
- కేజ్రీవాల్ అరెస్టుపై జర్మనీ, అమెరికాకు ధన్ఖడ్ హితవు
- భారత్ బలమైన న్యాయవ్యవస్థ కలిగిన ప్రజాస్వామ్యమని వ్యాఖ్య
న్యూఢిల్లీ: పరిపాలనపై భారత్ కు ఎవరూ పాఠాలు నేర్పాల్సిన అవసరం లేదని ఉపాధ్యక్షుడు జగ్ దీప్ ధన్ఖడ్ అన్నారు. లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ అరెస్టుపై జర్మనీ, అమెరికా, యూఎన్ జోక్యం చేసుకున్న నేపథ్యంలో ఆయన స్పందించారు. ఢిల్లీలో నిర్వహించిన ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ 70వ వ్యవస్థాపక దినోత్సవంలో మాట్లాడారు. భారత్ బలమైన న్యాయవ్యవస్థ కలిగిన దేశంగా ఆయన అభివర్ణించారు. చట్టాలను ఉల్లంఘించిన వారి విషయంలో ఎలా ప్రవర్తించాలో ఇండియాకు తెలుసని, ఎవరూ భారత్ కు పాఠాలు నేర్పాల్సిన అవసరం లేదని జర్మనీ, అమెరికా, యూఎన్ కు హితవు పలికారు. చట్టం తన పని తాను చేసుకుపోతున్నపుడు కొంతమంది వీధికెక్కి నిరసన ప్రదర్శనలు చేస్తారని ప్రతిపక్షాలపై ఆయన మండిపడ్డారు. తప్పుచేసిన వారు విక్టిమ్ కార్డు చూపుతూ అమాయకత్వం నటిస్తున్నారని విమర్శించారు. ‘‘అవినీతికి పాల్పడిన వారు తప్పక జైలుకు వెళ్లాల్సిందే. వారిని ఎలాంటి పరిస్థితుల్లోనూ ఉపేక్షించకూడదు” అని ధన్ఖడ్ వ్యాఖ్యానించారు.