదీ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.  రాష్ట్రానికి ప్రోత్సాహం ఇవ్వకపోగా కావాలని అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  రాష్ట్రంలో అడుగు పెట్టే ముందే ఉత్తర్వులు రావాలని డిమాండ్ చేశారు.  సాగుకు 3 గంటల విద్యుత్‌‌ చాలన్న కాంగ్రెస్‌‌ నేతలు కరెంట్ గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు.  ఉచిత విద్యుత్ ప్రతిపక్షాలకు కంటగింపుగా మారిందని విమర్శించారు.  రాష్ట్రంలో ఎక్కడా వరి చేన్లు ఎండిపోలేదని కావాలనే  అబద్దాలు   ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  

అర్హులందరికీ ఇండ్లు.. 

గృహలక్ష్మి పథకం కింద అర్హులందరికీ ఇండ్లు నిర్మిస్తామని, తెలంగాణలో ఇల్లు లేని మనిషి ఉండకూడదనేది సీఎం కేసీఆర్ తపన అని మంత్రి  జగదీశ్ రెడ్డి అన్నారు. శనివారం సూర్యాపేట నియోజకవర్గంలోని ఆత్మకూర్, చివ్వెంల, సూర్యాపేట రూరల్ మండలాలకు సంబంధించిన 1700 మంది  లబ్ధిదారులకు గృహలక్ష్మి మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ...  రాష్ట్రాన్ని 60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్‌‌తో సూర్యాపేటకు ఒరిగిందేమీ లేదని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చిన తొమ్మిదేళ్లలోనే రూ. 7500 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని వివరించారు.  గతంలో కేవలం రూ.200 పింఛన్‌‌ ఇచ్చిన కాంగ్రెస్‌‌.. ఇప్పుడు ఆరు గ్యారంటీల పేరిట ప్రజలను మోసం చేయాలని చూస్తోందని మండిపడ్డారు. 

కాంగ్రెస్‌‌ పాలత రాష్ట్రాల్లో రూ. 600 పింఛన్‌‌ కూడా ఇవ్వడం లేదని ఇక్కడ రూ.4 వేలు ఇస్తామని చెబుతోందని ఎద్దేవా చేశారు.  డబుల్‌‌ బెడ్  రూమ్ ఇండ్లు రాని వారు నిరాశ చెంద వద్దని, వారికి గృహలక్ష్మి ద్వారా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.   మెడికల్ కాలేజ్ ద్వారా సూర్యాపేట మెడికల్ హబ్‌‌గా మారిందని, మరో రెండురోజుల్లో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌‌ నేతృత్వంలో  200 మంది ఐటీ ఉద్యోగులతో ఐటీ హబ్‌‌ను కూడా ప్రారంభించబోతున్నామని వెల్లడించారు.